ఎమ్ఎఫ్ హుస్సేన్‌కు గూగుల్ పట్టం
న్యూఢిల్లీ: భారతీయ పికాసో, అరుదైన చిత్రకారుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అరుదైన చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ శతజయంతి ఇవ్వాళ.. సెలబ్రిటీ స్టేటస్ అరుదైన తొలి చిత్రకారుడుగా ఎంత పేరు సాధించాడో.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచాడు. స్వయంగా దేశ బహిష్కార శిక్ష విధించుకున్నా.. తుదకంటా.. భారతీయుడిగా ఉంటాననే మాటకు కట్టుబడ్డాడు..ఆయన శత జయంతికి గూగుల్ ఘనంగా నివాళులర్పించింది.
భారతీయ లెజెండరీ చిత్రకాడు ఎమ్మ్ ఎఫ్ హుస్సేన్ మహరాష్ట్రలోని పండర్ పూర్ లో సెప్టెంబర్ 17న జన్మించారు. హుస్సేన్ తల్లి అతడు రెండేళ్ల బిడ్డగా ఉన్నప్పుడే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఇండోర్ వెళ్లిపోయాడు. 1935లో హుస్సేన్ ముంబై సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. మొదట్లో సినిమా హోర్డింగ్ లు, పెయింటింగ్ చేసేవాడు. తర్వాత అంచలంచలుగా ఎదిగి.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచాడు. భారత దేశపు ప్రసిద్ద చిత్రకారుల సరసన చేరాడు. ఆయన వేసిన చిత్రాలకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 1973 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ అవార్డుతో సత్కరించింది. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.
హైదరాబాద్ తో అనుబంధం
ఎమ్ ఎఫ్ హుస్సేన్ కి హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా పోస్టర్లు చిత్రించే రోజుల్లో ఆయన హైదరాబాద్ లోనే ఉండేవారు. తర్వాత కాలంలో కూడా తరచూ హైదరాబాద్ సందర్శించే వారు. ఆయన పేరిట ఇప్పటికీ నగరంలో సినిమా ఘర్ ఉంది. ఆయన చేతి నుంచి జాలువారిన సినిమా పోస్టర్లు, ఆయన ఉపయోగించిన వస్తువులు ఈ ఇంట్లో భద్రపరిచారు.
అరుదైన ఘనతలు
భారత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న కళాకారుడిగా.. ఎమ్ ఎఫ్ హుస్సేన్ ఖ్యాతి గాంచాడు. అతని కుంచె నుంచి జాలువారిన ఎన్నో కళాఖండాలు కోట్ల రూపాయల ధర పలికాయి. ఆయన చిత్రాల్లో న్యూడ్ గ్నీన్ లీవ్స్ అండ్ బస్ట్ 106 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ 475 కోట్లు. ఇప్పటికీ ఇది ఒక రికార్డు.
సినిమాలో...
తొలి నాళ్లలో సినిమా పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్.. తర్వాత సినిమా రంగాన్ని వదిలేశారు. అయితే చిత్రకారుడిగా ప్రసిద్ది గాంచిన తర్వాత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, టబులతో సినిమాలు నిర్మించారు. మాధురీ దీక్షిత్ తో చేసిన గజగామిని, టబుతో నిర్మించిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
వివాదాలు..
అరుదైన చిత్రకారుడుగా.. సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ జీవితంలో వివాదాలు కూడా చాలా నే ఉన్నాయి. 1990 ప్రాంతంలో ఆయనపై వివాదాల తుఫాన్ రేగింది. హిందూ దేవతా చిత్రాలను అర్థ నగ్నంగా, అసభ్యంగా చిత్రించాడని ఆభియోగాలు నమోదయ్యాయి. 1998లో భజరంగ్ దళ్ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఒక వర్గం మనోభావాలు గాయపడ్డాయన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆస్తులను జప్తు చేసి.. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో హుస్సేన్ తనకు తాను దేశ బహిష్కరణ శిక్ష విధించుకున్నాడు. ఖతార్ దేశం హుస్సేన్ కు పౌర సత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఖతార్ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన హుస్సేన్ తాను ఎప్పటికీ భారతీయుడినే అని..తన జన్మభూమి భారత్ అని ప్రకటించాడు. చివరికి 2011 జూన్ 9న లండన్ లో గుండెపోటుతో పరాయిగడ్డపై తుది స్వాస విడిచాడు.