ఎర్రకోట మనదే
చెన్నై, సాక్షి ప్రతినిధి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 26వ వర్ధంతి వేడుకలను అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మెరీనా బీచ్ వద్ద నున్న ఎంజీఆర్ సమాధి వద్దకు తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఘన నివాళులర్పించారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎంజీఆర్ చిత్రపటాలను ఉంచి నివాళులర్పించారు. ఎంజీఆర్ విగ్రహాల ను పూలమాలలతో ముంచెత్తారు. ఉదయం 10.45 గంటలకు సీఎం జయ సమాధి వద్దకు చేరుకున్నారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆమెను అనుసరించారు. ఎంజీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి జయ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ ప్రతిజ్ఞా పత్రాన్ని చదివారు. మూడో ఫ్రంట్ ఏర్పడినా, లోక్సభ ఫలితాల తరువాత సమీకరణల ప్రభావం వల్ల అన్నాడీఎంకే కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న గట్టినమ్మకంతో ఉంది. అయితే ఇందుకు రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను అన్నాడీఎంకే కైవసం చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలోని 39తోపాటూ పుదుచ్చేరిలోని ఒక్కటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించాలని ఈనెల 19వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో అధినేత్రి జయ కర్తవ్యబోధ చేశారు. అన్నాడీఎంకే ఎర్రకోటను దక్కించుకోవడం ఖాయమని ఆ సమావేశంలో ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే ఁనేటి ముఖ్యమంత్రి, రేపటి ప్రధాన మంత్రిరూ. అనే నినాదాలతో నగరం నలుమూలలా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.
డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి సైతం 40 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని, రాష్ట్రంలో తమ పార్టీ బలపడిందని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు జవాబుగా ఎంజీఆర్ సమాధి వద్ద సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఁచెన్నైలోని జార్జికోట (సచివాలయం) మనదే, ఢిల్లీలోని ఎర్రకోట మనదేరూ. అంటూ ఎంజీఆర్ సమాధి సాక్షిగా అన్నాడీఎంకే ప్రతిజ్ఞ చేశారు. అమ్మ ప్రధాని అయినా రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలనే కొనసాగుతుందని చాటారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం హోదాలో జయ అరెస్టయినపుడు మంత్రి పన్నీర్ సెల్వంను ఆమె ముఖ్యమంత్రిగా నియమించారు. అమ్మ ఆశిస్తున్నట్లుగా ఒక వేళ ప్రధాని అయితే మళ్లీ పన్నీర్సెల్వానికే ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే ఉహాగానాలు అప్పుడే మొదలయ్యూరుు. అమ్మను ప్రధానిని చేయాలనే పట్టుదలను పార్టీ ప్రదర్శించడం క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది.
కొడనాడుకు వెళ్లిన సీఎం జయ: ఎంజీఆర్ వ ర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జయ నీలగిరి జిల్లాలోని ఆమె విశ్రాంతి ప్రదేశమైన కొడనాడుకు వెళ్లారు. జయ నెచ్చెలి శశికళ, వ్యక్తిగత కార్యదర్శి రామలింగం సహా 8మందితో మంగళవారం మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రత్యేక విమానంలో పయనమయ్యూరు. ఆమె తిరిగి ఎప్పుడు చెన్నై చేరుకునేది సమాచారం లేదు. ఇటీవల పార్టీ సమావేశంలో పేర్కొన్న అంశాలను ప్రచారం చేసేందుకు ఈనెల 28, 29 తేదీల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆమె ఆదేశించి, అక్కడి నుంచి బయలుదేరారు.