ఎంజీఆర్ అల్లుడి హత్యకేసులో ఏడుగురికి జీవితఖైదు
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె బాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది.
ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న అళ్వార్ పేటలో హత్యకు గురైయ్యారు. ఆయనను కారుతో గుద్ది, ఇనుప రాడ్లతో మోది చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు. దాదాపు 70 మంది కోర్టులో సాక్ష్యమిచ్చారు. కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి భర్తను బాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో తేలింది. ఆస్తి తగాదాలతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు రుజువైంది. కానిస్టేబుల్ కరుణకు బాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. బానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది.
కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ స్పందించారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తకు చివరికి న్యాయం దక్కిందన్నారు.