అక్టోబర్ నుంచి నగదు బదిలీ
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: జిల్లాలో నగదు బదిలీ పథకం అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని పౌరసరఫరాల జిల్లా అధికారి ఎం.గౌరీశంకర్ తెలిపారు. అశ్వరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 85శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. నగదు బదిలీని అక్టోబర్ నెలలో జిల్లాలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు అక్టోబర్ కల్లా ఆధార్ నంబరును ఎల్పీజీ డీలర్‌కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకోకున్నా మూడు నెలలపాటు సబ్సిడీ అందుతుందని, ఆతర్వాత బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. రచ్చబండ రెండో దశలో వచ్చి రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. రేషన్‌కార్డుల నంబర్లు జారీ అయ్యాయని, లబ్ధిదారుల ఫొటోలు సేకరించి వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే కార్డులు జారీ చేస్తామని తెలిపారు.
రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు తహశీల్దార్ కార్యాలయాల్లోని జాబితాను చూసుకోవాలన్నారు. కార్డు మంజూరైన వారు ఫొటోలను కార్యాలయంలో అందించాలని సూచించారు. జిల్లాలో 29,800 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అశ్వారావుపేట మండలంలో 261 కార్డులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఫొటోలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని వీర్వోలను ఆదేశించామన్నారు. దీపం పథకం ద్వారా 34 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. 9,331 కనెక్షన్లకు ప్రతిపాదనలు రావాల్సి ఉందని, 13,189 కనెక్షన్లకు పంపిణీ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. విలేకరుల సమావేశంలో తహశీల్దార్ వెంకారెడ్డి పాల్గొన్నారు.