M Phil
-
‘డిగ్రీ లేకుండానే ఎం.ఫిల్ చేశాడా?!’
న్యూఢిల్లీ : ఓ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తోంది. స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో సమర్పించిన నివేదికలో మాత్రం ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్మృతి ఇరానీ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. స్మృతి ఇరానీకి మద్దతిస్తూ ఆమె తరఫున వకల్తా పుచ్చుకున్నారు. స్మృతి ఇరానీ డిగ్రీ చేయలేదు సరే.. మరి మీ నాయకుడు మాస్టర్స్ చేయకుండానే ఎం.ఫిల్ పూర్తి చేశాడు. దీనికి ఏం సమాధానం చెప్తారంటూ అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంతో, ఇంతకాలం ఆమె విద్యార్హతలపై తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ల నుంచి తన డిగ్రీ పూర్తి అయ్యిందని స్మృతి చేసిన వాదనలు తప్పుగా నిరూపణ అయ్యాయి. దాంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది.. ఎన్నికల కమిషన్ స్మృతి ఇరానీ నామినేషన్‌ని తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. -
సీఐడీ దర్యాప్తు జరగాల్సిందే..!
ద్రవిడ వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 8 వేల మందికి ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పించడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించడంలో ఎలాంటి తప్పులేదని, రాష్ట్రంలో వర్సిటీల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలకు విశ్వసనీయత ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. దర్యాప్తు వల్ల ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న నెపంతో నిలుపుదల చేయలేమంది. దర్యాప్తు పేరుతో ఎంఫిల్, పీహెచ్‌డీల కోసం ద్రవిడ వర్సిటీలో రిజిష్టర్ చేసుకున్న వ్యక్తులను ఏ రకమైన వేధింపులకు గురి చేయరాదని, దీనిపై క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలివ్వాలని సీఐడీ అదనపు డీజీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ద్రవిడ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఎంఫిల్ డిగ్రీలు, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జె.ప్రసాద్‌బాబు, అప్పాజీ, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. -
ఏడు పదుల వయసులో ఎంఫిల్!
నిజామాబాద్: చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు నిజామాబాద్‌కు చెందిన న్యాయవాది ముస్కు రాజేశ్వర్‌రెడ్డి. ఏడు పదుల వయసులో దూరవిద్య ద్వారా ఎంఫిల్ పట్టా పొందారు. ఎస్వీ వర్సిటీలో ఆయన ఆర్కే నారాయణన్ నవలలపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇది దూరవిద్యలో ఆయనకు ఆరవ పీజీ. ఓయూ నుంచి ఎంఏ చరిత్ర, మధురై కామరాజు వర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిష్, హిమాచల్‌ప్రదేశ్ వర్సిటీ ద్వారా ఎంఈడీ, కాకతీయ, నాగార్జున వర్సిటీల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. దూరవిద్య ద్వారానే జర్నలిజంలో పీజీ డిప్లొమా కూడా పొందారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి, జూనియర్ లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన రాజేశ్వర్‌రెడ్డి, అనంతరం న్యాయవాద వృత్తిని స్వీకరించారు. రెండవ శ్రేణి మేజిస్ట్రేట్‌గానూ పనిచేశారు.