తమిళనాట తెలుగు ముద్ర
► సత్తా చాటిన అభ్యర్థులు
► మాతృ భాషలో గళం విప్పేది డౌటే
అసెంబ్లీకి ముగ్గురు:
తమిళనాట చెన్నై మహానగరం పరిధిలో ఎక్కువ శాతం మంది స్థిర పడ్డ తెలుగు సంతతికి చెందిన వారే ఉన్నారన్న విషయం తెలిసిందే. అలాగే, ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉంటూ ఓటు హక్కును కల్గిన వారూ ఎక్కువే. అందుకే తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు తగట్టుగా తెలుగు సంతతికి చెందిన అభ్యర్థులుగా శేఖర్ బాబు(హార్బర్), రంగనాథన్(విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్), ఎం సుబ్రమణియన్(సైదాపేట)లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి రేసులో దించాయి. రాజకీయంగా పార్టీల బలం, వ్యక్తిగత చరిష్మా, తెలుగు ఓటరు అండగా నిలబడడం వెరసి ఈ ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పల్లావరానికి అన్నాడీఎంకే అభ్యర్థిగా తెలుగు ప్రముఖురాలు, సినీ నటి సీఆర్ సరస్వతిపోరాడి చివరకు ఓటమి చవి చూశారు.
సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగంలో నైనా సరే తెలుగువారి ముద్ర కచ్చితంగా కన్పిస్తుంది. ఆ దిశగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు అభ్యర్థులు పలువురు విజయ కేతనం ఎగురవేశారు. తెలుగు వారిగా, తెలుగు సంతతికి చెందిన వారుగా పలువురు డిఎంకే, అన్నాడీఎంకేల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కినా మాతృభాషలో తమ గళాన్ని విన్పించడం అనుమానమే. ఈ సారి తెలుగు సంతతికి చెందిన అత్యధిక శాతం మంది డీఎంకే అభ్యర్థులుగా గెలవడం గమనార్హం.
విభిన్న జాతుల సమాహారంతో నిండిన రాష్ట్రంలో మాతృ భాషం తమిళం అయినా, తెలుగు వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉభయ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు గానీయండి, ప్రత్యేక మద్రాసు నగరంలోని గానీయండి తెలుగు వారు హవా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తున్నది. అందుకే ఇక్కడ తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి. ఈ సమయంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలకు తెలుగు ఓటరు కీలకం అయ్యాడు. అందుకే తెలుగు బలం ఉన్న చోట్ల తెలుగు వారినే రాజకీయ పక్షాలు అభ్యర్థిగా ప్రకటించాయి. ఇందులో డిఎంకే, అన్నాడీఎంకేలు ముందంజలో నిలిచాయి.
సరిహద్దుల్లో సత్తా:
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో అయితే, పలు నియోజకవర్గాల్లో తెలుగు అభ్యర్థుల మధ్య సమరం సాగింది. ఇంకా చెప్పాలంటే, తెలుగు ఓటర్లను చీల్చేందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడ సాగిందని పరిగణించాల్సిందే. ఇందులో గుమ్మిడి పూండి, హోసూరు , త లిలను ముందు వరసులో తదుపరి వేపనహల్లిలను పరిగణించాలి. గుమ్మిడిపూండి డిఎంకే అభ్యర్థిగా శేఖర్, అన్నాడీఎంకే అభ్యర్థిగా విజయకుమార్‌లు ఢీ కొట్టి, చివరకు తెలుగు ఓట్లు చీలడంతో విజయకుమార్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు.
తిరుత్తణిలో అయితే, అచ్చ తెలుగు నాయకుడుగా, బీజేపీ రాష్ట్ర ఉపాథ్యక్షుడు చక్రవర్తి నాయుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినా, చివరకు ఐదు వేలకు పై చిలుకుల ఓట్లతో సరి పెట్టుకోక తప్పలేదు. ఇక, హోసూరు విషయానికి వస్తే, ఇద్దరు తెలుగు ఉద్దండులు ఢీ కొట్టారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గోపినాథ్‌ను అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన బాలకృష్ణారెడ్డి ఓడించి, తెలుగు మద్దతు తనకే అని చాటుకున్నారు. తలి నియోజకవర్గంలడీఎంకే అభ్యర్థిగా అచ్చ తెలుగు అబ్బాయి వై ప్రకాష్ సత్తా చాటుకున్నాడు. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా తెలుగు సంతతికి చెందిన రామచంద్రన్ ఓటమి పాలు కాక తప్పలేదు. వేపన హల్లి రేసులో అన్నాడీఎంకే అభ్యర్థి దిగిన అచ్చ తెలుగు అబ్బాయి మధుకు తెలుగు కార్డు పనిచేయనట్టుంది. ఓటమి చవి చూడక తప్పలేదు.
మరి కొన్ని చోట్ల:
వేలూరు, తిరువణ్ణామలై, వాణియం బాడి, జోళార్ పేట, కాట్పాడి, రాణి పేట,కీల్ పెన్నాత్తూర్, గుడియాత్తంలలోనూ తెలుగు వారు అధికం అన్న విషయం తెలిసిందే. అయితే, వీళ్లు తెలుగు చదవడం, రాయడం రాదు. తమిళంలో చదువుకున్న వాళ్లే. అయినా తెలుగు సరళంగా మాట్లాడ గలరు. అందుకే తెలుగు సంతతికి చెందిన వారైన, రాణి పేటలో డిఎంకే నేత గాంధి, తిరువణ్ణామలైలో డిఎంకే నేత ఏవి వేలులకు మద్దతు పలికారు.
కీల్ పెన్నాత్తూర్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగు సంతతికి చెందిన పిచ్చాండి విజయం సాధించడం విశేషం. తిరుచ్చి తూర్పులో తెలుగు సంతతికి చెందిన కే ఎన్ నెహ్రు, అరుప్పుకోట్టైలో కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్‌లు విజయ కేతనం ఎగుర వేయగా రాశిపురంలో తెలుగు సంతతికి చెందిన దురై స్వామి, మదురై పశ్చిమంలో దళపతి ఓటమి చవి చూడక తప్పలేదు. ఇక, తెలుగు నినాదంతో సీఎం జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్, తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న హొసూరులో పోటీ చేసిన తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కొన్ని ఓట్లు దక్కడం గమనార్హం.
హొసూరులో 265, ఆర్కేనగర్లో 57 ఓట్లను ఆయన ద క్కించుకున్నారు. కాగా, తెలుగు వారుగా, తెలుగు సంతతికి చెందిన వారుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పైన పేర్కొన్న అభ్యర్థులు గెలిచినా, మాతృ భాషలో తమిళ అసెంబ్లీలో గళం విప్పేది మాత్రం డౌటే. ఇన్నాళ్లు, తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తూ వచ్చిన గోపినాథ్ ఈ సారి ఓటమి చవి చూశారు. ఆయన ప్రశ్నలకు ఇది వరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు ఎన్నికైన వారిలో ఎవరైనా ఒక్కరు తెలుగు పదాలు పలికేనా అన్నది అనుమానమే. ఇందుకు కారణం, అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన వాళ్లు, ఎక్కడ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న భయం, డీఎంకే తరఫున గెలిచిన వాళ్లలో మౌనం పాటించే వాళ్లు తప్పని సరి. ఈ దృష్ట్యా, తెలుగు వారుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా, మాతృ భాషలో గళాన్ని విప్పలేని పరిస్థితి...!