'మా ఊరి ప్రేమ కథ' వచ్చేది అప్పుడే
‘‘ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి. అన్ని ప్రేమకథలు ఒక్కటే.. కానీ కొత్తగా చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మా ఊరి ప్రేమకథ’ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత కేయల్ దామోదర ప్రసాద్ అన్నారు. మంజునాథ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ హీరోయిన్. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది.
ఈ చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. రియలిస్టిక్ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విషయంలో నాకు సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. సహనిర్మాత మహేంద్రనాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవితేజ, ‘కీ’ మ్యూజిక్ అధినేత రవి కనగాల, ‘తొలిముద్దు’ సినిమా నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు.