machilipatnam municipality
-
13న స్థానిక సంస్థల ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా స్థానిక సంస్థల్లో రాజీనామా లేదా మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు పరోక్ష పద్ధతిలో ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులతో పాటు పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవిని భర్తీ చేస్తారు. అలాగే మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీల్లో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మొత్తం 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో– ఆప్షన్ సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. వివిధ మండలాల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు కూడా ఎన్నికలు ఉంటాయని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. ఈ నెల 13న ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటీసులను ఆయా స్థానిక సంస్థల సభ్యులకు ఈ నెల 9 కల్లా అందజేయాలని ఆదేశించారు. ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4) రామకుప్పం (చిత్తూరు), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజెర్ల (నెల్లూరు) కో– ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగే మండలాలు (3) చిత్తూరు, బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7) రామకుప్పం, విజయాపురం (చిత్తూరు), రాపూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం). ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు (12) అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి.. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున. -
కార్పొరేషన్ హోదా ఉన్నట్టా..లేనట్టా?
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం నగరపాలక సంస్థో లేక పురపాలక సంఘమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పైగా పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండున్నర నెలలు దాటుతున్నా నేటికీ మున్సిపాలిటీలో గత పాలకవర్గమే కొనసాగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. మచిలీపట్నం..అత్యంత పురాతనమైన పట్టణం దేశంలోనే రెండో పురపాలక సంఘం. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఈ పట్టణానికి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ 2015లోనే అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పాలకవర్గం పదవీకాలం ఏడాదిన్నరకు పైగా ఉండడంతో సాంకేతిక కారణాల రీత్యా మున్సిపాల్టీగానే కొనసాగింది. ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగియడంతో çపురపాలక సంఘం కాస్త కార్పొరేషన్ హోదాను సంతరించుకుంది. కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ప్రభుత్వం నియమించింది. పరిసర తొమ్మిది పంచాయతీలను కార్పొరేషన్లో విలీనాన్ని చేసేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అధికారులు మాత్రం తామింకా మున్సిపాల్టీలోనే కొనసాగుతున్నట్టు భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏ సంస్థ హోదా అయినా అప్‌గ్రేడ్ అయితే ఆ హోదాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. 2015లోనే నగర హోదా వచ్చింది. సాంకేతికంగా చూసినా హోదా వచ్చి రెండున్నర నెలలు దాటింది. అయినా నేటికీ పురపాలక సంఘ కార్యాలయానికి కూడా కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో అధికారులున్నారు. దీనికి పెద్ద ఖర్చు కాదు. అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాల్టీయో? కార్పొరేషనో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. పేరుకు కార్పొరేషన్ కానీ థర్డ్ క్లాస్ పంచాయతీ కంటే ఘోరంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. పేరుకు సీసీ కెమెరాలా నిఘాలో ఉందని చెప్పుకోవడమే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఫైళ్లు.. ఏ అధికారి చాంబర్ ఎక్కడో కూడా తెలియని అయోమయ పరిస్థితి. మాజీల పేర్లు కార్యాలయంలోనే కాదు.. నగరంలో ఏ మూల చూసినా అదే పరిస్థితి. చైర్మన్, కౌన్సిలర్లు మాజీలై పోయి మూడు నెలలు కావస్తోంది. అయినా సరే సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ల బోర్డులో నేటికీ మున్సిపల్ చైర్మన్‌గా బాబాప్రసాద్ కొనసాగుతున్నట్టుగానే ఉంది. ప్రత్యేకాధికారిగా జేసీ మాధవీలత బాధ్యతలు స్వీకరించి నెలదాటుతున్నా ఆమె పేరు కూడా నేమ్ బోర్డులో పెట్టలేని దుస్థితి. ఇక మాజీలైన చైర్మన్, కౌన్సిలర్ల పేరిటే బోర్డులు హోర్డింగ్‌లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. చివరకు వీధి పేర్లను సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులపై కూడా కౌన్సిలర్లు పేర్లు కొనసాగుతున్నాయి. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే చేస్తాం.. కంగారే ముంది అనే ధోరణిలో సమాధానమిస్తుండడం విస్తుగొలుపుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం పురపాలకసంఘం బోర్డు తొలగించి కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న కౌన్సిలర్ల పేర్లు తొలగించాలని, కార్పొరేషన్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
బందరు టీడీపీలో అసంతృప్తి
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం (బందరు) టీడీపీలో ముసలం పుట్టింది. పచ్చ తమ్ముళ్ల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పట్టణ మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాబా ప్రసాద్‌కు వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. బాబా ప్రసాద్‌పై టీడీపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. బందరు మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ కి... ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మధ్య దూరం బాగా పెరిగింది. ఈ విషయంపై స్థానిక నాయకులు జోక్యం చేసుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు... పార్టీ అగ్ర నాయకులతో భేటీ కానున్నారు.