పురపాలక సంఘం పేరిట ఏర్పాటు చేసిన బోర్డు
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం నగరపాలక సంస్థో లేక పురపాలక సంఘమో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పైగా పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండున్నర నెలలు దాటుతున్నా నేటికీ మున్సిపాలిటీలో గత పాలకవర్గమే కొనసాగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. మచిలీపట్నం..అత్యంత పురాతనమైన పట్టణం దేశంలోనే రెండో పురపాలక సంఘం. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఈ పట్టణానికి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ 2015లోనే అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. పాలకవర్గం పదవీకాలం ఏడాదిన్నరకు పైగా ఉండడంతో సాంకేతిక కారణాల రీత్యా మున్సిపాల్టీగానే కొనసాగింది. ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగియడంతో çపురపాలక సంఘం కాస్త కార్పొరేషన్ హోదాను సంతరించుకుంది. కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను ప్రభుత్వం నియమించింది.
పరిసర తొమ్మిది పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనాన్ని చేసేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అధికారులు మాత్రం తామింకా మున్సిపాల్టీలోనే కొనసాగుతున్నట్టు భావిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఏ సంస్థ హోదా అయినా అప్‌గ్రేడ్ అయితే ఆ హోదాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. 2015లోనే నగర హోదా వచ్చింది. సాంకేతికంగా చూసినా హోదా వచ్చి రెండున్నర నెలలు దాటింది. అయినా నేటికీ పురపాలక సంఘ కార్యాలయానికి కూడా కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో అధికారులున్నారు. దీనికి పెద్ద ఖర్చు కాదు. అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాల్టీయో? కార్పొరేషనో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. పేరుకు కార్పొరేషన్ కానీ థర్డ్ క్లాస్ పంచాయతీ కంటే ఘోరంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. పేరుకు సీసీ కెమెరాలా నిఘాలో ఉందని చెప్పుకోవడమే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఫైళ్లు.. ఏ అధికారి చాంబర్ ఎక్కడో కూడా తెలియని అయోమయ పరిస్థితి.
మాజీల పేర్లు
కార్యాలయంలోనే కాదు.. నగరంలో ఏ మూల చూసినా అదే పరిస్థితి. చైర్మన్, కౌన్సిలర్లు మాజీలై పోయి మూడు నెలలు కావస్తోంది. అయినా సరే సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ల బోర్డులో నేటికీ మున్సిపల్ చైర్మన్‌గా బాబాప్రసాద్ కొనసాగుతున్నట్టుగానే ఉంది. ప్రత్యేకాధికారిగా జేసీ మాధవీలత బాధ్యతలు స్వీకరించి నెలదాటుతున్నా ఆమె పేరు కూడా నేమ్ బోర్డులో పెట్టలేని దుస్థితి. ఇక మాజీలైన చైర్మన్, కౌన్సిలర్ల పేరిటే బోర్డులు హోర్డింగ్‌లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. చివరకు వీధి పేర్లను సూచిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులపై కూడా కౌన్సిలర్లు పేర్లు కొనసాగుతున్నాయి. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే చేస్తాం.. కంగారే ముంది అనే ధోరణిలో సమాధానమిస్తుండడం విస్తుగొలుపుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం పురపాలకసంఘం బోర్డు తొలగించి కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని, నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న కౌన్సిలర్ల పేర్లు తొలగించాలని, కార్పొరేషన్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment