ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఆగదు
కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఏర్పాటు ఆగబోదని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలో మల్లికార్జున స్వామి ఆలయంవద్ద జరిగిన ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణను ప్రకటించడంతోపాటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సైతం ప్రవేశపెట్టినందున అందరూ సహకరించాలని ఆమె కోరారు.
తెలంగాణను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాడతామని సీఎం వ్యాఖ్యానించడం అతని వ్యక్తిగతమన్నారు. తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు వారి ప్రాంత అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఫలితం ఉంటుందన్నారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మల్లికార్జుస్వామి గుడివద్దకు వచ్చి మంత్రికి కళాశాల సమస్యలు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆమె సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఆమె భుజిరంపేటలోగల శ్రీకృష్ణనందాశ్రమానికి వెళ్లి రాంపూర్ పీఠాధిపతి మాదవానంద స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి యాదాగౌడ్, ఉపాధ్యక్షుడు ఎన్ దుర్గారెడ్డి, మాజీ సీడీసీ దుర్గారెడ్డి, నాయకులు ఎంసీ విఠల్, సాయిరెడ్డి, సంగాగౌడ్, రాజిరెడ్డి, వడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమస్యలపై చర్చిస్తే ప్రయోజనం
నర్సాపూర్: తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటు అనంతరం సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్య గురించి అసెంబ్లీలో చర్చిస్తే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, జనవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చించి ఈ బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. సీఎం పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల గురించి కొందరు విలేకరులు ఆమె వద్ద ప్రస్తావించగా, పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగత విషయమన్నారు. విలేకరుల సమావేశంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, ఇతర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, సత్యంగౌడ్, లలిత, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌కు పీజీ కళాశాల
నర్సాపూర్: నర్సాపూర్‌కు పీజీ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ కళాశాలలో తరగతులు కొనసాగుతాయని చెప్పారు. ఎమ్మెస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గనిక్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంబీఏ, ఎంసీజే కోర్సులుంటాయన్నారు. పీజీ కళాశాల కోసం ఐదు ప్రొఫెసర్ పోస్టులతో పాటు 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 16 అసిస్టెంటు ప్రొఫెసర్ల పోస్టులు కూడా మంజూరు అయినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు గానూ రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గంలోని ఉన్నత పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించేందుకు రూ. 5 కోట్ల 95 లక్షల 47 వేలు మంజూరయినట్లు మంత్రి సునీతారెడ్డి చెప్పారు.