Madduru
-
అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు
సాక్షి, దేవరకద్ర: ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హతమార్చి పూడ్చిపెట్టింది. ఈ సంఘటన మండలంలోని మద్దూరులో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ పాండురంగారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పాన్‌గల్ మండలం కేతేపల్లికి చెందిన ఆంజనేయులు(40)కు చిన్నచింతకుంట మండలం మద్దూరు చెందిన రాములమ్మతో గత 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన ఐదేళ్ల నుంచి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రాములమ్మ భర్త ఆంజనేయులుతో గొడవపడి ఐదేళ్ల క్రితం తల్లిగారి ఊరైన మద్దూరుకు ఐదేళ్ల క్రితం తిరిగి వచ్చింది. అయితే గత నెల 23న రాములమ్మ తల్లికి ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలుసుకున్న ఆంజనేయులు అదేరోజు మద్దూరుకు వచ్చాడు. ఆ తర్వాత ఆంజనేయులు అదృశ్యమయ్యాడు. అదృశ్యంపై కేసు నమోదు ఈ నెల 5న రాములమ్మ తన భర్త ఆంజనేయులు కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానంతో రాములమ్మ, ఆమె ప్రియుడు సలీం, రాములమ్మ తమ్ముడు రాజు ముగ్గురు కలిసి ఆంజనేయులును గత నెల 23న హత్య చేసినట్లు సలీం ఒప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం శవాన్ని పూడ్చిన స్థలాన్ని చూయించగా కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కటుంబ సభ్యులకు అప్పగించారు. ఆంజనేయులుకు భార్యతోపాటు ఒక కూతురు ఉంది. పాన్‌గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లికి ఆంజనేయులు అత్తగారింటికి వెళ్లి హత్యకు గురవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బండలయ్య, బాలకిష్టమ్మ దంపతుల రెండో కుమారుడు ఆంజనేయులు. అయితే భార్య రాములమ్మకు వివాహేతర సంబంధం ఉండటంతో ఆంజనేయులును హత్య చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మద్దూరు ఇసుక క్వారీ మూసివేత
మైనింగ్ శాఖ ఆదేశాలు నిరాశపడ్డ కూలీలు కంకిపాడు : కూలీలు ఇసుకలో నాలుగురాళ్లు వెనకేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కూలీల చేతిలోకి క్వారీ వచ్చిందో లేదో అధికారులకు ఎక్కడ లేని నివేదికలు గుర్తుకొచ్చేశాయి. ఇసుక లేని కారణంగా క్వారీని మూసివేయాలని మైనింగ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఫలితంగా మద్దూరు ఇసుక క్వారీని రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నుంచి మూసివేయించారు. వివరాల్లోకి వెళితే... గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి క్వారీల్లో యంత్రాలను వినియోగించకూడదు. క్వారీల్లో ఉన్న యంత్రాలు ఏటి ఒడ్డుకు చేర్చారు. దీనిలో భాగంగా మద్దూరు ఇసుక క్వారీలో మంగళవారం నుంచి కూలీలు ఇసుక లోడింగ్ పనుల్లో దిగారు. ఉచిత ఇసుక విధానం ద్వారా తమకు ఉపాధి లభిస్తుందని ఆశించారు. లోడింగ్ పనుల్లో దిగి పట్టుమని 48 గంటలు కూడా గడవక ముందే ఇసుక క్వారీని రెవెన్యూ అధికారులు మూసివేశారు. చెప్పిన కారణాలు ఇవీ... మైనింగ్ శాఖకు చెందిన టెక్నికల్ సిబ్బంది మద్దూరు క్వారీని ఇటీవల సందర్శించి క్వారీలో ఇసుక లేదని, తవ్వాల్సిన దానికన్నా అదనంగా తవ్వేశారని గుర్తించి కలెక్టరుకు నివేదిక పంపారు. నివేదిక ఉత్తర్వులను అనుసరించి మైనింగ్ శాఖ ఏడీ తహశీల్దార్ కార్యాలయానికి సర్యు్కలర్ పంపారు. ఈ కాపీలు బుధవారం ఆ శాఖ అధికారులు అందుకున్నారు. కంకిపాడు పోలీసులకు సర్క్యులర్‌ను చూపించి పోలీసు ప్రొటెక్షన్‌తో మద్దూరు క్వారీకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలకు సమాచారం ఇచ్చారు. క్వారీనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి మైనింగ్ శాఖ ఉత్తర్వులు వచ్చిన మీదటే క్వారీలో ఇసుక తవ్వకాలు ప్రారంభవుతాయని రెవెన్యూకార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వీ. శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 16నే మైనింగ్ శాఖ వద్దకు చేరినట్లు సమాచారం. ఈరోజుæ వరకూ విషయాన్ని బయట పెట్టలేదు. కూలీలు క్వారీలో లోడింగ్ పనులు చేయటం ఆరంభించగానే బహిర్గతం చేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్దూరు క్వారీతోపాటుగా పెనమలూరు మండలం పెద పులిపాక క్వారీలోనే ఇదే పరిస్థితి చోటుచేసుకుందని, అక్కడ కూడా ఇసుక లేదని తేల్చి క్వారీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికితోడు ప్రకాశం బ్యారేజీ నుంచి ఏటిపాయలకు వరదనీరు వస్తున్న కారణంగా క్వారీని మూసివేసినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. అధికారుల తీరుపై విమర్శలే... ఉచిత ఇసుక విధానం అమలులో మొదటి నుంచీ అధికారుల తీరుపై విమర్శలే. ప్రభుత్వ అవసరాల రీత్యా ఇసుక తవ్వకాలకు యంత్రాలు వాడుకోవచ్చని అధికార పార్టీ నేతల అడ్డగోలు దందాకు సహకారం అందించారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి సమక్షంలో కార్మికులు ఆందోళనలు చేయటం, జిల్లా అధికారులకు వినతులు పంపటంతో ప్రైవేటు అవసరాలకు కార్మికులుతో చేయించుకోవచ్చని నిబంధనల్లో మార్పు చేసినట్లు ప్రకటించారు. పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు క్వారీల్లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులతోపాటుగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు పోటీగా యంత్రాలను దించటంతో వివాదాస్పదం అయ్యింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో తాత్కాలిక ప్రాదిపదికన క్వారీని మూయించారు. తరువాత తెరిచినట్టే తెరిచి మద్దూరు ప్రధాన రహదారి మరమ్మతుల పేరుతో కొన్ని రోజులు, మద్దూరు ఏటిపాయలోకి పుష్కర స్నానాలకు వెళ్లే రహదారి పనుల పేరుతో కొద్దిరోజులు క్వారీని ఆపివేశారు. పుష్కరాలు ముగిశాక క్వారీలో ఉపాధి లభిస్తుందని కార్మికులు భావించారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వారి ఆశ మరింత రెట్టింపయ్యింది. ఆశ పడి ఒక్క రోజు కూడా దాటకుండా ఇసుక లేదనే సాకుతో అధికారులు తీసుకున్న చర్యలతో అది కాస్తా ఆవిరైంది. -
మద్దూరులో పురాతన విగ్రహాలు
మద్దూరు మండలం బెక్కల్ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి. వెయ్యేళ్ల క్రితం నాటి బొడ్రాయి, దొంగలను కట్టేసే కొండం (కారాగారం) వెలుగుచూశాయి. – మద్దూరు -
మద్దూరులో ఇసుక రగడ
కంకిపాడు : మద్దూరు క్వారీలో ఇసుక తవ్వకాలకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులతోపాటు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్గీయులు యత్నించారు. నెహ్రూ వర్గీయులకు స్థానిక మత్య్సకారులు మద్దతుగా నిలిచారు. దీంతో ఇసుక క్వారీ వద్ద మంగళవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు మండలం చోడవరం ఇసుక క్వారీ మూసివేతతో నెహ్రూ వర్గీయులు రెండు పొక్లెయిన్లను సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్దూరుకు చేర్చారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులు పొక్లెయిన్లను దించొద్దంటూ అడ్డుకున్నారు. మత్స్యకారులు, ఇసుక క్వారీ కార్మికుల మద్దతుతో పొక్లెయిన్లను క్వారీలోకి దించారు. మంగళవారం ఉదయం క్వారీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు, బోడె ప్రసాద్ అనుచరులు, స్థానికుల మద్దతుతో క్వారీలోకి వెళ్లకుండా యంత్రాలను అడ్డుకున్నారు. క్వారీలోకి దారి బాగుచేసుకున్నామని, శాండ్ వర్కర్స్ సొసైటీ పేరున తవ్వకాలు జరుపుతున్నామని టీడీపీ వర్గం స్పష్టంచేసింది. ఉచిత ఇసుక విధానం ప్రకటించాక ఇదేమిటని స్థానిక క్వారీ కార్మికులు, నెహ్రూ వర్గీయులు ప్రశ్నించారు. దీంతో కరకట్టపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్ఐ హనీష్‌లు ఇరువర్గాలతోనూ విడివిడిగా చర్చించారు. సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాసరావు గ్రామానికి వచ్చి క్వారీ రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ అవసరాలకు అనుమతులు ఉన్న పొక్లెయిన్లతో మాత్రమే తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. బహిరంగ మార్కెట్లోకి ఇసుక ప్రభుత్వ అవసరాల పేరుతో వందల కొద్దీ లారీల ఇసుక బహిరంగ మార్కెట్లోకి వెళుతోందని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని క్వారీ కార్మికులు ఆరోపించారు. లారీల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నారని, డ్రెవర్లను కొడుతున్నారంటూ ఫిర్యాదుచేశారు. ఫ్రీ ఇసుక పేరుతో ఎమ్మెల్యే దందా చేస్తున్నారంటూ నెహ్రూ వర్గీయులు పోలీసు అధికారుల వద్దే ఆరోపణలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు నిర్ధారించిన నంబర్ల ఆధారంగా లారీలను మాత్రమే లోడింగ్‌కు పంపేలా చర్యలు తీసుకున్నామన్నారు. బయటి వాహనాలతో కూడా లోడింగ్ జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు కాబట్టి ఉన్నతాధికారులు నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు క్వారీని మూసివేస్తున్నామని ప్రకటిస్తూ క్వారీలోకి వెళ్లే మార్గానికి ఉన్న గేటును మూయించారు. ఉత్తర్వులు ఇలా.. ఏప్రిల్ 14 నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలతో మే 11నుంచి క్వారీ కార్మికులు కూడా తవ్వుకునేందుకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ అవసరాలకు యంత్రాలతోనూ, వ్యక్తిగత అవసరాలకు కూలీలతోనూ లోడింగ్ చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. బారులు తీరిన లారీలు క్వారీలో లోడింగ్ నిలిచి పోవడంతో మద్దూరు ప్రాంతంలో లారీలు భారీగా నిలిచిపోయాయి. కరకట్ట పొడవునా, మద్దూరు గ్రామంలోకి వెళ్లే మార్గం లోనూ లారీలు, ట్రాక్టర్లు, పెద్ద లారీలు బారు లు దీరాయి. ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు కానీ ఇక్కడ ఉన్న లారీల్లో అధిక భాగం బయటి మార్కెట్లోకి వెళ్లే లారీలు ఉన్న విషయం స్పష్టమైంది. -
పొన్నాలకు ఎంతటి అవమానం!
-
పొన్నాలకు ఎంతటి అవమానం!
వరంగల్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు మద్దూరులో పెద్ద అవమానమే జరిగింది. హెలికాప్టర్ పైలట్ పొన్నాల మాట వినిపించుకోలేదు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పొన్నాలను ఎక్కించుకోకుండానే పైలట్ హదరాబాద్ వెళ్లిపోయారు. ఇంతకీ అసలు జరిగిందేంటంటే.... ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నాల లక్ష్మయ్య హెలీకాఫ్టర్ లో మద్దూరు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకున్న తరువాత వరంగల్ రావాలని పొన్నాల పైలట్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ లో వరంగల్ లేదని, తాను రానని పైలట్ చెప్పారు. ఈ సందర్భంగా పైలట్ తో పొన్నాల వాదనకు దిగారు. పైలట్ తన మాట వినకపోవడంతో ఆయన చిందులు వేశారు. నిబంధనలు ఉల్లంఘించలేనని పైలట్ తెగేసి చెప్పారు. చివరకు పొన్నాలను ఎక్కించుకోకుండానే పైలట్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక చేసేదేమీలేక పొన్నాల కారులో వరంగల్ బయలుదేరారు.