మద్దూరు ఇసుక క్వారీ మూసివేత
మద్దూరు ఇసుక క్వారీ మూసివేత
Published Wed, Aug 31 2016 9:11 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
మైనింగ్ శాఖ ఆదేశాలు
నిరాశపడ్డ కూలీలు
కంకిపాడు :
కూలీలు ఇసుకలో నాలుగురాళ్లు వెనకేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కూలీల చేతిలోకి క్వారీ వచ్చిందో లేదో అధికారులకు ఎక్కడ లేని నివేదికలు గుర్తుకొచ్చేశాయి. ఇసుక లేని కారణంగా క్వారీని మూసివేయాలని మైనింగ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఫలితంగా మద్దూరు ఇసుక క్వారీని రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం నుంచి మూసివేయించారు. వివరాల్లోకి వెళితే... గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి క్వారీల్లో యంత్రాలను వినియోగించకూడదు. క్వారీల్లో ఉన్న యంత్రాలు ఏటి ఒడ్డుకు చేర్చారు. దీనిలో భాగంగా మద్దూరు ఇసుక క్వారీలో మంగళవారం నుంచి కూలీలు ఇసుక లోడింగ్ పనుల్లో దిగారు. ఉచిత ఇసుక విధానం ద్వారా తమకు ఉపాధి లభిస్తుందని ఆశించారు. లోడింగ్ పనుల్లో దిగి పట్టుమని 48 గంటలు కూడా గడవక ముందే ఇసుక క్వారీని రెవెన్యూ అధికారులు మూసివేశారు.
చెప్పిన కారణాలు ఇవీ...
మైనింగ్ శాఖకు చెందిన టెక్నికల్ సిబ్బంది మద్దూరు క్వారీని ఇటీవల సందర్శించి క్వారీలో ఇసుక లేదని, తవ్వాల్సిన దానికన్నా అదనంగా తవ్వేశారని గుర్తించి కలెక్టరుకు నివేదిక పంపారు. నివేదిక ఉత్తర్వులను అనుసరించి మైనింగ్ శాఖ ఏడీ తహశీల్దార్ కార్యాలయానికి సర్యు్కలర్ పంపారు. ఈ కాపీలు బుధవారం ఆ శాఖ అధికారులు అందుకున్నారు. కంకిపాడు పోలీసులకు సర్క్యులర్‌ను చూపించి పోలీసు ప్రొటెక్షన్‌తో మద్దూరు క్వారీకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలకు సమాచారం ఇచ్చారు. క్వారీనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి మైనింగ్ శాఖ ఉత్తర్వులు వచ్చిన మీదటే క్వారీలో ఇసుక తవ్వకాలు ప్రారంభవుతాయని రెవెన్యూకార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వీ. శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 16నే మైనింగ్ శాఖ వద్దకు చేరినట్లు సమాచారం. ఈరోజుæ వరకూ విషయాన్ని బయట పెట్టలేదు. కూలీలు క్వారీలో లోడింగ్ పనులు చేయటం ఆరంభించగానే బహిర్గతం చేయటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్దూరు క్వారీతోపాటుగా పెనమలూరు మండలం పెద పులిపాక క్వారీలోనే ఇదే పరిస్థితి చోటుచేసుకుందని, అక్కడ కూడా ఇసుక లేదని తేల్చి క్వారీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికితోడు ప్రకాశం బ్యారేజీ నుంచి ఏటిపాయలకు వరదనీరు వస్తున్న కారణంగా క్వారీని మూసివేసినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
అధికారుల తీరుపై విమర్శలే...
ఉచిత ఇసుక విధానం అమలులో మొదటి నుంచీ అధికారుల తీరుపై విమర్శలే. ప్రభుత్వ అవసరాల రీత్యా ఇసుక తవ్వకాలకు యంత్రాలు వాడుకోవచ్చని అధికార పార్టీ నేతల అడ్డగోలు దందాకు సహకారం అందించారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి సమక్షంలో కార్మికులు ఆందోళనలు చేయటం, జిల్లా అధికారులకు వినతులు పంపటంతో ప్రైవేటు అవసరాలకు కార్మికులుతో చేయించుకోవచ్చని నిబంధనల్లో మార్పు చేసినట్లు ప్రకటించారు. పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు క్వారీల్లో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులతోపాటుగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు పోటీగా యంత్రాలను దించటంతో వివాదాస్పదం అయ్యింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో తాత్కాలిక ప్రాదిపదికన క్వారీని మూయించారు. తరువాత తెరిచినట్టే తెరిచి మద్దూరు ప్రధాన రహదారి మరమ్మతుల పేరుతో కొన్ని రోజులు, మద్దూరు ఏటిపాయలోకి పుష్కర స్నానాలకు వెళ్లే రహదారి పనుల పేరుతో కొద్దిరోజులు క్వారీని ఆపివేశారు. పుష్కరాలు ముగిశాక క్వారీలో ఉపాధి లభిస్తుందని కార్మికులు భావించారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వారి ఆశ మరింత రెట్టింపయ్యింది. ఆశ పడి ఒక్క రోజు కూడా దాటకుండా ఇసుక లేదనే సాకుతో అధికారులు తీసుకున్న చర్యలతో అది కాస్తా ఆవిరైంది.
Advertisement
Advertisement