మద్దూరులో ఇసుక రగడ | Madduru in the sand Ragada | Sakshi
Sakshi News home page

మద్దూరులో ఇసుక రగడ

Published Wed, Jul 6 2016 12:32 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Madduru in the sand Ragada

కంకిపాడు : మద్దూరు క్వారీలో ఇసుక తవ్వకాలకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులతోపాటు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్గీయులు యత్నించారు.  నెహ్రూ వర్గీయులకు స్థానిక మత్య్సకారులు మద్దతుగా నిలిచారు. దీంతో ఇసుక క్వారీ వద్ద మంగళవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  వివరాలు ఇలా ఉన్నాయి.
 పెనమలూరు మండలం చోడవరం ఇసుక క్వారీ మూసివేతతో నెహ్రూ వర్గీయులు రెండు పొక్లెయిన్‌లను సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్దూరుకు చేర్చారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులు పొక్లెయిన్‌లను దించొద్దంటూ అడ్డుకున్నారు. మత్స్యకారులు, ఇసుక క్వారీ కార్మికుల మద్దతుతో పొక్లెయిన్‌లను క్వారీలోకి దించారు. మంగళవారం ఉదయం క్వారీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు, బోడె ప్రసాద్ అనుచరులు, స్థానికుల మద్దతుతో క్వారీలోకి వెళ్లకుండా యంత్రాలను అడ్డుకున్నారు. క్వారీలోకి దారి బాగుచేసుకున్నామని, శాండ్ వర్కర్స్ సొసైటీ పేరున తవ్వకాలు జరుపుతున్నామని టీడీపీ వర్గం స్పష్టంచేసింది. ఉచిత ఇసుక విధానం ప్రకటించాక ఇదేమిటని స్థానిక క్వారీ కార్మికులు, నెహ్రూ వర్గీయులు ప్రశ్నించారు. దీంతో కరకట్టపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ హనీష్‌లు ఇరువర్గాలతోనూ విడివిడిగా చర్చించారు. సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాసరావు గ్రామానికి వచ్చి క్వారీ రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ అవసరాలకు అనుమతులు ఉన్న పొక్లెయిన్‌లతో మాత్రమే తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు.


బహిరంగ మార్కెట్‌లోకి ఇసుక
ప్రభుత్వ అవసరాల పేరుతో వందల కొద్దీ లారీల ఇసుక బహిరంగ మార్కెట్‌లోకి వెళుతోందని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని క్వారీ కార్మికులు ఆరోపించారు. లారీల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నారని, డ్రెవర్లను కొడుతున్నారంటూ ఫిర్యాదుచేశారు. ఫ్రీ ఇసుక పేరుతో ఎమ్మెల్యే దందా చేస్తున్నారంటూ నెహ్రూ వర్గీయులు పోలీసు అధికారుల వద్దే ఆరోపణలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు నిర్ధారించిన నంబర్ల ఆధారంగా లారీలను మాత్రమే లోడింగ్‌కు పంపేలా చర్యలు తీసుకున్నామన్నారు. బయటి వాహనాలతో కూడా లోడింగ్ జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు కాబట్టి ఉన్నతాధికారులు నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు క్వారీని మూసివేస్తున్నామని ప్రకటిస్తూ  క్వారీలోకి వెళ్లే మార్గానికి ఉన్న గేటును మూయించారు.  

 
ఉత్తర్వులు ఇలా..

ఏప్రిల్ 14 నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలతో మే 11నుంచి క్వారీ కార్మికులు కూడా తవ్వుకునేందుకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ అవసరాలకు యంత్రాలతోనూ, వ్యక్తిగత అవసరాలకు కూలీలతోనూ లోడింగ్ చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు.
 
బారులు తీరిన లారీలు
 క్వారీలో లోడింగ్ నిలిచి పోవడంతో మద్దూరు ప్రాంతంలో లారీలు భారీగా నిలిచిపోయాయి. కరకట్ట పొడవునా, మద్దూరు గ్రామంలోకి వెళ్లే మార్గం లోనూ లారీలు, ట్రాక్టర్లు, పెద్ద లారీలు బారు లు దీరాయి.  ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు  కానీ ఇక్కడ ఉన్న లారీల్లో అధిక భాగం బయటి మార్కెట్‌లోకి వెళ్లే లారీలు ఉన్న విషయం స్పష్టమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement