madhu sudanachari
-
ఖాదీ వస్త్ర ప్రదర్శన ప్రారంభం
సనత్‌నగర్: ఖాదీని ప్రోత్సహించడమంటే మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమేనని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానంద తీర్థలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ఖాదీ వ్రస్తాలను ఆయన తిలకించారు. అనంతరం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారు చేయడం గొప్ప కళగా అభివర్ణించారు . చీరాంబరాలను అగ్గిపెట్టెల్లో ఎగుమతి చేసిన కళా నైపుణ్యం మన సొంతం అన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన బ్రాండ్లు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలని, అందుకోసం మరింతగా కళా నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తానన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ ఖాదీ గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ నెల 31 వరకు వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ఫౌండర్ చైర్మన్ పీవీ ప్రభాకర్‌రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ’తో నీటి సమస్య పరిష్కారం
భూపాలపల్లి అర్బన్ : గోదావరి అమృత జలాలను తాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిందని శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మిషన్ భగీరథలో భాగంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఆరు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శనివారం స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తాగునీటిని శాశ్వత ప్రాతిపదికన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మిషన్ భగీరథ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిని అమృత జలాలుగా భావించాలని సూచించారు. వచ్చే ఎండాకాలం వరకు భూపాలపల్లి పట్టణంలో తాగునీటి కొరత సమస్యే ఉండదన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పట్టణంలో మొత్తం 10 ట్యాంకులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. రూ.63 కోట్లతో పట్టణంలోని బస్టాండ్, మునిసిపల్ కార్యాలయాల సమీపం, సుభాష్‌కాలనీ, జంగేడు, ఖాసీంపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, కమిషనర్ రవీందర్‌యాదవ్, కౌన్సిలర్లు జరీనాబేగం, హైమావతి, నిర్మల, గోనే భాస్కర్, వజ్రావని, బీవీ.చారి, రాకేష్, ఆలయ కమిటీ చైర్మన్ రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు సాంబమూర్తి, సంపత్‌కుమార్, రవీందర్‌రెడ్డి, సమ్మయ్య, తిరుపతిరెడ్డి, శ్రీరాములు, మురళి, అందే సుధాకర్, అధికారులు రవీందర్‌నా«థ్ శ్రీనా«థ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. గురువారం పంచాయతీరాజ్, పురపాలక బిల్లులను ఆమోదించిన అనంతరం ఆయన సభను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. 13 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో మొత్తం 11 బిల్లులను సభ ఆమోదించిందని తెలిపారు. 60 గంటల 58 నిమిషాల పాటు సాగిన సభా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అత్యధికంగా 25.45 గంటలు మాట్లాడారు. అయితే, శాసనసభ కార్యదర్శి కార్యాలయంవిడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ సభ్యులు గంటా 21 నిమిషాలు మాట్లాడినట్లు పేర్కొనడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం రోజున ఏ పార్టీ వారికి మాట్లాడే అవకాశం రాలేదు. మరుసటి రోజున కాంగ్రెస్ సభ్యులు మాట్లాడే అవకాశం రాకుండానే సభ నుంచి సస్పెండ్ అయ్యారు. 48 గంటల 40 నిమిషాల పాటు మండలి.. 13 రోజుల పాటు నడిచిన శాసనమండలిలో 48 గంటల 40 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు సాగాయని మండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. గురువారం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మంత్రులు రెండు ప్రకటనలు చేశారన్నారు. అలాగే సభ్యులు మొత్తం వంద ప్రసంగాలు ఇచ్చారని వెల్లడించారు. 11 బిల్లులను మండలి ఆమోదించిందని.. ఐదు అంశాలపై లఘు చర్చ జరిగిందని స్వామిగౌడ్ తెలిపారు. -
అమ్మానాన్నల పేరిట దేవాలయం
హుస్నాబాద్: ‘కష్టేఫలికి నిదర్శనం మీ జీవితం. కర్తవ్య నిర్వహణకే మీ జీవితం అంకితం. కలలు సాకారం చేసుకోవడం మీ అభిమతం. కలతలెరుగని దంపతులుగా మీ కీర్తి శాశ్వతం. కన్నవారికి సదా ఆచరణీయం మీ ఇంగితం. మీ అనురాగస్మృతుల అనుభూతి మా గుండెల్లో పదిలం. మీ స్ఫూర్తితో నిత్య చైతన్యంగా జీవనం సాగిస్తున్న వారసులం..’అంటూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి తన తల్లిదండ్రులపై కవిత్వం రాసి గుండెల్లో నింపుకున్న ప్రేమను చాటారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం స్పీకర్ మధుసూదనాచారి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రామమైన నర్సక్కపల్లిలో మూడెకరాల స్థలంలో తన తల్లిదండ్రులు దివంగత వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య జ్ఞాపకార్థం దేవాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్కడే స్మృతివనం, వృద్ధాప్య ఆశ్రమం నిర్మించి అందులోనే ఉంటూ తల్లిదండ్రులకు రోజూ పూజలు చేసుకోవడమే తన కోరిక అన్నారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు ప్రేమగా చూడాలని వారిని, బాధించరాదని ఆయన ఉద్వేగంతో చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, తెలంగాణ వికాస సమితి రాష్ట ఉపాధ్యక్షుడు కవ్వ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'చారిత్రక కట్టడాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి'
హైదరాబాద్: మెట్రో రైలు నిర్మాణం సందర్భంగా హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మెట్రో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాకపోకల కోసం అసెంబ్లీ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారా ? అని అధికారులను అడిగారు. అదే విధంగా మెట్రో నిర్మాణ పనుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ స్పీకర్ అధికారులను ఆరా తీశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అలైన్మెంట్ మార్చినట్టుగా స్పీకర్‌కు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పూర్తి నివేదికతో మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించినట్టు స్పీకర్ తెలిపారు. -
స్పీకర్‌ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని మంత్రి హరీశ్ రావు గురువారం పరామర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన మధుసూదనాచారి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు స్పీకర్‌ను పరామర్శించారు.