ఖాదీ వస్త్ర ప్రదర్శన ప్రారంభం  | Khadi textile exhibition begins | Sakshi
Sakshi News home page

ఖాదీ వస్త్ర ప్రదర్శన ప్రారంభం 

Published Sun, Mar 12 2023 2:10 AM | Last Updated on Sun, Mar 12 2023 3:16 PM

Khadi textile exhibition begins - Sakshi

సనత్‌నగర్‌: ఖాదీని ప్రోత్సహించడమంటే మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమేనని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ ఆధ్వర్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానంద తీర్థలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ఖాదీ వ్రస్తాలను ఆయన తిలకించారు.

అనంతరం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రకృతికి అనుగుణంగా దుస్తులను తయారు చేయడం గొప్ప కళగా అభివర్ణించారు . చీరాంబరాలను అగ్గిపెట్టెల్లో ఎగుమతి చేసిన కళా నైపుణ్యం మన సొంతం అన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మన బ్రాండ్‌లు అంతర్జాతీయ బ్రాండ్‌లుగా ఎదగాలని, అందుకోసం మరింతగా కళా నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఖాదీ కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందేలా చూస్తానన్నారు. భవిష్యత్తు తరాలకు భారతీయ ఖాదీ గొప్పతనాన్ని తెలియజేయాలని ఆయన సూచించారు.

ఈ నెల 31 వరకు వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌ కమిటీ ఫౌండర్‌ చైర్మన్‌ పీవీ ప్రభాకర్‌రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ వైస్‌ చైర్మన్‌ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement