
హైదరాబాద్: గత ఏడాది జరిగిన ఖాదీ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కేసు దర్యాప్తును నారాయణగూడ నుంచి నల్లకుంట పోలీసులకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఖాదీ వ్యాపారి ప్రకాష్ వీర్ మృతిపై పలు అనుమనాలు ఉండటమే ఇందుకు కారణం. కొద్ది రోజులుగా నల్లకుంట ఇన్‌స్పెక్టర్ రవి ముమ్మర విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
అసలు ఏమైందంటే?
గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ అర్ధరాత్రి హైదర్‌గూడలోని ‘భారత్ ఖాదీ’ స్టోరు యజమాని ప్రకాష్ వీర్ అవంతినగర్‌లోని తన నివాసంలో రక్తపు మడుగులో కనిపించారు. నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఇతని మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అతని సోదరులు ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీ కార్యాలయానికి లేఖ రాశారు. తన సోదరుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని ఆ లేఖలో రాయడంతో దీనిపై అప్పుడు స్పెషల్ బ్రాంచ్ పూర్తి నివేదికను ఉన్నతాధికారుల ఎదుట ఉంచింది.
పోలీసుల అదుపులో భార్య, కుమార్తెలు?
కొద్దిరోజులుగా నల్లకుంట పోలీసులు వ్యాపారి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. రెండు, మూడు పర్యాయాలు మృతుడి భార్య, ఇద్దరు కుమార్తెలను విచారించిన సందర్భంలో పలు విషయాలు బయటకు వచి్చనట్లు తెలిసింది. దీంతో శనివారం వారిని నల్లకుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మరిన్ని విషయాలు, వ్యాపారి మృతిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment