వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మాదిగల అభ్యున్నతి
సాక్షి, అమరావతి: మాదిక సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరగడం లేదని, వారికి ద్రోహం చేశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మాదిగల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటునిస్తోందని తెలిపింది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ. 2.11 లక్షల కోట్లను వివిధ డీబీటీ పథకాల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని పేర్కొంది. ఈ పథకాల ద్వారా ఎస్సీలైన మాలలు, మాదిగలు, రెల్లి కులస్తులు గణనీయంగా లబ్ధి పొందారన్నది వాస్తవమని స్పష్టంచేసింది. వారి అభ్యున్నతి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని తెలిపింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలు పిసరంత కూడా లేదు. పైగా, ఆయన అధికారంలో ఉన్నంతకాలం ఎస్సీల్లో కులాల మధ్య చీలికలతో పబ్బం గడుపుకొన్నారు. ముఖ్యంగా ఎస్సీల మధ్య చంద్రబాబు రాజేసిన కుంపట్లు ఆ వర్గాలను అతలాకుతలం చేశాయి. నిత్యం దళితులను కించపరిచే వ్యాఖ్యలతో చంద్రబాబు, టీడీపీ నేతలు వారిని ఆత్మన్యూనతలోకి నెట్టే ప్రయత్నం చేశారు. గత ఎన్నికలకు ముందు ఓట్ల కోసం డప్పు కళాకారులు, చర్మకారులకు మొక్కుబడిగా చేసిన లబ్ధి కూడా వారికి సరిగా చేరలేదు.
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది. మొక్కుబడిగా కాకుండా అత్యంత పారదర్శకంగా ఎక్కడా అవినీతి, పక్షపాతం, వివక్షకు తావు లేకుండా, పార్టీల భేదాలు చూడకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ఈ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే. ఎవరికి జరగాల్సిన మేలును వారికి చేస్తోంది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్లు అందజేస్తోంది.
ఇలా ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన లక్షలాది మంది పేదలు ఉన్నారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీబీటీ పథకాల ద్వారా 46,76,828 మంది మాదిగలకు నేరుగా ప్రయోజనం చేకూరిందని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా రూ. 16,650 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొంది. ఏపీ చరిత్రలో మాదిగ సామాజిక వర్గానికి ఇంత పెద్ద స్థాయిలో లబ్ధి చేకూర్చడం సువర్ణ అధ్యాయమే.
వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, గృహ నిర్మాణంలో డీబీటీ, వైఎస్సార్, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, జగనన్న కళ్యాణమస్తు, వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, పంట రుణాలు, వాహన మిత్ర, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య శ్రీ చేయూత, పెన్షన్ కానుక, తదితర పథకాల ద్వారా మాదిగలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయోజనం కలుగుతోంది. ఇవికాక నాన్‌డీబీటీ పథకాల ద్వారా మాదిగలు మరింత మేలు పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వమే కాదు.. ఏ ప్రభుత్వంతో పోల్చినా వైఎస్ జగన్ నేతృత్వంలోనే అధిక మేలు జరిగిందన్నది ముమ్మాటికీ నిర్వివాదాంశం.