సునామీ స్థాయిలో భూకంపం
శాంటియాగో: సెంట్రల్ చిలీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9తీవ్రత భూప్రకంపనలు వణికించాయి. దీనివల్ల ఎలాంటి నష్టం జరిగిందనేదానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సెంట్రల్ చిలీలోని వాల్పరైజో అనే ప్రాంతానికి 42 కిలో మీటర్ల దూరంలో భూమి భారీ స్థాయిలో కంపించింది.
భూమి ఉపరితలానికి 9.8కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా, చిలీ జాతీయ అత్యవసర కార్యాలయంలో మాత్రం రిక్టర్ స్కేలుపై 6.1తీవ్రతతో భూమికంపించినట్లు చూపించింది. దాదాపు సునామీని సృష్టించేంత స్థాయిలో భూకంపం వచ్చినట్లు నేవీ అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి సునామీ అప్రమత్తత మాత్రం విధించలేదు. ముందస్తు, హెచ్చరికలు మాత్రం జారీ చేశారు.