మనకూ ఉంది..ఓ మహానంది
సాక్షి, కొడంగల్ : ఆలయం చిన్నదైనా కర్నూలు జిల్లా మహానందిలో మాదిరి మన జిల్లాలో ఒకటి అలాంటి ఆలయం ఉంది. నిరంతరం జలధార నంది నోటి నుంచి వస్తూ పరమేశ్వరుడికి జలాభిషేకం చేస్తున్న దృశ్యం కొడంగల్ మండలం కస్తూరుపల్లి గ్రామ సమీపంలో కనిపిస్తోంది. కస్తూరుపల్లి అటవీప్రాంతంలో కొలువైన లొంక బసవేశ్వర ఆలయంలో ఆ దృశ్యం కనిపిస్తుంది.
కొడంగల్ మండలంలోని కస్తూరుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో లొంక బసవేశ్వర ఆలయం ఉంది. నంది నోటిలోంచి గలగలా పారుతూ గంగమ్మ సందడి చేస్తుంటుంది. మహానందిలో నంది నోటినుంచి నీరు ఎలా వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తోంది. లొంక బసవేశ్వర ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో హాజరై పూజలు చేస్తుంటారు. బసవేశ్వర ఆలయ సమీపంలోకి ఎవరైనా భక్తి, నిష్టతో వెళ్లకపోతే ఆ నీరు ఆగిపోతుందని అక్కడి వారి నమ్మకం.
మహిమాన్విత ఆలయంగా లొంక బసవేశ్వర ఆలయం గుర్తింపు పొందుతోంది. అయితే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.