'కాపు ఐక్య గర్జనతో దడ పుట్టిద్దాం'
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభను విజయవంతం చేసేందుకు కాపు రిజర్వేషన్ల పోరాటసంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాద్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లపై అవగాహన ఉన్న ప్రముఖులు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, ఉన్న రిజర్వేషన్లు ఎందుకు పోయాయో ప్రముఖ యూనివర్సిటీలు, న్యాయకోవిదులు, మాజీ ఐఏఎస్‌లతో తమ సభ్యులకు తరగతులు చెప్పిస్తున్నాయి. అలాగే 150కి పైగా కాపు సంఘాలు సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాకు ఒక్కో గ్రూపును ఏర్పాటు చేసుకుని సందేశాలు పంపుతున్నాయి. ప్రతి జిల్లా నుంచి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారు కనీసం 50 వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
పాలకులను హడలెత్తిస్తాం: ఆరేటీ ప్రకాశ్
తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ పోరాటం కొనసాగుతుంద ని రాష్ట్ర కాపు రిజర్వేషన్ నాయకుడు ఆరేటీ ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ మహాసభ ఎవ్వరికీ వ్యతి రేకం కాదని, కాపుల ఐక్యత నిరూపించుకోవడానికేనని తెలి పారు. సీఎం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలన్నారు. మహాసభను జయప్రదం చేయడం, ముద్రగడ నాయకత్వాన్ని బలపరచడమే తమ లక్ష్యమన్నారు. రిజర్వేషన్లు లేనందున కాపుల్లో ఆర్థికంగా వెనుకబడినవారు ప్రభుత్వ ఉద్యోగాలకు, అధికారంలో వాటాకు దూరమయ్యారని కాపునేతలంటున్నారు. 50 ఏళ్ల కాలంలో 25 లక్షల ఉద్యోగాలు పోయాయని రాష్ట్ర కాపుసంఘాల నేతలు కఠారి అప్పారావు, గాళ్ల సుబ్రమణ్యంనాయుడు అన్నారు. ఈ పరిస్థితుల్లో కాపులకు బీసీ హోదా అవసరమని, అందుకే రాష్ట్రంలోని వివిధ కాపుసంఘాల్ని సమన్వయం చేస్తున్నామన్నారు.
కాపు రిజర్వేషన్ల చరిత్ర ఇదీ..
1915 నుంచి 1956 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు రిజర్వేషన్లు కొనసాగాయి. తెలగకు ఉపకులాలుగా ఉన్న కోస్తా కాపు, బలిజ, ఒంటరి కులాలు బీసీ జాబితాలో ఉన్నా యి. ఏపీ ఏర్పడిన తర్వాత తెలగ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించారు. 14-10-1961లో అప్పటి సీఎం దామోదరం సంజీవయ్య కాపుల్ని తిరిగి బీసీ జాబితాలో చేరుస్తూ జీవో జారీ చేశారు. అయితే నీలం సంజీవరెడ్డి సీఎం అయ్యాక 1966లో కాపుల బీసీ హోదా రద్దయింది.