నీటికోసం సరిహద్దులో గొడవ
♦ కృష్ణానది నిల్వనీటి విడుదలకు కర్ణాటక రైతుల యత్నం
♦ అడ్డుకున్న మహబూబ్‌నగర్ రైతులు.. స్వల్ప ఉద్రిక్తత
మాగనూర్: రాష్ట్ర సరిహద్దులో నీటి వివాదం చెలరేగింది.. ఆదివారం కృష్ణానదిలో నిల్వ ఉన్న నీటిని రివిట్మెంట్ తొలగించి కర్ణాటక రైతులు మళ్లించుకునేందుకు యత్నించగా.. మహబూబ్‌నగర్ జిల్లా రైతులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమకు తాగునీటి ఇబ్బందులు ఎదురవడంతోనే నీటికి అడ్డంగా ఉన్న రాళ్లను తొలగిస్తున్నామని కర్ణాటక రైతులు చెప్పారు.
తమకూ ఇబ్బందులు ఉన్నాయని, ఈ సమయంలో నిలిచిన నీటిని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదిలాఉండగా, కర్ణాటకలోని శక్తినగర్ పవర్‌ప్లాంట్‌కు నీళ్లు అవసరం ఉండడంతో వారం క్రితం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 1,551 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటిని నది మధ్యలో వారి ప్రాంతం లో కొంతవరకు ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నిల్వ చేసుకున్నారు. ఆ నీళ్లు మహబూబ్‌నగర్ సరిహద్దులోకి కూడా వచ్చి చేరాయి. వాటిని కర్ణాటక రైతులు దిగువకు విడుదల చేసుకోవడంతో వివాదం మొదలైంది.