‘ముత్తూట్’ నేరం ‘మహా’ ముఠా పనే!
⇒ బందిపోటు దొంగలకు ఆశ్రయం ఇచ్చిన నగరవాసి
⇒ దర్యాప్తులో కీలకాధారంగా మారిన ప్లాస్టిక్ కవర్
⇒ నలుగురు నిందితుల అరెస్టు, పరారీలో ముగ్గురు
సాక్షి, హైదరాబాద్:
ఎట్టకేలకు ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు. దొంగల ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. పట్టుబడినవారిలో అర్షద్, సంతోష్, షఫీ, దస్తగిరి ఉన్నారు. సూత్రధారి సహా ముగ్గురు పరారీలో ఉన్నారు. దొంగల ముఠాకు ఓ నగరవాసి షెల్టర్ ఇచ్చాడు. మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో చోరీకి యత్నించింది మహారాష్ట్రకు చెందిన ముఠా అని సంయుక్త పోలీసు కమిషనర్ షానావాజ్ ఖాసిం తెలిపారు. క్రైమ్, ఎస్వోటీ, శంషాబాద్ డీసీపీ జానకి షర్మిల, శ్రీనివాస్‌రెడ్డి, పద్మజలతో కలసి శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
జైల్లో జట్టుకట్టిన ముఠా
మహారాష్ట్రకు చెందిన షరీఫ్, అర్షద్ ఫలుముద్దీన్ ఖాన్ వివిధ కేసుల్లో అరెస్టు అయి అక్కడి ధూలే సబ్–జైలుకు వెళ్ళిన నేపథ్యంలో వీరికి పరిచయమైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఉస్మానాబాద్‌కు చెందిన పాత నేరగాడు షర్ఫుద్దీన్ నవబుద్దీన్ సయ్యద్ అలియాస్ షఫీని తమతో కలుపుకున్నారు. ఈ ముగ్గురూ కలిసి దోపిడీలు, బందిపోటు దొంగతనాలు చేయాలని పథకం వేశారు. లక్ష్యాలను ఎంపిక చేసుకోవడానికి షరీఫ్, షఫీ పలుమార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. బండ్లగూడలో నివసించే షఫీ మామ మహ్మద్ దస్తగిరి వద్ద వీరు షెల్టర్ తీసుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్‌లో ఉన్న పలు ముత్తూట్ సంస్థల వద్ద రెక్కీ నిర్వహించిన మీదట మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్ బ్రాంచిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ పథకాన్ని అమలులో పెట్టడానికి అన్నా, ఫరూఖ్‌లను తమతో కలుపుకున్నాడు.
ఈ ఆరుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 3వ తేదీ ఉదయం ఈ ఆరుగురు మారణాయుధాలతో హైదరాబాద్ చేరుకుని సాయంత్రం మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ సంస్థకు వెళ్లారు. అయితే, జనం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు నిందితులు సంస్థ మేనేజర్‌ను కలిసి రూ.20 వేలకు బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టాలంటూ మాట్లాడారు. గుర్తింపు పత్రాలు లేనిదే తాకట్టు సాధ్యం కాదని మేనేజర్ చెప్పడంతో తిరిగి వచ్చారు. ఆ రోజు షఫీ తన మామ దస్తగిరి ఇంటికి వెళ్ళి షెల్టర్ తీసుకోగా, మిలిగిన ఐదుగురు నగర శివార్లలోని జాతీయ రహదారిపై బుదేరా గ్రామంలో ఉన్న తాజ్ ధాబాలో బస చేశారు.
పథకం పారకపోవడంతో ...
దస్తగిరి మినహా మిగిలిన ఆరుగురు మరునాడు ముత్తూట్ సంస్థ వద్దకు టవేరా వాహనంలో చేరుకున్నారు. తమ వెంట రెండు తుపాకీలతో పాటు తల్వార్లు సైతం తీసుకువచ్చారు. డ్రైవర్‌తో పాటు మరో నిందితుడు వాహనంలోనే ఉండిపోగా... మిగిలిన నలుగురూ సంస్థ వద్దకు వెళ్లారు. ఒకరు మెట్ల వద్ద, మరొకరు తలుపు దగ్గర కాపుకాయగా... ఇద్దరు సంస్థ లోపలకు వెళ్ళారు. కొద్దిసేపటికి మిగిలిన ఇద్దరూ సంస్థలోకి వెళ్లి బందిపోటు దొంగతనానికి యత్నించారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో వీరి ప్రయత్నం విఫలమైంది. భయంతో అర్షద్ అక్కడ నుంచే పారిపోగా, మిగిలిన ఐదుగురూ టవేరా వాహనంలోనే ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. ముగ్గురు రోడ్డుపై దిగిపోయి పరారు కాగా, ఇద్దరు వాహనాన్ని పార్కింగ్ స్థలంలో నిలిపి నంబర్ ప్లేట్లు తీసేసి పారిపోయారు.
వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించిన నేపథ్యంలో అందులోంచీ వేలిముద్రలు సేకరించారు. హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్ వద్ద టవేరా వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో ఓ ప్లాస్టిక్ కవర్ లభించింది. కేసు దర్యాప్తులో ఈ కవర్ కీలకంగా మారింది. దానిపై ఉస్మానాబాద్‌లోని వీర్‌సావర్కర్ చౌక్ చిరునామా ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న షఫీ తన మామ దస్తగిరి దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. షఫీ కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు వీరిద్దరినీ పట్టుకుని విచారించగా, మిగిలిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉస్మానాబాద్, ముంబై వెళ్లిన పోలీసులు అర్షద్, సంతోష్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న షరీఫ్, అన్నా, ఫారూఖ్ కోసం గాలిస్తున్నారు.
‘ముత్తూట్’లో ఎవరి ‘పాత్రలు’వారివి!
మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో బందిపోటు దొంగతనానికి యత్నించిన మహారాష్ట్ర ముఠాలో ఎవరి పాత్రలు వారు పోషించారు. రెక్కీ నుంచి రంగంలోకి దిగే వరకు ప్రతి ఒక్కరూ కీలకంగా వ్యవహరించారు. నగరవాసిని మినహాయిస్తే ముంబై, ఉస్మానాబాద్‌కు చెందిన ఈ గ్యాంగ్‌లో ఒక్కరు మినహా మిగిలిన వారందరికీ నేర చరిత్ర ఉంది.
షరీఫ్: ఈ ముఠాకు, బందిపోటు దొంగతనం స్కెచ్‌కు సూత్రధారి షరీఫ్. 2008లో దోపిడీ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నందుర్బాగ్ పోలీసులకు చిక్కి ధూలే సబ్–జైలుకు వెళ్లాడు. ఇతడు ఎడమ కాలు కుంటుతూ ఉంటాడు.
అర్షద్: ముత్తూట్ సంస్థలోకి ముందుగా వెళ్లి కౌంటర్ పైనుంచి లోపలకు దూకింది అర్షదే. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఇతడు హోటల్లో సర్వర్. ఇతడు కూడా 2008లోనే దోపిడీ కేసులో నందుర్బాగ్ పోలీసులు అరెస్టు చేయగా ధూలే సబ్–జైలుకు వెళ్ళాడు. అక్కడే ఇతడికి షరీఫ్‌తో పరిచయం ఏర్పడింది.
షఫీ: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన షఫీ సీసీ టీవీలు ఇన్స్టలేషన్లో సాఫ్ట్వేర్ అంశాలు పర్యవేక్షించే పని చేస్తుంటాడు. 2004లో నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించి షోలాపూర్ పోలీసులకు చిక్కాడు. 2006లో పదేళ్ళ జైలు శిక్షపడగా మినహాయింపుల తర్వాత 2011లో విడుదలయ్యాడు. నగరవాసి దస్తగిరికు అల్లుడు. అర్షద్‌తో కలిసి ముత్తూట్ సంస్థలోకి ముందుగానే వెళ్ళాడు.
అన్నా, ఫారూఖ్: అన్నా, ఫారూఖ్ పైనా మహారాష్ట్రలో వివిధ కేసులు నమోదై ఉన్నాయి. షరీఫ్‌తో కలిసి అన్నా ముత్తూట్ సంస్థలోకి కత్తి పట్టుకుని వెళ్ళాడు. డ్రైవర్‌గా వ్యవహరించిన ఉస్మానాబాద్ వాసి సంతోష్‌తోపాటు ఫారూఖ్ సైతం కిందే వాహనంలో ఉండిపోయారు.
అనుకోకుండానే హ్యాపీహోమ్స్లోకి...
నగరవాసి దస్తగిరి సహా ఈ ముఠాలో ఎవరికీ ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి అవగాహన లేదు. కేవలం పారిపోయే క్రమంలోనే రహదారి పక్కన కనిపించిన బోర్డు ఆధారంగా వాహనం అక్కడ ఆపారు. ఈ నేరం చేయడానికి వినియోగించిన రెండు తుపాకుల్నీ సూత్రధారి షరీఫ్ సేకరించాడని, ప్రస్తుతం అవి అతడి వద్దనే ఉన్నాయని పట్టుబడిన నిందితులు చెప్తున్నారు.