main parties
-
నాలుగు దశల దిశ ఎటు..?
న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 543 సీట్లు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 373 సీట్లకు ఓటింగ్ పూర్తయింది. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకుగాను 19 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లకు పోలింగ్ ముగిసింది. 68.5 శాతానికి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తవడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని కూటముల గెలుపోటములపై అంచనాలు మొదలయ్యాయి.దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాలు (మొత్తం 129 సీట్లు), తూర్పు రాష్ట్రం ఒడిశా, పశ్చిమాన ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ (రెండూ కలిపి 74), లోక్‌సభ సీట్ల రీత్యా అతి పెద్ద రాష్ట్రం యూపీలోని దాదాపు సగం (39) సీట్లలో ఎన్నికలు ముగియడంతో మే 23న జరిగే ఓట్ల లెక్కింపులో వచ్చే ఫలితాలపై ఇప్పుడే ఓ అంచనాకు రావడానికి రాజకీయ పండితులు ప్రయత్నిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోగా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం కాషాయపక్షం దాదాపు 90 శాతనికి పైగా సీట్లు గెలుచుకుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలు పూర్తిగా అమలు చేయకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచిచూడాల్సి ఉంది. నిరుద్యోగం పెరగడం, మతపరమైన అసహనం పెరుగుతోందనే భావన కలిగే రీతిలో దేశంలో ఈ ఐదేళ్లలో జరిగిన సంఘటనలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. గత నవంబర్–డిసెంబర్లో మూడు హిందీ రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారం కైవసం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ కశ్మీర్లో పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేయడంతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీకి మళ్లీ జనాదరణ పెరిగిందని కొన్ని సర్వేలు సూచించాయి.మొదటి దశ ఎన్నికల నాటికి (ఏప్రిల్ 11) అనేక మీడియా సంస్థలు జరిపిన సర్వేలు సైతం బీజేపీకి గతంలో మాదిరిగా (282) సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సీట్లు రాకపోయినా, ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి మెజారిటీ తప్పక సాధిస్తుందని తేల్చాయి. బీజేపీకి 200–230 సీట్లు దక్కుతాయని కూడా కొన్ని సర్వేలు సూచించాయి. ఈ పార్టీకి రెండు వందలకు లోపే అంటే 180–190 మధ్యనే సీట్లు వస్తాయని వాదించేవారూ లేకపోలేదు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఈసారి వంద సీట్లకు మించి (2014లో 44 సీట్లు) రావని కొందరు ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే తమ పార్టీ బలం గతంతో పోల్చితే మూడు రెట్లు అంటే 132కి పెరుగుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇటీవల జోస్యం చెప్పారు. మొత్తం మీద పోలింగ్ పూర్తయిన ఈ 373 లోక్‌సభ స్థానాల్లో ప్రజలిచ్చే తీర్పే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చేదీ, లేనిదీ తేల్చివేస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం కావడం గమనార్హం. ఒక్క కర్ణాటకలో మినహా మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 2014లో బీజేపీ నామమాత్రంగానే సీట్లు సాధించింది. కర్ణాటకలో 17 సీట్లు సాధించిన బీజేపీ ఏపీలో రెండు, తమిళనాడు, తెలంగాణలో ఒక్కొక్క స్థానాన్నే గెలుచుకుంది. కేరళలో ఒక్క సీటూ దక్కలేదు. పాతిక సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20కి పైగా లోక్‌సభ సీట్లు, మెజారిటీ అసెంబ్లీ సీట్లు లభిస్తాయని అత్యధిక సర్వేలు తేల్చిచెప్పాయి. అసెంబ్లీ ఎన్నికలు కిందటి డిసెంబర్లోనే జరిగిన తెలంగాణలో మొత్తం 17 సీట్లలో డజనుకు పైగానే పాలకపక్షమైన టీఆర్ఎస్ సాధిస్తుందని అనేక మీడియా సంస్థలు అంచనావేశాయి. యూపీలో మహాకూటమి ప్రభావమెంత? పోలింగ్ పూర్తయిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల్లో మహాగట్బంధన్ పార్టీల మధ్య పొత్తు బాగానే పనిచేసిందనీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ దాదాపు సంపూర్ణంగా జరిగిందని వార్తలొస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు గట్టి మద్దతుదారులైన యాదవులు, జాటవులు(దళితులు), ముస్లింలు ఇతర బడుగువర్గాలు కూటమి అభ్యర్థులకు అనుకూలంగా సమీకృతమయ్యారని తెలుస్తోంది. ఇదే నిజమైతే యూపీలో మహా కూటమికి 35–40 సీట్లు రావచ్చని, బీజేపీ బలం కూడా అదే స్థాయిలో ఉండవచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడుతుందా? బెంగాల్‌లోని 42 సీట్లలో 18 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కిందటి ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ బలం పెరగవచ్చని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ దూకుడు విధానాలు, జనంలో మతాలవారీగా వచ్చిన చీలికల వల్ల సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్, కాంగ్రెస్ బలహీనపడ్డాయి. ఫలితంగా ప్రధాన ప్రత్యామ్నాయంగా బెంగాలీలకు బీజేపీ కనిపిస్తోందని సర్వేలు పేర్కొంటున్నాయి. ►నాలుగు విడతల్లో పోటీ పడిన అభ్యర్థులు 5,473 ►పోలింగ్ పూర్తయినవి/ మొత్తం స్థానాలు 373 / 543 (దాదాపు 69 శాతం) -
క్షేత్రస్థాయి నేతలకు పార్టీల గాలం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ గడువు దగ్గరపడుతున్నకొద్దీ అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ఓట్లు రాల్చగల నేతలకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా గ్రామాల్లో పట్టున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోపాటు గత ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓడిన నేతలను సైతం మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కనీసం వంద నుంచి వెయ్యి ఓట్లను ప్రభా వితం చేయగల నేతలను గుర్తించి వారిని మచ్చిక చేసుకునే బాధ్యతను పార్టీలు నియోజకవర్గ నేతలకు అప్పగిస్తున్నాయి. వారితోపాటే కుల సంఘాల పెద్దలు, కార్మిక సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలతో పార్టీల అభ్యర్థులే నేరుగా మాట్లాడుతూ వారు కోరిన మేర హామీలు ఇస్తూ ఓట్లు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు గ్రామాలవారీగా పట్టున్న నేతలు, సంఘ పెద్దలపై దృష్టి సారించారు. అందరూ కావాల్సిన వారే.. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో మెజారిటీ సర్పంచ్‌లు అధికార పార్టీ మద్దతుతో గెలిచినా ఓడిన అభ్యర్థుల్లోనూ చాలా మంది టీఆర్ఎస్ బలపరిచిన వారు ఉన్నారు. వారిలోనూ చాలా మందికి వందల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఓడిన అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార పార్టీ... ఓడిన అభర్థులపైనా దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకుంటోంది. దీంతోపాటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్పంచ్‌లకు వివిధ హామీలు ఇస్తూ పార్టీలో చేర్చుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలకు ముందుగా నిర్వహిస్తున్న సభల్లోనే ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పార్టీ కండువాలు వేస్తోంది. ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ సర్పంచ్‌లను కాపాడుకుంటూనే టీఆర్ఎస్ అసమ్మతి నేతలను ఆకట్టుకునే పనిలో పడింది. వారితో ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి నేతలతో మాట్లాడిస్తోంది. వారికున్న ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని తీరుస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. మహిళా సంఘాలకు గ్రామస్థాయిలో మహిళా భవనాలు, వాటిలో సౌకర్యాలతోపాటు తమకు అనుకూలంగా ఓటేసేందుకు ఏం కావాలో అడుగుతున్నారు. ఈ విషయంలో గ్రామ, మండలస్థాయి సంఘాల నాయకులతో మంతనాలు చేస్తున్నా రు. మహిళా సంఘాలను మచ్చిక చేసుకొని తమవైపు ఓట్లు వేసుకునేలా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితోపాటే కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గ్రామస్థాయి నాయకులు ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. ఓటుకు రూ. 2 వేలు ఇవ్వడంతోపాటు పోలింగ్ రోజున ప్రయాణ ఖర్చులు భరిస్తామని హామీ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఓటర్లకు సమాచారం చేరవేస్తున్నారు. చేవెళ్ల, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల లోక్‌సభ అభ్యర్థులు ఇలాంటి ప్రచారంలో ముందున్నారని తెలుస్తోంది. -
36 నామినేషన్ల తిరస్కరణ
ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో 36 నామినేషన్లు తిరస్కరించారు. సోమవారం కలెక్టర్ లోకేష్‌కుమార్ చాంబర్లో అనంతపురం లోక్‌సభ స్థానాల నామినేషన్లు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ చాంబర్లో హిందూపురం లోక్‌సభ స్థానాల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. అసెంబ్లీ నామినేషన్ల పరిశీలనను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల చాంబర్లలో చేపట్టారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 17 నామినేషన్లలో ధ్రువీకరణ పత్రాలు జత చేయకపోవడంతో 3 నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 14 నామినేషన్లను ఆమోదించారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 14 నామినేషన్లూ సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 266 నామినేషన్న్లు రాగా అధికారుల పరిశీలనలో 33 తిరస్కరణకు గురయ్యాయి. 233 నామినేషన్లను ఆమోదించారు. ప్రధాన పార్టీల నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. పలువురు స్వతంత్ర, డమ్మీ అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు తిరస్కరించారు. శింగనమలలో అత్యధికంగా 9 నామినేషన్లు తిరస్కరించారు. అనంతపురం అర్బన్, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గంలో దాఖలైన నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రస్తుతం ఆమోదం తెలిపిన వాటిలో రెబల్స్, ఇతర అభ్యర్థులు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటిస్తారు. -
మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ
మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐల ఆసక్తి ఆచితూచి అడుగేస్తున్న మజ్లిస్ సాక్షి,సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో పొత్తు కోసం మూడు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్‌తోపాటు టీఆర్ఎస్, సీపీఐలు మజ్లిస్‌తో ఎన్నికల పొత్తు లేదా అవగాహన కుదుర్చుకునేం దుకు తీవ్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ కూడా సార్వత్రిక ఎన్నికల పొత్తులపై కనీసం పెదవివిప్పకుండా మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. గ్రేటర్లో కాంగ్రెస్ గాలం : నగరంలో గట్టి పట్టుగల మజ్లిస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర యత్నాలు చేస్తోంది. గత రెండుసార్లు మాదిరి ఈసారి కూడా మజ్లిస్‌తో కలిసి అవగాహనతో ముందుకెళ్తే కొన్నిస్థానాల్లో సునాయసంగా బయటపడొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఏడాదిన్నర క్రితం చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్‌తో మజ్లిస్ తెగదెంపులు చేసుకున్నప్పటికీ తిరిగి మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా దగ్గరైంది. మరోవైపు పొత్తు షరతులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదించకుండా మజ్లిస్ పార్టీకే మిగిలిన పదవీకాలాన్ని వదిలివేయడం వెనుక కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల వ్యూహం బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరానికి చెందిన ఇద్దరు తాజా మాజీమంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లు మజ్లిస్‌తో పొత్తు కోసం ఆసక్తి కనబర్చుతున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ముస్లింఓటు బ్యాంకు కలిసొచ్చి అధికస్థానాల కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. గులాబీ గురి : తెలంగాణ ఏర్పాటుతో జోష్ మీదున్న టీఆర్ఎస్ కూడా మజ్లిస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టంచేసిన కేసీఆర్ మజ్లిస్‌తో కలిసి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్‌తో దోస్తీ చేస్తే తెలంగాణవ్యాప్తంగా ముస్లింఓట్లతో లబ్ధిపొందవచ్చని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. సీపీఐ ఆసక్తి : బీజేపీ, దాని మిత్రబృందాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసొచ్చే శక్తులతో సీపీఐ పొత్తులకు సన్నద్ధమవుతోంది. ముస్లిం వర్గంలో గట్టి పట్టున్న మజ్లిస్‌తో కలిసినడిస్తే కాషాయ మిత్రబృందాన్ని అడ్డుకోవడంతోపాటు పోటీచేసే పరిమిత స్థానాల్లో సైతం సునాయసంగా బయటపడివచ్చని ఆపార్టీ భావిస్తోంది. రెండంకెల వ్యూహంలో మజ్లిస్ : పాతనగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ..ఈసారి నెలకొన్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకొని చట్టసభల్లో రెండెంకల సీట్లు దక్కించుకునే వ్యూహరచనలో పడింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐలు పొత్తులపై ఆసక్తి కనబర్చడం మజ్లిస్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా కనీసం 25 సీట్లకు తగ్గకుండా విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. -
అభ్యర్థుల ఎంపికలో పార్టీల పాట్లు
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగం చేశాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుండగా.. జేడీఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇక రాజకీయంగా ఏడాది వయసు కూడా లేని ఆమ్ ఆద్మీ వినూత్న పంథాలో అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ‘ప్రైవేట్’పై బీజేపీ భారం.. రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటోంది. ఇందుకోసం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ రాజకీయ సర్వేల్లో మంచి పేరున్న ఓ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి పార్లమెంటు స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థుల గుణగణాలు, గెలుపు అవకాశాలు.. తదితర వాటిని ఆ సంస్థ ఆరాతీస్తోంది. ఇందుకోసం బూత్ స్థాయి సమీక్ష జరుపుతోంది. క్షేత్రస్థాయి నాయకులతోపాటు స్థానిక ప్రజలను కలుసుకుని వారికి ఇరవై నుంచి ముప్పై పశ్నలతో సమాధానం రాబడుతోంది. తర్వాత ఈ సమాధానాలన్నీంటినీ పరిశీలించి ఆయా పార్లమెంటు స్థానానికి ఎవరిని బరిలో దింపితే ఉత్తమ ఫలితాలు రావచ్చుననే విషయాన్ని నివేదిక రూపొంలో రాష్ట్ర నాయకులకు అందించనుంది. ఇలా ఇప్పటికే దాదాపు 20 స్థానాలకు పైగా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. పాత పంథాలోనే కాంగ్రెస్.. దక్షిణ భారతదేశంలో రోజురోజుకు ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఎక్కువ సీట్లు పొందాలని ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగానే టికెట్ల పంపకంలో అసమ్మతి పెరగకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిత్యం పఠించే ‘ యువతకు ప్రాధాన్యత’ మంత్రాన్ని పక్కన పెట్టి.. వయసు మళ్లిన సీనియర్లనే అభ్యర్థులుగా ఎన్నుకునే పనికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ తరఫున తొమ్మిది మంది ఎంపీలు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ సిటింగ్‌లందరికీ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. బెంగళూరు దక్షిణ (నందన్నిలేఖాని), మంగళూరు (జనార్థనపూజారి), బళ్లారి (ఎన్.వై హనుమంతప్ప) స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెల్సింది. ఇక మిగిలిన 16 స్థానాలకు ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో వారిలో ఎవరికి టికెట్ కేటాయించాలనే విషయాన్ని కేపీసీసీ నేతలు అధిష్టానానికే వదిలేశారు. ఈమేరకు రూపొందించిన జాబితాను ఈనెల 20లోపు పార్టీ హై కమాండ్‌కు పంపనున్నారు. ఇంకా అభ్యర్థులను గుర్తించే పనిలోనే జేడీఎస్ .. అభ్యర్థుల ఎంపిక విషయంలో జేడీఎస్ వెనుకబడింది. మాజీ సీఎం యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప చేరికతో బీజేపీకి అదనపు బలం చేకూరినటై్లంది. దీంతో అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీకి దీటైన పోటీ ఇవ్వగల అభ్యర్థుల వేటలో జేడీఎస్ ఉంది. చాలా స్థానాల్లో పిలిచి టికెట్టు ఇస్తామన్నా జేడీఎస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ నాయకులు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అటుంచి.. అభ్యర్థులను గుర్తించడానికే ఆపసోపాలు పడుతున్నారు. ఉనికి కోసం ఆప్ ... ఇప్పుడున్న పార్టీలన్నింటికంటే జూనియర్ అయిన ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ర్టంలో సాధ్యమైనన్ని స్థానాల్లో గెలుపొంది దక్షణాదిలో తన ఉనికిని చాటుకోడానికి వ్యూహాలు రచిస్తోంది. నేరచరిత్రలేని వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడానికి ఆచితూచి అడుగులేస్తోంది. పార్టీ తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఒక్కో శాసనసభ పరిధిలో కనీసం వంద మంది ఓటర్ల మద్దతున్నట్లు సంతకాలు ఉండాలని నిబంధన పెట్టింది. ఇలా రాష్ట్రంలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించనుంది.