సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగం చేశాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుండగా.. జేడీఎస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇక రాజకీయంగా ఏడాది వయసు కూడా లేని ఆమ్ ఆద్మీ వినూత్న పంథాలో అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.
‘ప్రైవేట్’పై బీజేపీ భారం..
రాష్ట్రంలో 28 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటోంది. ఇందుకోసం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ రాజకీయ సర్వేల్లో మంచి పేరున్న ఓ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి పార్లమెంటు స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థుల గుణగణాలు, గెలుపు అవకాశాలు.. తదితర వాటిని ఆ సంస్థ ఆరాతీస్తోంది. ఇందుకోసం బూత్ స్థాయి సమీక్ష జరుపుతోంది.
క్షేత్రస్థాయి నాయకులతోపాటు స్థానిక ప్రజలను కలుసుకుని వారికి ఇరవై నుంచి ముప్పై పశ్నలతో సమాధానం రాబడుతోంది. తర్వాత ఈ సమాధానాలన్నీంటినీ పరిశీలించి ఆయా పార్లమెంటు స్థానానికి ఎవరిని బరిలో దింపితే ఉత్తమ ఫలితాలు రావచ్చుననే విషయాన్ని నివేదిక రూపొంలో రాష్ట్ర నాయకులకు అందించనుంది. ఇలా ఇప్పటికే దాదాపు 20 స్థానాలకు పైగా అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం.
పాత పంథాలోనే కాంగ్రెస్..
దక్షిణ భారతదేశంలో రోజురోజుకు ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఎక్కువ సీట్లు పొందాలని ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగానే టికెట్ల పంపకంలో అసమ్మతి పెరగకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిత్యం పఠించే ‘ యువతకు ప్రాధాన్యత’ మంత్రాన్ని పక్కన పెట్టి.. వయసు మళ్లిన సీనియర్లనే అభ్యర్థులుగా ఎన్నుకునే పనికి శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ తరఫున తొమ్మిది మంది ఎంపీలు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ సిటింగ్‌లందరికీ టికెట్లు కేటాయించినట్లు సమాచారం. బెంగళూరు దక్షిణ (నందన్‌నిలేఖాని), మంగళూరు (జనార్థనపూజారి), బళ్లారి (ఎన్.వై హనుమంతప్ప) స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెల్సింది. ఇక మిగిలిన 16 స్థానాలకు ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో వారిలో ఎవరికి టికెట్ కేటాయించాలనే విషయాన్ని కేపీసీసీ నేతలు అధిష్టానానికే వదిలేశారు. ఈమేరకు రూపొందించిన జాబితాను ఈనెల 20లోపు పార్టీ హై కమాండ్‌కు పంపనున్నారు.
ఇంకా అభ్యర్థులను గుర్తించే పనిలోనే జేడీఎస్ ..
అభ్యర్థుల ఎంపిక విషయంలో జేడీఎస్ వెనుకబడింది. మాజీ సీఎం యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప చేరికతో బీజేపీకి అదనపు బలం చేకూరినటై్లంది. దీంతో అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీకి దీటైన పోటీ ఇవ్వగల అభ్యర్థుల వేటలో జేడీఎస్ ఉంది. చాలా స్థానాల్లో పిలిచి టికెట్టు ఇస్తామన్నా జేడీఎస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ నాయకులు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక అటుంచి.. అభ్యర్థులను గుర్తించడానికే ఆపసోపాలు పడుతున్నారు.
ఉనికి కోసం ఆప్ ...
ఇప్పుడున్న పార్టీలన్నింటికంటే జూనియర్ అయిన ఆమ్ ఆద్మి పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ర్టంలో సాధ్యమైనన్ని స్థానాల్లో గెలుపొంది దక్షణాదిలో తన ఉనికిని చాటుకోడానికి వ్యూహాలు రచిస్తోంది. నేరచరిత్రలేని వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడానికి ఆచితూచి అడుగులేస్తోంది. పార్టీ తరపున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఒక్కో శాసనసభ పరిధిలో కనీసం వంద మంది ఓటర్ల మద్దతున్నట్లు సంతకాలు ఉండాలని నిబంధన పెట్టింది. ఇలా రాష్ట్రంలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించనుంది.
అభ్యర్థుల ఎంపికలో పార్టీల పాట్లు
Published Thu, Jan 16 2014 5:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement