న్యూఢిల్లీ: మూడు నెలల క్రితం దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ‘చీపురు’ దాదాపు కాంగ్రెస్‌ను ఊడ్చేసినంత పనిచేయడమేగాకుండా బీజేపీని వెనక్కుతోసి పీఠాన్నెక్కింది. ఆ గద్దెపై ఎన్నిరోజులు కూర్చుందనే విషయాన్ని పక్కనబెడితే తాను గద్దె దిగిపోవడానికి అసలు కారణం ‘టార్చ్’ అనే విషయాన్ని చీపురు ఆలస్యంగా గుర్తించింది.
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పదిహేను నియోజకవర్గాల్లో ‘చీపురు’తోపాటు ‘టార్చ్’ కూడా పోటీ చేసింది. తాను గెలువకపోయినా చీపురుకు ఓట్లు పడకుండా చేసింది. చీపురుకు ఓటేద్దామని వచ్చినవారిని కూడా కంగారు పెట్టి తనకు ఓటు వేసుకునేలా చేసింది. పదమూడు నియోజవర్గాల్లో చీపురు ఓట్లు తగ్గడానికి, రెండు నియోజకవర్గాల్లో చీపురు ఓడిపోవడానికి కారణమైంది.
దీంతో చీపురును గుర్తుగా చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఇప్పుడు టార్చ్ అంటేనే అసహనం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ‘టార్చ్’ నుంచి ముప్పు ముంచుకొచ్చే ప్రమాదముండడంతో దానిని మార్చాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. లేదంటే కనీసం గుర్తునైనా మార్చాలని, టార్చ్ వెలుగులను సూచించే గీతలను కుదించాలని కోరారు.
ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేత ఆశిష్ తల్వార్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనక్‌పురి, కల్కాజీ నియోజకవర్గాల్లో బీజేపీ చాలా తక్కువ ఓట్ల తేడాతో ఆప్‌ను ఓడించిందని, స్వతంత్ర అభ్యర్థుల గుర్తు ‘టార్చ్’ కావడంవల్ల చాలామంది దానినే చీపురుగా భావించి ఓట్లు వేశారని, ఆ గుర్తు లేనట్లయితే ఆ ఓట్లు తమకే పడేవని, ఆ రెండు నియోజకవర్గాలు కూడా తమ ఖాతాలో చేరితే తాము గద్దె దిగే అవసరమే వచ్చేదికాదన్నారు.
మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు తగ్గడానికి ‘టార్చ్’ కారణమన్నారు. కల్కాజీ నియోజకవర్గంలో ‘టార్చ్’ గుర్తుపై పోటీ చేసిన ధర్మేందర్ కుమార్ 3,092 ఓట్లు సంపాదించారని, ఆప్ అభ్యర్థి ధరమ్‌బీర్ సింగ్ బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 2,044 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని, సింగ్‌కు పడిన ఓట్లు దాదాపుగా ఆప్‌కు పడాల్సిన ఓట్లేలని చెప్పారు.
ఇక జనక్‌పురి నుంచి పోటీచేసిన రాజేశ్ రిషీ బీజేపీ అభ్యర్థి చేతిలో కేవలం 2,644 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని, ఈ నియోజకవర్గంలో టార్చ్ గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థికి 4,332 ఓట్లు వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ఓటమి పాలైన నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు చేసిన సర్వేలో పార్టీ చిహ్నాన్ని గుర్తించడంలో జరగిన పొరపాటు వల్లే స్వతంత్ర అభ్యర్థులకు ఓట్లు పడ్డాయని, ఫలితంగా బీజేపీ నెగ్గిందనే తేలిందన్నారు. అందుకే ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఉండడం కోసం ‘గుర్తు’లో మార్పులు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తల్వార్ చెప్పారు.
మహాప్రభో... టార్చ్‌ను మార్చండి!
Published Wed, Mar 26 2014 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement