న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 543 సీట్లు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 373 సీట్లకు ఓటింగ్ పూర్తయింది. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకుగాను 19 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని సీట్లకు పోలింగ్ ముగిసింది. 68.5 శాతానికి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తవడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని కూటముల గెలుపోటములపై అంచనాలు మొదలయ్యాయి.దక్షిణాదిలోని మొత్తం ఐదు రాష్ట్రాలు (మొత్తం 129 సీట్లు), తూర్పు రాష్ట్రం ఒడిశా, పశ్చిమాన ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్ (రెండూ కలిపి 74), లోక్‌సభ సీట్ల రీత్యా అతి పెద్ద రాష్ట్రం యూపీలోని దాదాపు సగం (39) సీట్లలో ఎన్నికలు ముగియడంతో మే 23న జరిగే ఓట్ల లెక్కింపులో వచ్చే ఫలితాలపై ఇప్పుడే ఓ అంచనాకు రావడానికి రాజకీయ పండితులు ప్రయత్నిస్తున్నారు.
కిందటి ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకోగా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో సైతం కాషాయపక్షం దాదాపు 90 శాతనికి పైగా సీట్లు గెలుచుకుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలు పూర్తిగా అమలు చేయకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచిచూడాల్సి ఉంది. నిరుద్యోగం పెరగడం, మతపరమైన అసహనం పెరుగుతోందనే భావన కలిగే రీతిలో దేశంలో ఈ ఐదేళ్లలో జరిగిన సంఘటనలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. గత నవంబర్–డిసెంబర్‌లో మూడు హిందీ రాష్ట్రాలు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి అధికారం కైవసం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.
కానీ కశ్మీర్‌లో పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేయడంతో హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ముఖ్యంగా ప్రధాని మోదీకి మళ్లీ జనాదరణ పెరిగిందని కొన్ని సర్వేలు సూచించాయి.మొదటి దశ ఎన్నికల నాటికి (ఏప్రిల్ 11) అనేక మీడియా సంస్థలు జరిపిన సర్వేలు సైతం బీజేపీకి గతంలో మాదిరిగా (282) సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సీట్లు రాకపోయినా, ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి మెజారిటీ తప్పక సాధిస్తుందని తేల్చాయి. బీజేపీకి 200–230 సీట్లు దక్కుతాయని కూడా కొన్ని సర్వేలు సూచించాయి. ఈ పార్టీకి రెండు వందలకు లోపే అంటే 180–190 మధ్యనే సీట్లు వస్తాయని వాదించేవారూ లేకపోలేదు.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఈసారి వంద సీట్లకు మించి (2014లో 44 సీట్లు) రావని కొందరు ఎన్నికల విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే తమ పార్టీ బలం గతంతో పోల్చితే మూడు రెట్లు అంటే 132కి పెరుగుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇటీవల జోస్యం చెప్పారు. మొత్తం మీద పోలింగ్ పూర్తయిన ఈ 373 లోక్‌సభ స్థానాల్లో ప్రజలిచ్చే తీర్పే.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చేదీ, లేనిదీ తేల్చివేస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా
అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం కావడం గమనార్హం. ఒక్క కర్ణాటకలో మినహా మిగిలిన నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 2014లో బీజేపీ నామమాత్రంగానే సీట్లు సాధించింది. కర్ణాటకలో 17 సీట్లు సాధించిన బీజేపీ ఏపీలో రెండు, తమిళనాడు, తెలంగాణలో ఒక్కొక్క స్థానాన్నే గెలుచుకుంది. కేరళలో ఒక్క సీటూ దక్కలేదు. పాతిక సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20కి పైగా లోక్‌సభ సీట్లు, మెజారిటీ అసెంబ్లీ సీట్లు లభిస్తాయని అత్యధిక సర్వేలు తేల్చిచెప్పాయి. అసెంబ్లీ ఎన్నికలు కిందటి డిసెంబర్‌లోనే జరిగిన తెలంగాణలో మొత్తం 17 సీట్లలో డజనుకు పైగానే పాలకపక్షమైన టీఆర్‌ఎస్ సాధిస్తుందని అనేక మీడియా సంస్థలు అంచనావేశాయి.
యూపీలో మహాకూటమి ప్రభావమెంత?
పోలింగ్ పూర్తయిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల్లో మహాగట్‌బంధన్ పార్టీల మధ్య పొత్తు బాగానే పనిచేసిందనీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ దాదాపు సంపూర్ణంగా జరిగిందని వార్తలొస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు గట్టి మద్దతుదారులైన యాదవులు, జాటవులు(దళితులు), ముస్లింలు ఇతర బడుగువర్గాలు కూటమి అభ్యర్థులకు అనుకూలంగా సమీకృతమయ్యారని తెలుస్తోంది. ఇదే నిజమైతే యూపీలో మహా కూటమికి 35–40 సీట్లు రావచ్చని, బీజేపీ బలం కూడా అదే స్థాయిలో ఉండవచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలపడుతుందా?
బెంగాల్‌లోని 42 సీట్లలో 18 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కిందటి ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ బలం పెరగవచ్చని అనేక సర్వేలు సూచిస్తున్నాయి. సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ దూకుడు విధానాలు, జనంలో మతాలవారీగా వచ్చిన చీలికల వల్ల సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్, కాంగ్రెస్ బలహీనపడ్డాయి. ఫలితంగా ప్రధాన ప్రత్యామ్నాయంగా బెంగాలీలకు బీజేపీ కనిపిస్తోందని సర్వేలు పేర్కొంటున్నాయి.
►నాలుగు విడతల్లో పోటీ పడిన అభ్యర్థులు 5,473
►పోలింగ్ పూర్తయినవి/ మొత్తం స్థానాలు 373 / 543 (దాదాపు 69 శాతం)
Comments
Please login to add a commentAdd a comment