మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ
- మజ్లిస్‌తో పొత్తుకు మూడు పార్టీలు తహతహ
- కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐల ఆసక్తి
- ఆచితూచి అడుగేస్తున్న మజ్లిస్
సాక్షి,సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో పొత్తు కోసం మూడు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్‌తోపాటు టీఆర్‌ఎస్, సీపీఐలు మజ్లిస్‌తో ఎన్నికల పొత్తు లేదా అవగాహన కుదుర్చుకునేం దుకు తీవ్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మజ్లిస్ కూడా సార్వత్రిక ఎన్నికల పొత్తులపై కనీసం పెదవివిప్పకుండా మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది.
గ్రేటర్‌లో కాంగ్రెస్ గాలం : నగరంలో గట్టి పట్టుగల మజ్లిస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర యత్నాలు చేస్తోంది. గత రెండుసార్లు మాదిరి ఈసారి కూడా మజ్లిస్‌తో కలిసి అవగాహనతో ముందుకెళ్తే కొన్నిస్థానాల్లో సునాయసంగా బయటపడొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఏడాదిన్నర క్రితం చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్‌తో మజ్లిస్ తెగదెంపులు చేసుకున్నప్పటికీ తిరిగి మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా దగ్గరైంది. మరోవైపు పొత్తు షరతులో భాగంగా జీహెచ్‌ఎంసీ మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదించకుండా మజ్లిస్ పార్టీకే మిగిలిన పదవీకాలాన్ని వదిలివేయడం వెనుక కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల వ్యూహం బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా నగరానికి చెందిన ఇద్దరు తాజా మాజీమంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లు మజ్లిస్‌తో పొత్తు కోసం ఆసక్తి కనబర్చుతున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ముస్లింఓటు బ్యాంకు కలిసొచ్చి అధికస్థానాల కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
గులాబీ గురి : తెలంగాణ ఏర్పాటుతో జోష్ మీదున్న టీఆర్‌ఎస్ కూడా మజ్లిస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టంచేసిన కేసీఆర్ మజ్లిస్‌తో కలిసి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్‌తో దోస్తీ చేస్తే తెలంగాణవ్యాప్తంగా ముస్లింఓట్లతో లబ్ధిపొందవచ్చని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
సీపీఐ ఆసక్తి : బీజేపీ, దాని మిత్రబృందాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసొచ్చే శక్తులతో సీపీఐ పొత్తులకు సన్నద్ధమవుతోంది. ముస్లిం వర్గంలో గట్టి పట్టున్న మజ్లిస్‌తో కలిసినడిస్తే కాషాయ మిత్రబృందాన్ని అడ్డుకోవడంతోపాటు పోటీచేసే పరిమిత స్థానాల్లో సైతం సునాయసంగా బయటపడివచ్చని ఆపార్టీ భావిస్తోంది.
రెండంకెల వ్యూహంలో మజ్లిస్ : పాతనగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ..ఈసారి నెలకొన్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకొని చట్టసభల్లో రెండెంకల సీట్లు దక్కించుకునే వ్యూహరచనలో పడింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐలు పొత్తులపై ఆసక్తి కనబర్చడం మజ్లిస్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా కనీసం 25 సీట్లకు తగ్గకుండా విజయం సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.