అవినీతే అసలు సమస్య
‘ఫిక్కీ’ వార్షిక సమావేశంలో రాహుల్ గాంధీ
ఈ వ్యవస్థ పోవాలి, జవాబుదారీతనం రావాలి
‘‘అవినీతి ప్రజల రక్తం తోడేస్తోంది. ఇక అధికార వ్యవస్థలో అన్ని దశల్లోనూ పాతుకుపోయిన అంతులేని నియంతృత్వ ధోరణి దేశాభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది. ఇవి రెండూ మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు’’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టుల తాలూకు పర్యావరణ అనుమతులను, తద్వారా పారిశ్రామికాభివృద్ధిని అధికార నియంతృత్వ వ్యవస్థ అడ్డుకుంటోందన్నారు. దాన్ని నిర్మూలించి, ఆ స్థానంలో అనుమతుల జారీని త్వరితగతం చేసే నిబంధనల ఆధారిత వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘‘ఒక ముఖ్యమంత్రో, పర్యావరణ మంత్రో తామనుకున్న ఏ నిర్ణయమైన తీసేసుకోగల పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఇలా కొద్దిమందితో కూడిన శక్తులకు ఏదైనా సాధ్యమనే నియంతృత్వ భావజాలం నుంచి మనం బయటపడాలి’’ అన్నారు. శనివారం ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో దేశ పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. పర్యావరణ అనుమతుల విషయంలో జరుగుతున్న అంతులేని జాప్యంపై వారు వెలిబుచ్చిన ఆందోళనలు పూర్తిగా సబబేనని అంగీకరించారు. ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకు తన వద్ద సమాధానమే లేదంటూ వాపోయారు. పర్యావరణ తదితర అనుమతులన్నీ ముందే పొందేందుకు వీలుగా సహజ వనరుల పెట్టుబడులకు సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు. అటు అభివృద్ధి, ఇటు పర్యావరణాల్లో దేనికీ నష్టం జరగకుండా మధ్యే మార్గాన్ని అనుసరించాలని సూచించారు.
‘‘భారీ ట్రక్కులు కూడా దూరగలిగినంత పెద్ద రంధ్రాలు (లోపాలు) మన వ్యవస్థలో కోకొల్లలుగా ఉన్నాయి. మన నియంత్రణ వ్యవస్థను తక్షణమే సమూలంగా మార్చాల్సిన అవసరముంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ ఎక్కడికక్కడ నిర్దిష్ట కాలావధితో కూడిన స్పష్టమైన జవాబుదారీతనం ఉండి తీరాల్సిందే. స్వతంత్ర భారత్‌కు 100 ఏళ్లు నిండేసరికి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోవాలి’’ అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తక్షణ సమస్యలని, వాటిని అదుపు చేయడం యూపీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని రాహుల్ అన్నారు. అవినీతిని ‘అంగీకరించలేని భారం’గా అభివర్ణించిన ఆయన, దాని అంతానికి లోక్‌పాల్ బిల్లు తెచ్చిన ఘనత తమ యూపీఏ సర్కారుదేనన్నారు. అదేగాక సమాచార హక్కు చట్టం తదితరాలన్నీ యూపీఏ ఘనతలేనని చెప్పుకొచ్చారు. పొలం నుంచి పళ్లెం దాక సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సి ఉందన్నారు. మన యువతలో అపార ప్రతిభ ఉన్నా ఇక్కడి విద్యా వ్యవస్థతో వారికి న్యాయం జరగడం లేదన్నారు. దాన్ని మెరుగు పరిచేందుకు పారిశ్రామిక రంగం ముందుకు రావాలని కోరారు.
ఎన్నికల్లో సిక్సర్ కొట్టలేకపోయాం
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము సిక్సర్ బాదలేకపోయామని రాహుల్ చమత్కరించారు. అయితే, ‘‘ప్రజా తీర్పును అంగీకరిస్తాం. వారి సందేశాన్ని అర్థం చేసుకుని, తిరిగి పైకి లేచే శక్తి కాంగ్రెస్‌కు ఉంది’’ అని అన్నారు. బీజేపీని ద్వేషం, విభజనవాదాల పునాదులపై పుట్టిన పార్టీగా అభివర్ణించారు. విభజనవాదులతో జాగ్రత్తగా ఉండాలంటూ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.