‘మీ సేవ’.. ఏదీ తోవ!
గజ్వేల్: మున్సిపాలీటీలు, నగరపంచాయతీల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలుకునోచుకోవడంలేదు. అవినీతి నిర్మూలన, సత్వర సేవలే లక్ష్యంగా గతేడాది నుంచే ‘మీ-సేవ’తో పుర సేవలన్నీ అనుసంధానం చేయాలనే ప్రతిపాదన వ్యవహారం చడీచప్పుడు లేకుండా తయారైంది. ఫలితంగా ప్రజల ఇబ్బందులు యథాతథంగా మారాయి.
జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్, పటాన్చెరు మున్సిపాలిటీలు, గజ్వేల్, జోగిపేట నగర పంచాయతీలున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధి పెరుగుతుండగా ప్రజలకు వేగంగా సేవలందించడం కష్టతరంగా మారుతోంది. సిబ్బంది బాధ్యతారాహిత్యం, అవినీతి కూడా ప్రజలకు ప్రతి బంధకమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మున్సిపాలిటీల ప్రధాన సేవలన్నింటినీ ‘మీ-సేవా’ ద్వారా అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది.
ఇందుకు సంబంధించి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లకు గతేడాది పలుమార్లు జిల్లాస్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కొత్త విధానం అమల్లోకి రాబోతుందని ఏడాది కిందటే హడావిడి చేశారు. ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ‘మీ-సేవ’ ద్వారా అందిస్తున్నారు. కొత్త విధానంలో నల్లా కనెక్షన్, ఇంటి నిర్మాణానికి అనుమతి, ఆస్తి మార్పిడి, పన్నుల అసిస్మెంట్, పన్నుల సవరణ, ట్రేడ్ లెసైన్స్ వంటి ఆరు సేవలను ఆన్లైన్ ద్వారానే అందించడానికి చర్యలు చేపడతామని ప్రకటించారు.
ఈ విధానంలో ముందుగా దరఖాస్తుదారులు రూ.35 రుసుము చెల్లించి ఆప్లికేషన్ ఫారమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా వారి అభ్యర్థనపై విచారణ జరిపి ఆ ఆమోదం తెలిపిన తర్వాత ఆ సేవకు సంబంధించి చార్జీలను చెల్లించాలి. మొత్తం మీద ఈ విధానం అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. ప్రజలకు కూడా వేగంగా సేవలందుతాయని ప్రభుత్వ ఆలోచన. కానీ పరిస్థితి భిన్నంగా మారటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.