Maize crops
-
మక్కకు ‘రంగు’దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు రంగు దెబ్బ పడింది. తడిసిపోయి రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయబోమంటూ మార్క్‌ఫెడ్ చేతులెత్తేసింది. దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్న కొంటే తమకు నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవలి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అదే తరహాలో మొక్కజొన్నను కూడా కొనాలని కోరుతున్నారు. తడిసి రంగుమారిన మక్కలను మార్క్‌ఫెడ్ కొనకపోవడంతో.. వ్యాపారులు అతి తక్కువ ధర ఇస్తున్నారని, తాము నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. తడిసిన 4 లక్షల టన్నులు రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి యాసంగిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో 6.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తంగా 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గత నెలన్నర రోజుల్లో పలుమార్లు కురిసిన వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేకచోట్ల గింజలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న తడిసి రంగు మారింది. గింజలు ముడుచుకుపోయాయి. మొత్తంగా 4 లక్షల టన్నుల మేర మొక్కజొన్న రంగు కోల్పోవడమో, గింజ పురుగు పట్టడమో, ముడుచుకుపోవడమో జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. మెల్లగా ధర తగ్గించేసి.. మొదట్లో నాణ్యమైన పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర పలికింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,962 కాగా.. వ్యాపారులు రూ.2,500 వరకు ధర పెట్టారు. కానీ తర్వాత క్రమంగా రూ.1,650కు ధర తగ్గించారు. వర్షాలకు తడిసి, రంగుమారిన మొక్కజొన్నకు కనీసం రూ.1,200 వరకు కూడా ధరపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 400 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, 8.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొని వారం రోజులు దాటినా ఇప్పటివరకు 77 కేంద్రాలే ప్రారంభించారు. అయితే రంగుమారిన, దెబ్బతిన్న మొక్కజొన్నను ఏమాత్రం కొనుగోలు చేసేది అధికారులు చెప్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరిలా మక్కనూ కొనాలి.. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో రంగు మారిన వడ్లకు కొనుగోలు సమస్య తలెత్తడం లేదు. కానీ మొక్కజొన్న విషయంలో మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతోందని.. తమ కష్టం దళారుల పాలవుతోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు అడ్డగోలు తక్కువ ధర ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. వరి తరహాలో మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ నిబంధనలివీ.. తేమ 14 శాతం మించకూడదు దెబ్బతిన్న గింజలు 1.5 శాతం మించకూడదు రంగుపోయినవి, దెబ్బతిన్నవి 3 శాతం మించకూడదు పురుగు పట్టిన గింజలు 1 శాతం మించకూడదు ఇతర పంట గింజలు 2 శాతం మించకూడదు ఇతర పదార్థాలు 1 శాతం మించకూడదు రంగు మారితే కొనలేం వర్షాలకు దెబ్బతిన్న, రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తాం. ఆ పరిధిని దాటి కొనుగోలు చేయడం కుదరదు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు నడుచుకుంటాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తుంది. – యాదిరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ వానలు పడుతున్నాయని కొనడం లేదు ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొన్నటివరకు మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. వానలు మొదలవడంతో కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. – నారెండ్ల రవీందర్‌రెడ్డి, దూలూరు, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. మా ఊరు నుంచి కేంద్రానికి తీసుకువచ్చినా వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యమంటూ, నిబంధనల ప్రకారం లేదంటూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. – సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నం ఐదెకరాలు కౌలు తీసుకుని మక్క పంట సాగు చేశాను. ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. అకాల వర్షాలకు మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నాం. – చిద్రపు లక్ష్మన్న, కౌలు రైతు, ఖాజపుర్, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంటాం..! అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్నను కొనడం సాధ్యం కాదని.. అలా కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని మార్క్‌ఫెడ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఆ మొక్కజొన్న దేనికీ పనికి రాదని, ఒకవేళ కొని నిల్వ చేసినా ఫంగస్ వస్తుందని అంటున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. -
మునిగిన పంటల్ని కాపాడుకోండిలా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు అక్కడక్కడా అపరాలకు నష్టం వాటిల్లినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీట మునిగిన పంటల్ని కాపాడుకునేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. నీట మునిగిన పంటల్ని 48 గంటల్లోగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. వరి రక్షణకు.. వరి చేలల్లో అధికంగా ఉన్న నీటిని తొలగించేందుకు బోదెలు తీయాలి. వర్షం తెరిపి ఇస్తే.. ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ పొటాష్ వేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సాకొనజోల్ లేదా వాలిడా మైసిన్ లేదా ప్రోపికొనజోల్ మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందు మార్చి చేనంతా తడిసేలా చల్లుకోవాలి. నారుమళ్లలో లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు, డైక్లోరోవాస్ ఒక మిల్లీలీటర్ కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు ఎసిఫేట్ ఒకటిన్నర గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమపోటు నివారణకు పైమెట్రోజైన్ 0.6 గ్రాము లేదా డైనోటేప్యూరాన్ 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను ఇథిప్రోల్‌తో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో సస్యరక్షణ భూమిలో అధికంగా తేమ ఉంటే అంతర సేద్యం ద్వారా తగ్గించాలి. ఎకరానికి 25, 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. ఫాల్ ఆర్మీ వార్మ్ తెగులు గమనిస్తే ఎకరానికి క్లోరాంట్రనిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్ 80 గ్రాములు లేదా లాంట్డా సైహలోత్రిన్ 200 మిల్లీలీటర్లను పిచికారీ చేయాలి. ఇతర పంటల రక్షణకు.. అపరాల పంటల్లో అధిక తేమ వల్ల నత్రజని అందకపోతే ఒక శాతం కేఎన్ఓ–3ని రెండుసార్లు చొప్పున 4, 5 రోజులు చల్లాలి. సూక్ష్మ పోషకాల లోపం నివారణకు జింక్ సల్ఫేట్, అన్నభేది వేయాలి. మరింత సమాచారం కోసం సమీపంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలను 155251 నంబర్లో లేదా ఆర్బీకేలలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు. పత్తిలో తెగులు నివారణకు.. పత్తి తోటల్లో తేమను తగ్గించడానికి అంతర సేద్యం చేయాలి. మొదట డీఏపీ లేదా యూరియా వేయాలి. పత్తి విత్తిన 30, 35 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. భూమిలో వచ్చే కుళ్లు తెగుళ్లు, బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను లేదా పౌశమైసిన్ లేదా ప్లాంటా మైసిన్‌ను పిచికారీ చేయాలి. పంట వేసి 90 రోజులైతే ఎకరాకు 30, 35 కిలోల యూరియా, 20, 25 కిలోల పొటాష్ వేయాలి. -
2.89 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు దాదాపు 2.89 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ మంగళవారం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. 8 జిల్లాల్లో 177 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. వరి, పత్తి, కంది, సోయా, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని తన నివేదికలో తెలిపింది. వ్యవసాయాధికారి సస్పెన్షన్ మంగళవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివిధ పంటలను పరిశీలించారు. కానీ అక్కడి మండల వ్యవసాయాధికారి రాజలింగం వర్షాలు కురిసిన ఈ వారం రోజులు విధుల్లో లేరని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి పోచారం వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాల్సిందిగా కమిషనర్ ప్రియదర్శినిని ఆదేశించారు. వర్షాలకు ఆరుగురి మృతి సోమవారం నుంచి మంగళవారం ఉద యం వరకు కురిసిన వర్షాలకు మెదక్ జిల్లా లో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్ద రు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. -
సీఎం కేసీఆర్‌ది సెంట్మెంట్ పాలన
♦ కాళేశ్వరం నీళ్లు తర్వాత.. ముందు పంట రుణాలు మాఫీ చేయి.. ♦ ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దే ♦ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ♦ యాచారంలో ఎండిపోయిన మొక్కజొన్న పంటల పరిశీలన యాచారం: తెలంగాణలో సీఎం కేసీఆర్ సెంట్మెంట్ పరిపాలన చేస్తున్నారని, మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి మండిపడ్డారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో కలిసి యాచారం, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు తెచ్చేది దేవుడెరుగు.. ముందు పూర్తిగా రుణమాఫీ చేసి రైతుల కాళ్లు కడిగి ఓట్లేసిన వారి రుణం తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తెచ్చి అప్పులపాలవుతున్నారన్నారు. తెలంగాణలో 37 లక్షల మంది రైతులు, మూడున్నర లక్షల మహిళా రైతులు రుణమాఫీ పూర్తి అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఒకేసారి రుణమాఫీ వర్తింపజేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇస్తానన్న రూ. ఆరు లక్షల పరిహారం కేవలం 230 మందికే ఇచ్చి చేతులుదులుపుకున్నారన్నారు. ఆలస్యంగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయిందని, అధికార యంత్రాంగం తక్షణమే సర్వే చేసి ఎండిపోయిన పంటకు ఎకరారు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి: క్యామ మల్లేష్ గతేడాది రైతులకు అందజేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీని తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ డిమాండ్ చేశారు. జిల్లాలోని వేలాది మంది రైతులకు రూ.80 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉందన్నారు. వరుసగా మూడేళ్లు జిల్లా తూర్పు డివిజన్లో వర్షాల్లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోరుబావులు ఎండిపోయి, కృష్ణాజలాలు సరిపడా సరఫరా కాక ప్రజలకు సైతం తాగునీరు అందని దుస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధికార ప్రతినిధి అన్వష్రెడ్డి, ఇబ్రహీంపట్నం డివిజన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కాలె మల్లేష్, ఇబ్రహీంపట్నం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడాల శంకర్‌గౌడ్, యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, నక్కర్తమేడిపల్లి, గడ్లమల్లయ్యగూడ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్, టీడీపీ మండల అధ్యక్షుడు గౌర మల్లేష్, నాయకులు లక్ష్మయ్యగౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.