Malaysia agent
-
అక్రమ నివాసులకు వరం
(వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల) :ఉపాధి కోసం మలేషియా వెళ్లి.. వివిధ కారణాలతో అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఆ దేశం గత నెలలో క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించింది. మలేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ జిల్లాలకు చెందినవలస జీవులకు ఊరట లభించింది. ఇబ్బందులు పడుతున్న వారంతా చట్టబద్ధంగా స్వస్థలాలకు చేరుకోవచ్చు. ఆమ్నెస్టీ గడువు డిసెంబరు 31 వరకు ఉంది. ఆమ్నెస్టీద్వారా స్వదేశాలకు వెళ్లే వారు మలేషియా రింగిట్స్ 700 (ఇండియన్ కరెన్సీలో రూ.12వేలు) చెల్లించాల్సి ఉంటుంది. విమాన టిక్కెట్లు స్వతహాగానే సమకూర్చుకోవాలి. మలేషియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 20వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అక్కడి ఫామాయిల్ తోటల్లో అనేక మంది పనిచేస్తున్నారు.నైపుణ్యం కలిగిన వారికి మెరుగైన జీతాలు ఉండగా.. అన్‌స్కిల్డ్ లేబర్‌కు 800 నుంచి 1200 రింగిట్స్ చెల్లిస్తారు. అయితే, ఎక్కువ జీతాల ఆశతో కంపెనీని వీడి బయటపనిచేస్తూ సుమారు 2వేల మంది అక్రమ నివాసులుగా మారినట్లు అంచనా. ఇందులో కొందరు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. వారంతా మలేషియా ప్రభుత్వంప్రకటించిన ఆమ్నెస్టీతో స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. వలస జీవులను ఆదుకుంటాం.. మలేషియాలోని జైళ్లలో మగ్గుతున్న వారిని, బయట చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) ద్వారా ఆదుకుంటాం. డిసెంబరు 31 వరకు ఆమ్నెస్టీ అమల్లో ఉంటుంది. దీనిని వినియోగించుకుంటే ఇబ్బందులు ఉండవు. మా సంస్థ ద్వారా తెలంగాణ ప్రాంత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. – తిరుపతి సైదం, మైటా అధ్యక్షుడు -
ఉద్యోగం ఆశచూపి.. అమ్మేయాలనుకున్నాడు..
మలేషియాలో చాక్లెట్ కంపెనీలో ఉద్యోగమని చెప్పి తన భార్యను అమ్మడానికి ప్రయత్నించారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివీ.. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారాయుడు, రమణమ్మలు భార్యాభర్తలు. వెంకట సుబ్బారాయుడు రైతు. వ్యవసాయం కలిసిరాక రూ.4.5 లక్షల వరకు అప్పు అయింది. దానిని తీర్చే దారి కానరాక సతమతమవుతున్నాడు. ఇదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఏజెంటు సుభాన్‌వలీ పరిచయమయ్యాడు. భార్యాభర్తలకు మలేషియా చాక్లెట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. నెలకు చెరో రూ.20వేలు చొప్పన వస్తుందని చెప్పడంతో వారు నిజమేననుకున్నారు. ఈ ఒప్పందం మేరకు మళ్లీ అప్పుచేసి ఆ ఏజెంటుకు రూ.1.20 లక్షలు చెల్లించగా గత నెల 16వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో మలేషియాకు పంపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత.. టూరిస్టు వీసా ఇచ్చి ఏజెంటు మలేషియాకు పంపినట్లు అక్కడి తెలుగు వారు తెలపటంతో మోసపోయినట్లు గ్రహించారు. అనంతరం వలి పరిచయం చేసిన అక్కడి ఏజెంటు కృష్ణ ఆ దంపతులను తనతోపాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. రమణమ్మను ఏజెంటు సుభాన్‌వలి తనకు రూ.60వేలకు అమ్మినట్లు కృష్ణ తెలిపాడు. అంతేకాకుండా రమణమ్మను పలురకాలుగా హింసించాడు. ఇది చూసి తట్టుకోలేక సుబ్బారాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. వీరు మాట వినేలా లేరని గ్రహించిన కృష్ణ వదిలిపెట్టాడు. దీంతో వారు బంధువుల సహకారంతో మరో రూ.35 వేలను కృష్ణకు చెల్లించి తిరిగి గత నెల 27వ తేదీన స్వగ్రామానికి చేరుకోగలిగారు. ఈ విషయమై గురువారం బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.