‘అనుసంధానిత భద్రత’పై పరీకర్-కార్టర్ చర్చ
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా ‘అనుసంధానిత భద్రత వ్యవస్థ నిర్మాణం’(నెట్వర్క్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్)పై భారత, అమెరికా రక్షణ మంత్రులు మనోహర్ పరీకర్, అష్టన్ కార్టర్ మధ్య శనివారం చర్చలు జరిగాయి. సింగపూర్లో ‘15వ షాంఘ్రి-లా డైలాగ్’ సందర్భంగా జరిగిన సమావేశంలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత-అమెరికా రక్షణ రంగంలో పరస్పర సహకారంతోపాటు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా వీరు చర్చించారు.
దీంతోపాటు భారత-అమెరికా మధ్య రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం గురించి, ఈ సంబంధాల్లో ఇంతవరకు జరిగిన అభివృద్ధిపై విస్తృతస్థాయి చర్చలు జరిగాయని వెల్లడించింది. జపాన్ రక్షణ మంత్రితోనూ కార్టర్ సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. మలేషియా రక్షణ మంత్రి హిషాముద్దీన్తో చర్చలు జరిపారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న సమస్యలకు అంతర్జాతీయ చట్టాల ద్వారా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.