సాధ్వీ ప్రజ్ఞాకు బెయిల్
ముంబై: 2008నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు మంగళ వారం బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాకు ప్రమేయమున్నట్లు ఎటువంటి సాక్ష్యాలు లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది.
సాధ్వీ రూ. 5 లక్షల పూచీకత్తు చెల్లించడంతో పాటు ఆమె పాస్‌పోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇదే కేసులో సహ నిందితుడు ప్రసాద్ పురోహిత్ చేసుకున్న బెయిల్ అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది. విచారణ నిమిత్తం సాధ్వీని జాతీయ దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడల్లా ఎన్ఐఏ ఎదుట హాజరుకావాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం సాధ్వీ కేన్సర్‌తో బాధపడుతుండ టంతో మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.