Malladi Venkata Krishnamurthy
-
మల్లాది వెంకట కృష్ణమూర్తి మెచ్చిన 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'
దిగ్గజ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గురించి తెలియని తెలుగు ప్రజలు, పాఠకులు ఉండరు. తన నవలలు, పుస్తకాలు, రచనలతో 55 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మల్లాది పుస్తకాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం తప్ప, ఆయన కనిపించింది - వినిపించింది లేదు. వేరే పుస్తకాల గురించి ఆయన చెప్పడం అరుదు. అటువంటి మల్లాది వెంకట కృష్ణమూర్తిని మెప్పించింది 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'కు ముందుమాట రాయడమే కాకుండా ఈ పుస్తకాన్ని అభినందిస్తూ మల్లాది వెంకట కృష్ణమూర్తి ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు. 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి మాట్లాడుతూ... ''ఇంగ్లీష్ సినిమాలు చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమాల గురించి చెప్పేంత విశిష్టమైనవి. కొన్ని మినహాయిస్తే... హిచ్‌కాక్ తీసినవి క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తన పేరును ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన ఫోటోలను, చతురోక్తులను బాగా ఉపయోగించుకున్నారు. 'నేను సిండ్రెల్లా సినిమా తీస్తే... ప్రేక్షకులు శవం కోసం ఎదురు చూస్తారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హిచ్‌కాక్. 'సైకో' విడుదలయ్యాక ఒక భర్త నుంచి వచ్చిన ఉత్తరాన్ని హిచ్‌కాక్ కు స్టూడియో హెడ్ అందించారు. 'సైకో' సినిమాలోని బాత్ టబ్ హత్య సన్నివేశం చూశాక తన భార్య స్నానం చేయడం మానేసిందని, ఏం చేయాలో చెప్పమని సలహా కోరతాడు భర్త. అందుకు హిచ్‌కాక్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? 'మీ ఆవిడను లాండ్రీకి పంపించండి' అని. సస్పెన్స్ గురించి హిచ్‌కాక్ చెప్పింది అక్షర సత్యం. ఆతృతగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుంది. సస్పెన్స్ మహిళ వంటిదని, ఊహకు ఎంత వదిలేస్తే అంత ఉత్కంఠ పెరుగుతుందని హిచ్‌కాక్ చెప్పారు. సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్ రూంకు వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలని చెప్పింది కూడా హిచ్‌కాక్. స్నేహితులు పులగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకంలో ఆయన తీసిన సినిమాల గురించి వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం తెలుగు వారికి హిచ్‌కాక్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. పులగం చిన్నారాయణ, రవి పాడి గార్లకు ఆ అభినందనలు. ఈ పుస్తకంలో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ ఫ్యాన్ అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని ఆడియోలో పేర్కొన్నారు.ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు భగవద్గీత, బైబిల్ వంటివి అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. ఇందులో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని హరీష్ శంకర్ అందుకున్నారు.#MalladiVenkataKrishnaMurthy garu is well known as a Senior Novelist with 55+ years of experience in literature. His books have inspired generations yet he kept his identity very private.For the first time, he gave his words of appreciation to our one-of-its-kind book "Master… pic.twitter.com/JhoY7RHZWc— Pulagam Chinnarayana (@PulagamOfficial) December 27, 2024 (చదవండి: వెయిటర్గానే ఉండిపోతానేమో అనుకున్నాడు...కట్ చేస్తే..!) -
సాహితీ ప్రయాణం వెనక కథ
నా మొదటి కథ 1970 ఆగస్టులో చందమామ మాసపత్రికలో ప్రచురించారు. దాని పేరు ఉపాయశీలి. 2020 ఆగస్టుకి నా మొదటి కథ ప్రచురించబడి యాభై ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా నా సాహితీ ప్రయాణం గురించి వివరించిన పుస్తకమే నవల వెనక కథ. ఇందులో నేను రాసిన 106 నవలల కథలు పరిచయం చేస్తూ, ప్రతీ నవలకి నాకు క్రియేటివ్ ఫ్లాష్, అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాను? ఎంత కాలానికి అది నవలగా రాశాను? ఏ పత్రికలో సీరియలైజ్ అయింది, లేక డైరెక్ట్ నవలా? సినిమా లేదా టీవీ సీరియల్ లేదా వెబ్ సిరీస్‌గా తీస్తే ఆ అనుభవాలు, అమ్మకాలు, కోర్టు కేసులు మొదలైన వివరాలన్నీ ఇందులో ఇచ్చాను. అలాగే ప్రతి నవలకి వేసిన తెలుగు, కన్నడ కవర్ పేజీల బొమ్మలని కూడా చూడొచ్చు. పాఠకులకి ఇవి పాత జ్ఞాపకాలను ఇస్తాయి. ‘ముక్తాయింపు’లో రచయితగా నా గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను రాశాను. ‘అనుబంధం’ అనే రెండో భాగంలో 1960లో నేను చదివిన మొదటి నవల నుంచి 2020 దాకా– ఈ అరవై ఏళ్లలో తెలుగు నవలకి పాఠకులిచ్చిన ఆదరణ, అమ్మకాల వివరాలని ‘లేచి పడ్డ తెలుగు నవల’ అనే పెద్ద వ్యాసంలో పాఠకులు విహంగవీక్షణం చేయొచ్చు. ఇంకా ఇందులో 1972 నుంచి నేటి దాకా నేను వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, నా ప్రచురణకర్తల మీద పెన్ స్కెచ్‌లు, (నా సంపాదకులతో నా అనుభవాల గురించి ‘జరిగిన కథ’ అనే పుస్తకంలో రాశాను) నేను రాసిన దిన వార పక్ష మాస పత్రికల జాబితా, సినిమాల పేర్లు, విడుదల వివరాలు, టీవీ సీరియల్స్ వివరాలు, నేను రాసిన వందకు పైగా నవలేతర పుస్తకాల క్లుప్త పరిచయం, వాటి కవర్ పేజీలు, స్రవంతి వారపత్రిక ఎడిటర్‌గా నా అనుభవాలు, తమాషా స్టాటిస్టిక్స్, చివరగా మే 2020లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మిస్టరీ మేగజైన్కి పంపిన ఓ ఇంగ్లిష్ క్రైమ్ కథని చదవొచ్చు . 760 పేజీల ఈ హార్డ్‌బౌండ్ పుస్తకం, తెలుగు నవలా పాఠకులకి, సాహిత్య అభిమానులకు చాలా కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈ యాభై ఏళ్లలో నేను చేసిన రచనా వ్యాసంగాన్ని నవల వెనక కథలో పరిపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. సెప్టెంబర్ 2020 దాకా రోజూ మరే పని పెట్టుకోకుండా, రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు రాస్తూ, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ, గడిపాను. మర్చిపోయినవి కొందరు మిత్రులకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఈ వారమే పుస్తకం విడుదల అవుతోంది. -మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల వెనక కథ రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పేజీలు: 760; వెల: 600; ప్రతులకు: గోదావరి ప్రచురణలు, ఫోన్: 9553084268 -
ఫ్రాస్ట్ బైట్
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 32 పక్కింటివాళ్లు పోలీసులకి ఫోన్ చేసి జూలీ బాత్రూం కిటికీలోంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశారు. పోలీసులకి జూలీ శవం... నీళ్లు నిండిన బాత్ టబ్‌లో కనిపించింది. రక్తం కలిసి నీరంతా ఎర్రగా అయ్యింది. డాక్టర్ శవాన్ని పరిశీలించి... ‘‘తలకైన గాయం వల్ల స్పృహ తప్పి ఉంటుంది. తర్వాత తొట్టిలో పడి నీళ్లల్లో మునిగి మరణించింది. పోస్ట్‌మార్టంలో ఆ విషయం నిర్ధారణ కావచ్చు’’ అన్నాడు. ‘‘మరణించి ఎంత కాలం అయ్యింది?’’... లెఫ్టినెంట్ ఫ్రాంక్ ప్రశ్నించాడు. ‘‘బహుశ క్రితం ఆదివారం మరణించి ఉండొచ్చు. లేదా శనివారం. ఆమె ఇటీవల మంచుపడే ప్రాంతానికి వెళ్లి వచ్చిందనుకుంటున్నాను.’’ ‘‘ఎలా చెప్పగలరు?’’ ‘‘తన కాళ్లు, చేతులకి ఫ్రాస్ట్‌బైట్ (మంచు కొరకడం) గుర్తులున్నాయి.’’ శవాన్ని మార్చురీకి తరలించాక ఫ్రాంక్, అతని సహాయకుడు చుట్టుపక్కల వారిని జూలీ గురించి ప్రశ్నించారు. ‘‘ఆమె బాగా ధనవంతురాలు. ఏడాదిన్నర క్రితం నీల్‌తో పెళ్లయింది. ఆమెని డబ్బుకోసం చేసుకుని ఉంటాడు. ఎందుకంటే జూలీ కురూపి’’ పక్కింటి అతను చెప్పాడు. ‘‘గత రెండు వారాలుగా జూలీ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లలేదు’’ ఎదురింటివారు చెప్పారు.‘‘ఈ ఊళ్లో మంచు పడదు. మరి ఫ్రాస్ట్‌బైట్ ఎలా వచ్చింది?’’... ఫ్రాంక్ ప్రశ్నించాడు. ‘‘ఏమో మరి?’’ అన్నారు. నీల్ నాలుగు రోజుల క్రితం గోల్ఫ్ ఆడటానికి కాలిఫోర్నియాకి వెళ్లాడని కూడా జూలీ మిత్రుల ద్వారా ఫ్రాంక్‌కి తెలిసింది.మర్నాడు జూలీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందింది. తలకైన గాయం వల్ల స్పృహ తప్పింది. నీళ్లల్లో మునిగి మరణించింది. శనివారం మధ్యాహ్నం రెండున్నర నుంచి ఆరున్నర మధ్య మరణం సంభవించిందని డాక్టర్ నిర్ధారించాడు. మర్నాడు టీవీ న్యూస్ ద్వారా భార్య మరణం గురించి తెలుసుకున్న నీల్ ఫీనిక్స్‌కి తిరిగి వచ్చాడు. అప్పటికే పోలీసులు వారి ఇంట్లో అన్ని గదుల్లోని వేలిముద్రలూ తీసుకున్నారు. ఏ భార్య మరణించినా పోలీసుల అనుమానం మొదట భర్త మీదకే వెళ్తుంది. శనివారం అతను ఎక్కడ ఉన్నాడో ఎలిబీని పరిశీలించారు. ఆ ఉదయం ఆరున్నరకి అతను కార్లో కాలిఫోర్నియాకి బయలు దేరాడని దారిలో అతను కొన్న పెట్రోల్ బిల్స్‌ని బట్టి తెలిసింది. పెట్రోల్ బంక్స్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తే అతను చెప్పింది నిజమని తెలిసింది. శనివారం మధ్యాహ్నం రెండున్నరకి హత్య జరిగిన ప్రదేశానికి మూడు వందల ఏభై మైళ్ల దూరంలో ఉన్నాడు. దారిలో రెండు చోట్ల ఆగి కాఫీ తాగాడు. ఓ చోట లంచ్ తిన్నాడు. రెస్టారెంట్స్లోని సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ నీల్ కనిపించాడు. పోలీసుల విచారణలో జూలీకి శత్రువులు లేరని తెలిసింది. దొంగలు వచ్చారేమో అనే థియరీ కూడా నిలబడ లేదు. ఇంటి తలుపులన్నీ మూసి లోపల నించి బోల్ట్‌లు పెట్టి ఉన్నాయి. కిటికీ తలుపులు కూడా వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. పైగా వస్తువులేం పోలేదని నీల్ చెప్పాడు. శవం నీళ్ల టబ్‌లో తేలుతోంది. దొంగ వచ్చి చంపే అవకాశం లేదు. అయితే పోస్ట్‌మార్టంలో తను ఎర్ర ఇంకుతో అండర్లైన్ చేసిన ఓ వాక్యం మాత్రం లెఫ్టినెంట్ ఫ్రాంక్‌ని బాధించ సాగింది... ఫ్రాస్ట్‌బైట్ కనిపించడం. అసలు మంచు ప్రాంతాలకి వెళ్లని జూలీకి ఆ ఫ్రాస్ట్‌బైట్ ఎలా ఏర్పడింది? ‘‘ఫ్రాస్ట్‌బైట్ మంచు వల్ల కాక మరే విధంగానైనా కలిగే అవకాశం ఉందా?’’ డాక్టర్ని అడిగాడు ఫ్రాంక్. ‘‘లేదు. ఆమె శరీరం మంచులో ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అవడం వల్లే కలిగింది’’ డాక్టర్ చెప్పాడు. ‘‘ఎడారి మధ్య ఉన్న ఫీనిక్స్‌లో మంచు ఎక్కడ నించి వచ్చింది?’’... డాక్టర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు. నీల్ సెల్‌ఫోన్ కాల్స్‌ని ఫ్రాంక్ పరిశీలించాడు. జూలీ మరణానికి నెల ముందు నుంచీ ఎలాంటి అనుమానం కలిగించే కాల్స్ వెళ్లలేదు. అతని క్రెడిట్ కార్డ్ అకౌంట్లోని వివరాలని కూడా పరిశీలించాడు. వాటిలో కూడా అనుమానించేవి ఏవీ కనపడలేదు. మిత్రులని ప్రశ్నించాడు. ఎలాంటి కొత్త సమాచారం తెలీలేదు. కానీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఫ్రాంక్‌తో డాక్టర్ చెప్పాడు... ‘‘జూలీ కేసులో నాకో అనుమానం స్ఫురించింది. భర్త హంతకుడు కావొచ్చు.’’ ‘‘ఎలా చెప్పగలరు?’’ ఎలాగో ఆయన వివరించాడు. ‘‘థ్యాంక్స్ డాక్టర్. హంతకుడ్ని వెదకడానికి నాకో దారిని చూపించారు’’ అన్నాడు ఫ్రాంక్. ‘‘నీల్! నీ భార్యని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను’’... ఫ్రాంక్ ఆ రాత్రి నీల్ పేకాడే క్లబ్‌కి వెళ్లి పక్కకి పిలిచి చెప్పాడు. ‘‘మీకు పిచ్చా?’’ నీల్ నివ్వెరపోతూ అడిగాడు. ‘‘తగిన ఋజువులతోనే వచ్చాను.’’ ‘‘ఏంటా ఋజువులు?’’ నీల్ ప్రశ్నించాడు. ‘‘నీ భార్య మరణించినప్పుడు నీకు ఎలిబీ లేదు. శుక్రవారం మధ్యాహ్నం ఎక్కడున్నావు?’’ ‘‘హత్య జరిగింది శనివారం మధ్యాహ్నం.’’ ‘‘అలా అనుకోవాలనే నువ్వు ఆడిన నాటకం బయటపడింది.’’ ‘‘నాటకమా?’’ తడబడ్డాడు. ‘‘అవును. శుక్రవారం మధ్యాహ్నం నువ్వు నీ భార్య తలని పంపుకి కొట్టి, స్పృహ తప్పిన ఆమెని బాత్‌టబ్‌లోకి తోశావు. పది నిమిషాల తర్వాత మళ్లీ వెళ్లి ఆమె మరణించిందా లేదా అని తనిఖీ చేసి ఉంటావు. తర్వాత శవాన్ని చల్లగా ఉంచడానికి ఐస్‌ని బాత్‌టబ్‌లో నింపావు. నువ్వు శనివారం ఉదయం ఇంటి నించి బయలుదేరేదాకా ఆ టబ్‌లో ఐస్‌ని నింపు తూనే ఉన్నావు. తద్వారా జూలీ తర్వాత మరణించిందని పోలీస్ డాక్టర్ని తప్పుదోవ పట్టించడంలో సఫలం చెందావు. నువ్వు ఇల్లు వదిలాక జూలీ మరణించిందనే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వల్ల నీకు ఎలిబీ ఉంటుంది.’’ ‘‘అది అబద్ధం.’’ ‘‘నువ్వు వాల్‌మార్ట్‌లో ఐస్ బ్యాగ్స్‌ని కొనే సీసీ టీవీ ఫుటేజ్‌ని మావాళ్లు సంపాదించారు. శుక్రవారం ఉదయం పదకొండూ నలభై రెండు నించి ఆరుసార్లు ఎందుకు ఐస్ కొన్నట్లు?’’‘‘మీకా అనుమానం ఎలా వచ్చింది?’’ పాలిపోయిన మొహంతో నీల్ అడిగాడు. ‘‘ఫ్రాస్ట్‌బైట్ గురించి నీకు తెలీదు కనుక.’’ ఫ్రాంక్ అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించాడు. (మేక్సైన్ ఓ కలన్ కథకి స్వేచ్ఛానువాదం) -
శ్రీమతి దొంగగారు!
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 31 మార్గరెట్ తన నలభై మూడో ఏట విజయవంతంగా ఓ నేరాన్ని చేసింది. ఐతే దాన్ని ఆమె నేరంగా భావించలేదు. నిస్సారమైన తన జీవితంలో దాన్ని మసాలాగా భావించింది. తనకి అవసరం లేకపోయినా పన్నెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్స్ విలువ చేసే ఓ వెండి కడియాన్ని హ్యాన్సెన్స్ డిపార్ట్మెంటల్ స్టోర్‌లోంచి దొంగిలించింది. ఆ రాత్రి ఆమె సన్నగా కూనిరాగం తీస్తూ వంట చేసింది. తన భర్త జార్జ్‌కి దొంగతనం గురించి చెప్పలేదు. ఆ తర్వాత మరో మూడుసార్లు మార్గరెట్ ఆ డిపార్ట్మెంటల్ స్టోర్‌లోంచి బ్యాగ్‌లో పట్టే చిన్న చిన్న వస్తువులని దొంగిలించింది. ఖరీదైన ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ సీసా, లేడీస్ స్కార్ఫ్, హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకునే అద్దం... తన జీవితంలోకి సారం, మసాలా తిరిగి ప్రవేశించాయని ఆమెకి అనిపించింది. ‘‘ఒన్ మూమెంట్ మేడం’’ మార్గరెట్ వెనక్కి తిరిగి చూసింది.‘‘మీరోసారి మా స్టోర్‌లోకి రావాలి.’’ఆమె అతన్ని అనుసరించి మేనేజర్ అనే బోర్డున్న గదిలోకి వెళ్లింది. ‘‘మిస్టర్ కేజిల్! ఈమె హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బు చెల్లించని లేడీస్ ఈవెనింగ్ గ్లవ్స్ ఉన్నాయి’’ మార్గరెట్‌ని ఆపినతను చెప్పాడు.‘‘అలాగా? దయచేసి మీ హ్యాండ్ బ్యాగ్ తెరుస్తారా?’’ కేజిల్ అడిగాడు. మార్గరెట్ వెన్నులోంచి వణుకు పుట్టింది.‘‘ఆ అవసరం లేదు. నా హ్యాండ్ బ్యాగ్‌లో డబ్బు చెల్లించనివి ఏమీ లేవు. ఇతను పొరపడ్డాడు’’ బింకంగా చెప్పింది.‘‘ఐతే పోలీసులే మిమ్మల్ని ఆ హ్యాండ్ బ్యాగ్‌ని తెరవమని కోరాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు దాన్ని తెరవక తప్పదు’’ కేజిల్ రిసీవర్ మీద చేతిని వేసి చెప్పాడు.పోలీస్, కటకటాలు ఆమె కళ్ల ముందు మెదిలాయి. వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి గ్లవ్స్‌ని బయటికి తీసి టేబిల్ మీద పెట్టి చెప్పింది.‘‘పొరపాటున వీటిని హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకున్నాను. సారీ.’’ ‘‘మీ పేరు?’’‘‘మిసెస్ జార్జ్.’’ ‘‘ఇతను మా స్టాల్ డిటెక్టివ్ బరండీ. మిమ్మల్ని కొద్దిరోజులుగా కనిపెడు తున్నాడు’’... పేరు రాసుకుని చెప్పాడు.ఆమె బరండీ వంక ఓరగా చూసింది. ‘‘మీరు బీదవారు కాదని మీ దుస్తుల్ని, బూట్లని బట్టి తెలుస్తోంది. కాని షాపులో దొంగతనం నేరం. ఈ రకం నేరం వల్ల దేశంలోని వ్యాపారస్థులు కోట్ల డాలర్లు నష్టపోతున్నారు. ఇక్కడ హ్యాన్సెన్స్లో మేము మీలాంటి నేరస్థులని ప్రాసిక్యూట్ చేయడానికి ఇష్టపడం. కాని నష్టాన్ని భరించుతూ కూడా పోలేం. దయచేసి మీ భర్తకి ఫోన్ చేస్తారా?’’కొద్దిగా సందేహించి, తర్వాత రిసీవర్ అందుకుని భర్తకి ఫోన్ చేసి చెప్పింది మార్గరెట్.‘‘హ్యాన్సెన్స్ నించి. నన్ను ఇక్కడ దొంగతనం నేరం మీద పట్టుకున్నారు’’... జరిగింది వివరించింది. భార్య చెప్పేది అతను నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత చెప్పాడు. ‘‘నేను అక్కడికి వస్తున్నానని మిస్టర్ కేజిల్తో చెప్పు. వుగంటలో.’’‘‘పోలీసులకి ఫిర్యాదు చేశారా?’’ పావుగంట తర్వాత జార్జ్ అడిగాడు.‘‘ఇంకా లేదు.’’ ‘‘ఇది నమ్మశక్యం కాని విషయం. మా ఆవిడ దొంగ కాదు. ఆమెకా ఖర్మ పట్ట లేదు. ఇలాంటి లక్ష గ్లవ్స్ కొనేంత డబ్బు మాకుంది’’ జార్జ్ గట్టిగా చెప్పాడు.‘‘మేం అంగీకరించం. కనీసం నాలుగుసార్లు మీ ఆవిడ తచ్చాడిన ప్రదేశాల్లోని సరుకు మాయం అయింది. ఐదోసారి కాపేసి పట్టుకున్నాం’’ అతనూ అంతే గట్టిగా చెప్పాడు.‘‘మీరు చెప్పేది నిజమేనా?’’ జార్జ్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘సరే. మీకు జరి గిన నష్టాన్ని నేను పూడుస్తాను. పోయిన మొత్తం సరుకు ఖరీదు చెల్లిస్తాను.’’మేనేజర్ ఆలోచించి చెప్పాడు. ‘‘సరే! కానీ మీ ఆవిడ మళ్లీ మా షాపు ఆవరణ లోకి రానని హామీపత్రం రాసివ్వాలి.’’‘‘రాదని నేను మీకు హామీ ఇస్తున్నాను మిస్టర్ కేజిల్. మీ నష్టాల మొత్తం ఎంతో చెప్తే రేపు ఉదయం నేను చెక్ రాసిస్తాను. దాన్ని నా వెంట తేలేదు.’’ ‘‘మీరు ఎక్కడ పని చేస్తారు?’’ వెంటనే జార్జ్ తన విజిటింగ్ కార్డ్‌ని ఇచ్చాడు. అతనో పెద్ద బ్యాంక్‌లో రీజనల్ మేనేజర్. అది తమకి అకౌంట్ ఉన్న బ్యాంకే కావడంతో కేజిల్ సంతృప్తి చెందాడు. ‘‘సరే. కాని దయచేసి చెక్ తేవడం ఆలస్యం చేయకండి’’ అన్నాడు.అప్పటికప్పుడు బరండీ బిల్‌ని తయారు చేయించి తెచ్చాడు. మొత్తం అరవై నాలుగు డాలర్ల డెబ్భై ఒక్క సెంట్లు.‘‘ఇంత చిన్న మొత్తం దొంగతనమా? నమ్మలేను’’ దాన్ని జేబులో ఉంచుకుంటూ జార్జ్ గొణిగాడు. కారులో ఇంటికెళ్తూ తన భార్యని అడిగాడు. ‘‘నువ్వెందుకు దొంగవయ్యావు? నా పొజిషన్ గురించి ఆలోచించలేదా? ఇది పేపర్లోకి ఎక్కితే నా పరువు, నా ఉద్యోగం ఏం కాను?’’ ఆపదలోంచి బయటపడ్డ మిసెస్ జార్జ్ చిరాకుగా చెప్పింది. ‘‘నా గురించి కూడా మీరు ఆలోచించాలి. ఉదయం లేచి బ్రేక్ ఫాస్ట్ తిని బ్యాంక్‌కి వెళ్లేలోగా మీరు నాతో మాట్లాడేది నాలుగు ముక్కలు. రాత్రి ఆలస్యంగా వస్తారు. అలసిపోయి నిద్రపోతారు. శని ఆదివారాలు గోల్ఫ్ ఆడటానికి వెళ్తారు. ఇక మన మధ్య ఎగ్జయిటింగ్‌గా ఏం జరుగుతోంది? స్పయిస్ కోల్పోతున్నాను.’’‘‘స్పయిస్? అంటే?’’ జార్జ్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘షాప్‌లో పట్టుబడకుండా దొంగిలించి బయటకి రావడం స్పయిస్’’... సూటిగా చెప్పింది.‘‘షాప్‌లో దొంగతనం స్పయిసా?’’ఆ రాత్రి ఇద్దరూ చెరొక పడక గదిలో పడుకున్నారు. మర్నాడు ఉదయం జార్జ్ హ్యాన్సెన్స్ సూపర్ బజార్వాళ్లు ఇచ్చిన బిల్‌ని చూసి, ఆ మొత్తానికి చెక్ రాసి, బ్యాంక్‌కి వెళ్తూ దారిలో ఆగి కేజిల్‌కి దాన్ని ఇచ్చి రసీదు తీసుకున్నాడు. బయటికి వస్తూ ఆ షాపు వైపు చూశాడు జార్జ. ఆ దుకాణం చాలా రద్దీగా ఉంది. కౌంటర్ టాప్ మీద చాలా సరుకు ఆకర్షణీయంగా అమర్చి ఉంది. వాటిని చూసి తన భార్య... వ్యామోహంలో పడటంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాడు.‘ఎగ్జయిట్మెంట్, స్పయిస్’ అని భార్య ఉపయోగించిన పదాలు గుర్తుకు వచ్చాయి. ఆ సరుకు చూశాక అతనికి కొద్దిగా అర్థం అయినట్లు అనిపించింది. ఆ రాత్రి భార్య చెప్పిన విషయాలని ఆలోచించాడు. ఆ మాటల్లోనూ కొంత నిజం ఉందనిపించింది. మర్నాడు సాయంత్రం జార్జ ఇంటికి వచ్చేసరికి మార్గరెట్ బ్రిడ్జ్ క్లబ్‌కి వెళ్లింది. ఒంటరిగా ఉన్న జార్జ్ ఈవెనింగ్ పేపర్ని తెరిచాడు. కాని దాని మీద మనసుని కేంద్రీకరించలేకపోయాడు. ఏ వయసులో ఐనా సరే... ఎవరూ ఎగ్జయిట్‌మెంట్‌కి, స్పయిస్కి దూరం కాకూడదు. జార్జ్ టీపాయ్ మీద ఉన్న ప్యాకెట్లో నుంచి ఓ సిగరెట్‌ను తీసి నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత జేబులోంచి సిగరెట్ లైటర్ని తీశారు. ఓసారి దాని వంక తేరిపార చూశాడు. ఆ సరికొత్త సిల్వర్ ప్లేటెడ్ లైటర్ బరువుగా ఉంది. దాన్ని వెలిగించి సిగరెట్ అంటించుకుని లైటర్ని టేబిల్ మీద ఉంచాడు. తను కోల్పోయిన, తన భార్య ఆరోపించిన ఎగ్జయిట్మెంట్, స్పయిస్ తను కొన్ని గంటల క్రితం హ్యాన్సెన్స్లో పొందానని అతనికి అనిపించింది. ఐతే తన భార్యలా తను ఎన్నడూ పట్టుబడడు అనే ధీమా అతనిలో ఉంది. (కెరోల్ మేయర్స్ కథకి స్వేచ్ఛానువాదం) ‘‘పోలీసులకి ఫిర్యాదు చేశారా?’’ పావుగంట తర్వాత జార్జ్ అడిగాడు. ‘‘ఇంకా లేదు.’’ ‘‘ఇది నమ్మశక్యం కాని విషయం. మా ఆవిడ దొంగ కాదు. ఆమెకా ఖర్మ పట్ట లేదు. ఇలాంటి లక్ష గ్లవ్స్ కొనేంత డబ్బు మాకుంది’’ జార్జ్ గట్టిగా చెప్పాడు. -
రచయిత
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 9 కెనడా నించి అక్రమంగా వచ్చే మద్యాన్ని తీసుకోడానికి నేను, మరో ఇద్దరం సముద్రతీరంలోని సొనోమా కౌంటిలో గల బ్రింగిల్స్ కోవ్‌కి బయలుదేరాం. ఏంజెలో, బెన్నీ, నేను కోళ్లని సరఫరా చేేన లారీలో అక్కడికి చేరుకున్నాం. ఐదు నిమిషాల తర్వాత మా వెనకే ఇంకో పెద్దలారీ వచ్చి ఆగింది. ఉదయం ఐదు కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేదు.బ్రింగిల్స్ కోవ్ స్మగ్లింగ్‌కి సరైన ప్రదేశం. ఎఫ్‌బీఐ ఏజెంట్లు దాక్కోడానికి చెట్లులాంటివేం లేవు. పడవలకి ప్రమాదం కలిగించే రాళ్లేమీ సముద్ర తీరంలోని నీళ్లల్లో లేవు. మేం 1927 నుంచి, అంటే ఏడాది నుంచి ఆ ప్రదేశాన్ని అమెరికాలోకి మద్యాన్ని స్మగుల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఇంతదాకా ఇక్కడ మాకు ఎలాంటి సమస్యా రాలేదు.ఏంజెలో దగ్గర ‘థాంసన్ గన్’ ఉంది. నా దగ్గర, బెన్నీ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. సీట్ కింద గల డబ్బు సంచిని నేను తప్ప ఇంకెవరూ తాకకూడదన్నది నియమం. ఏంజెలో, బెన్నీలతో కలసి పని చేయడం నాకు ఇదే మొదటిసారి. స్మగ్లింగ్‌లో బెన్నీకి ఇదే మొదటి అనుభవం కాబట్టి అతను చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాడు. మా అందరి సగటు వయసు ఇరవై నాలుగు. రేంజో దగ్గర బెన్నీ ఐదు నెలలుగా పని చేస్తున్నాడు. అతని మీద నమ్మకం కుదిరాక రేంజో అతన్ని నాతో పంపాడు. ‘‘రెండు వందల కేసులు కదా వచ్చేది?’’ బెన్నీ నన్ను అడిగాడు. ‘‘ఇది నువ్వు అడగటం మూడోసారి’’ చిరాగ్గా చెప్పాను. ‘‘ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ స్కాచ్ బాటిల్ కేసులు ఇరవై వస్తున్నాయి’’ ఏంజెలో నవ్వుతూ చెప్పాడు. ‘‘ఓ బాటిల్‌ని మనం తీసుకోవచ్చా?’’ బెన్నీ ఆశగా అడిగాడు. ‘‘అలాంటి ఆలోచనే వద్దు. రేంజో ఓ డాలర్ కోసం మోసం చేసినవాళ్లని కూడా చంపించాడు’’ హెచ్చరికగా చెప్పాను. కాసేపాగి బెన్నీ అడిగాడు. ‘‘కోస్ట్‌గార్డ్‌లతో ప్రమాదం ఉండదుగా?’’ ‘‘కోస్ట్‌గార్డ్‌లు లేదా ఎఫ్‌బీఐ ఏజెంట్లతో సదా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’’ జవాబు చెప్పాను. ‘‘అప్పుడు కొంత యాక్షన్ ఉంటుంది’’ బెన్నీ తన థాంసన్ తుపాకీని నిమురుతూ చెప్పాడు. ‘‘నిజంగా వాళ్లొస్తే తుపాకీ పేలుళ్లకి నీ పేంటు తడిసి తీరుతుంది’’ ఏంజెలో నవ్వుతూ చెప్పాడు. ‘‘నువ్వు ఎన్నడైనా తుపాకీతో మనిషిని కాల్చావా?’’ బెన్నీని ప్రశ్నించాను. ‘‘లేదు. ఇంతదాకా టార్గెట్ ప్రాకీే్టన. కానీ, ఎఫ్‌బీఐ ఏజెంట్లని, కోస్ట్గార్డులని పేల్చగలను’’ ‘‘చూద్దాం. మనిషిని మొదటిసారి చంపడం తేలిక కాదు’’ ఏంజెలో మళ్లీ నవ్వుతూ చెప్పాడు. కాసేపు మా మధ్య నిశ్శబ్దం. నేను బైనాక్యులర్స్‌లోంచి సముద్రాన్ని నిశితంగా పరిశీలించాను. ఎక్కడా మర పడవ కనపడలేదు. ఆకస్మాత్తుగా బెన్నీ అడిగాడు. ‘‘మీలో ఎవరైనా లిటిల్ సీజర్ని చదివారా?’’ ‘‘లిటిల్ వాట్?’’ అడిగాను. ‘‘లిటిల్ సీజర్.’’ ‘‘ఎప్పుడూ వినను కూడా లేదు’’ ఏంజెలో చెప్పాడు. ‘‘చికాగో మాఫియా బాన్ రికో బండెల్లో గురించిన నవల అది. అతను చివర్లో కాల్చి చంపబడతాడు’’ ‘‘అలాంటప్పుడు దాన్ని చదవడం దేనికి?’’ ఏంజెలో విసుగ్గా అడిగాడు. ‘‘ది మాలెే్టన ఫాల్కన్? అదింకో యాక్షన్ నవల.’’ ‘‘లేదు’’ ఇద్దరం చెప్పాం. ‘‘దాన్నెవరు రాసారో తెలుసా? డేషియెల్ హేమెట్. అతను శాన్ఫ్రాన్సిస్కోలో నివసిస్తాడు. ఎల్లీ స్ట్రీట్‌లోని జాన్స్ గ్రిల్లో అతన్ని చూశాను. అతను బ్లాక్ మాస్క్ అనే పత్రికలో దాన్ని ముందు సీరియల్‌గా రాశాడు. ఇంకా రెడ్ హార్వెస్ట్, ది డెయిన్కర్స్ అనే నవలల్ని, కొన్ని చిన్న కథలని కూడా రాశాడు. అవన్నీ చదివాను.’’‘‘దేని గురించి రాస్తాడు?’’ ఏంజెలో ఆసక్తిగా అడిగాడు.‘‘మాబ్‌ల మధ్య యుద్ధాలు, మోసం చేేన అందగత్తెలు. కొంతకాలం అతను ప్రైవేట్ డిటెక్టివ్‌గా పనిచేశాడు కాబట్టి అతను అనుభవంలోంచే రాస్తూంటాడు.’’ ‘‘ఇంకా ప్రైవేట్ డిటెక్టివ్‌గానే పని చేస్తున్నాడా?’’ నేను ప్రశ్నించాను. ‘‘ఉహు. రాయడానికి ఆ వృత్తిని వదిలేసాడు. జోయీ! నువ్వు తప్పక అతని పుస్తకాల్లో ఒకటి చదవాలి’’ బెన్నీ ఆసక్తిగా చెప్పాడు.‘‘నాకు పుస్తకాలు చదివేంత సమయం ఉండదు. నువ్వు పుస్తకాలు ఎక్కువగా చదువుతూంటావా?’’ అడిగాను. ‘‘బాగా. బ్లాక్ మాస్క్ మేగజైన్లో ఇంకా ఫ్రెడరిక్ నెబెల్, కెరొల్ జాన్ డాలి, రావుల్ విట్ఫీల్డ్ కథలు కూడా బావుంటాయి. హేమెట్ రాేన లాంటివే వాళ్లూ రాస్తారు. నేను కూడా బ్లాక్ మాస్క్ పత్రికకి కథలు రాస్తూంటాను. నేను ఇప్పుడు ఓ మంచి నవలని రాస్తున్నాను’’ బెన్నీ గర్వంగా చెప్పాడు. ‘‘దేని గురించి?’’ ఏంజెలో ఆసక్తిగా అడిగాడు. ‘‘మద్యం స్మగ్లింగ్ గురించి. లిటిల్ సీజర్, ది మాలెే్టన ఫాల్కెనో లాంటిది. కాని వాటికన్నా ఆసక్తి కలిగించేది’’ బెన్నీ గర్వంగా చెప్పాడు.‘‘అందులోని పాత్రలు నీకు ఎలా పరిచయం?’’ అడిగాను.‘‘మనమే ఆ పాత్రలం. రేంజో, నేను, ఏంజెలో, నువ్వు. కాని మన పేర్లు ఉండవు. వాటిని మార్చేస్తాను. మిగిలిన వారంతా స్మగ్లింగ్ పద్ధతి ఎలా ఉంటుందో ఊహించి రాస్తారు. పాఠకులకి తొలిసారిగా నా అనుభవం ద్వారా తెలియచేస్తాను. పుస్తకం చివర్లో మనం రిపో బెండెలోలాగా కాల్చి చంపబడం. తెలివిగా తప్పించుకుంటాం.’’ ‘‘దాని పేరు?’’ ‘‘రవాణా. స్మగ్లింగ్ సబ్జెక్ట్‌కి అంతకన్నా మంచి పేరు దొరకదు. బ్రింగిల్స్ కోవ్ అని పెడదామనుకున్నాను. ఇంకా నిర్ణయించలేదు.’’ఇంకా కొద్దినిమిషాల్లో సూర్యోదయం అవుతుందనగా మర పడవ వచ్చింది. నేను దాని కెప్టెన్‌కి డబ్బు చూపించాను. అతను, అతని ఇద్దరు సహాయకులు, మేము కలసి మద్యం కేసులు అన్నిటినీ దింపి మా లారీల్లోకి ఎక్కించాం. డబ్బు తీసుకుని అతను తిరిగి కెనడాకి, మేం శాన్‌ఫ్రాన్సిస్కోకి బయలుదేరాం. ‘‘కెప్టెన్‌ని అడిగి తెలుసుకున్నాను. నూట పది అడుగుల పొడవుగల అతని పడవ అరవై టన్నుల మద్యాన్ని తీసుకురాగలదట. ఇలాంటి వివరాలు నా నవల్లో రాస్తే రియలిస్టిక్‌గా ఉంటుంది’’ బెన్నీ ఉత్సాహంగా చెప్పాడు. ‘‘ఏం సమస్యా రాలేదుగా?’’ రేంజో గోడౌన్‌లోని మద్యం సీసాలని లెక్క చూసుకున్నాక నన్ను అడిగాడు. ‘‘ఓ సమస్య’’ దాన్ని వివరించాను. అతను తల ఊపి చెప్పాడు. ‘‘అవును సమస్యే. నువ్వు దాన్ని పరిష్కరించగలవుగా?’’ తల ఊపాను. ‘‘వెంటనే బహుమతిగా ఓ స్కాచ్ సీసా తీసుకో’’ ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి ఏంజెలో, నేను బెన్నీ అపార్ట్మెంట్కి వెళ్లాం. ‘‘మనం బ్రిస్బేన్‌కి వెళ్లాలి. వస్తావా?’’ అడిగాను. అరగంట తర్వాత మా కారు అడవి పక్కనగల మట్టి రోడ్డులో ముందుకి సాగింది. కారుని ఆపాను. అంతా దిగి హెడ్లైట్ల వెలుగులోకి వచ్చాం. నా చేతిలోని తనకి గురిపెట్టబడ్డ రివాల్వర్ని చూసి బెన్నీ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఇదేమిటి?’’ ‘‘నువ్వు రాసిన నవల ద్వారా బ్రింగిల్స్ కోవ్ పేరు కాని, స్మగ్లింగ్‌కి చెందిన ఇతర రహస్యాలు కాని బయటికి రాకూడదని రేంజో ఆజ్ఞ.’’ ‘‘కాని నేను చెప్పేది విను...’’ కంగారుగా చెప్పాడు. రెండు సార్లు కాల్చాను. అతను ఇంకా జీవించి ఉండొచ్చని మూడో గుండుని అతని తల్లోకి కాల్చాను. తాళంచెవిని బెన్నీ జేబులోంచి తీసుకున్నాను. అక్కడ నుంచి సరాసరి ఫెల్ స్ట్రీట్‌లోని బెన్నీ అపార్ట్మెంట్కి నేను, ఏంజెలో చేరుకున్నాం. అతని అపార్ట్మెంట్ మొత్తం వెతికినా కొన్ని బ్లాక్ మాస్క్ పత్రికలు తప్ప ఎక్కడా అతను రాేన ‘రవాణా’ కాగితాల ప్రతి కనపడలేదు. అసలు తెల్ల కాగితాలే లేవు. అతనికి టైప్ రైటర్ కూడా లేదు.‘‘అతను అబద్ధం ఆడాడు. మనతో చెప్పినట్లు ఒక్క అక్షరం కూడా రాయలేదు’’ చెప్పాను. ‘‘గొప్పలు చెప్పి పాపం ప్రాణాలు కోల్పోయాడు’’ ఏంజెలో జాలిగా చెప్పాడు. (బిల్ ప్రోంజినీ కథకి స్వేచ్ఛానువాదం) -
బంగారు ఆకుల చెట్టు
పిల్లల కథ ఒకప్పుడు ఓ అడవిలో ఓ చెట్టు ఉండేది. దాని ఆకులు సన్నగా ముళ్ళుగా ఉండేవి. గాలికి ఊగే ఆకుపచ్చటి విశాలమైన ఆకులు గల చెట్లని చూసినప్పుడల్లా తనకి కూడా అలాంటి ఆకులు ఉంటే బావుండును అని ఆ చెట్టుకి అనిపించసాగింది. ‘నేనెంత దురదృష్టవంతురాలిని? పరమాత్మ నాకు బంగారు ఆకుల్ని ప్రసాదిస్తే ఎంత బావుండేది’ అని ఓ రోజు దుఃఖించింది. మర్నాడు చూస్తే దాని ముళ్ళ ఆకులన్నీ బంగారు ఆకులుగా మారి కనిపించాయి. అది చాలా సంతోషించి పరమాత్మకి తన కృతజ్ఞతలని తెలియచేసుకుంది. మిగిలిన చెట్ల ముందు గర్వంగా కూడా ఫీలైంది. కాని రాత్రి ఓ లోభి వచ్చి దాని బంగారు ఆకులన్నిటినీ తెంపుకుపోయాడు. అది కొద్దిసేపు తన దురదృష్టానికి చింతించి తనకి తళతళ మెరిసే తగరపు రేకుల ఆకులు ఉంటే బావుండునని పరమాత్మని ప్రార్థించింది. మర్నాడు ఉదయానికల్లా అది కోరుకున్న ఆకులు మొలిచాయి. కాని ఆ రాత్రి వచ్చిన వడగళ్ళ వానకి ఆ తగరపు ఆకులన్నీ రాలిపోయాయి. ఆ తర్వాత అది పరమాత్మని చక్కటి సువాసనల ఆకుపచ్చ ఆకులని కోరుకుంది. పరమాత్మ మళ్ళీ దాని కోరికని మన్నించాడు. ఆ వాసన చేత ఆకర్షించబడ్డ గడ్డి తినే అనేక జంతువులు వచ్చి దాని ఆకులన్నీ తినేశాయి. మొదట ఇచ్చిన ఆకులనే మళ్ళీ ఇవ్వమనీ, అవే తనకి శ్రేయస్కరం అనీ చివరికి అది పరమాత్మని ప్రార్థించింది. నీతి: మనకి లభించేదంతా మనకి అవసరమైంది. అనవసరమైనదేదీ పరమాత్మ మనకి ఇవ్వడు. - మల్లాది వెంకట కృష్ణమూర్తి -
త్రీమంకీస్ - 11
- మల్లాది వెంకటకృష్ణమూర్తి డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 11 ‘‘దేనికో?’’ జైలర్ అడిగాడు. ‘‘భయంతో సార్.’’ ‘‘నోట మాట రాలేదా?’’ ‘‘వచ్చింది సార్. కాని భయంతో ఇంకోటి కూడా వచ్చింది’’ వానర్ సిగ్గుపడుతూ చెప్పాడు. ‘‘సరే. మీ నాన్న పేరు?’’ ‘‘సింహాచలం.’’ ‘‘ఊరు కూడా సింహాచలం కదా?’’ ‘‘కాదు సర్. భద్రాచలం.’’ ‘‘నువ్వేం దొంగతనం చేశావ్?’’ ‘‘ఏటియం లోంచి డబ్బుని విత్‌డ్రా చేసినందుకు పట్టుకున్నారు సార్.’’ ‘‘అదేం నేరం కాదే? నేనూ ఇవాళ ఉదయం ఏటియంలోంచి ఐదు వేలు విత్‌డ్రా చేశాను.’’ ‘‘కాని నా దగ్గర ఏటియం కార్డ్ లేదు సార్.’’ ‘‘ఓహో. అసలు బేంక్‌లో అకౌంటే లేదా?’’ ‘‘లేదు సార్. మెషీన్ డిజైన్ సబ్జెక్ట్‌లో నాకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సార్. కాబట్టి ఏటియం యంత్రాన్ని ఎలా పగలకొట్టాలో దాని డ్రాయింగ్‌ని పరిశీలించగానే ఇట్టే అర్ధమైంది సర్.’’ ‘‘అసలు నీకా డ్రాయింగ్ ఎక్కడిది?’’ ‘‘నెట్టింట్లో సార్.’’ ‘‘బేంక్ మేనేజర్ నట్టింట్లోనా?’’ ‘‘కాదు సార్. నెట్టిల్లంటే ఇంటర్నెట్ అని అర్ధం సర్. ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే దొరికింది సార్.’’ ‘‘నేనెన్నడూ గూగుల్ చేయను. ఎందుకంటే మా ఆవిడకి అంతా తెలుసు. ఇంటర్నెట్‌ని బాగా ఉపయోగిస్తూంటావా?’’ జైలర్ ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో ఉంటే సగం రోజు దాంట్లోనే ఉంటాను సర్.’’ ‘‘ఎలా పట్టుబడ్డావు? సర్వైలెన్స్ కెమేరాలో చిక్కా?’’ ‘‘నేను మూర్ఖుడ్ని కాను సర్. బట్టతో నా మొహం కప్పుకుని లోపలకి వెళ్ళి దాని లెన్స్ మీదకి ఆ బట్టని వేశాను సర్.’’ ‘‘మరెలా పట్టుబడ్డావు?’’ ‘‘నెట్టిల్లు వల్ల సార్.’’ ‘‘ఆ?’’ ‘‘అదే. ఇంటర్నెట్ వల్ల సార్.’’ ‘‘ఇంటర్నెట్టే పట్టించిందా?’’ ‘‘అవును సర్.’’ ‘‘హౌ ఇంట్రెస్టింగ్? ఎలా? ఇంటర్నెట్ ఎలా పట్టించింది?’’ జైలర్ ఆసక్తిగా అడిగాడు. ‘‘నాది మొదటి దొంగతనం కదా సార్? ఏటియం యంత్రాన్ని విప్పాక అందులోంచి తీసి కుప్పగా పోసిన ఐదు లక్షల రూపాయల నోట్ల మధ్య సెల్ఫీ ఫొటో తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాను సర్. దీన్ని చాలామంది షేర్ చేశారు సార్. అలా అలా అది సిఐ గారి మరదలికి చేరింది. ఆమె గారు సిఐ గారికి చెప్పారు సర్. ఆయన మా ఇంటికి వచ్చి డబ్బు స్వాధీనం చేసుకుని నన్ను ఇక్కడికి తెచ్చారు సార్.’’ ‘‘ఫేస్బుక్ రాక మునుపు ఎంతమంది నేరస్థులు తప్పించుకున్నారో?’’ సిఐ విచారంగా చెప్పాడు. ‘‘ఐతే నువ్వు ఉత్త స్టుపిడ్వి అన్నమాట’’ జైలర్ చెప్పాడు. ‘‘స్టుపిడిటీ నేరమా సార్?’’ వానర్ అడిగాడు. ‘‘కాదు.’’ ‘‘స్టుపిడిటీ నేరం కానప్పుడు నన్ను జైల్లో ఎందుకు కూర్చోపెడుతున్నారు సార్?’’ ‘‘కోర్టులో ఈ పాయింట్ మీద వాదించి బయటపడు. బెస్టాఫ్ లక్.’’ ‘‘థాంక్స్ సర్.’’ ‘‘ఏమైనా అనుమానాలు ఉన్నాయా?’’ ‘‘పీజాహట్ నించి మేం పీజాని ఆర్డర్ చేసి మా సెల్‌కి తెప్పించుకోవచ్చాండి?’’ ‘‘లేదు. కుదరదు.’’ ‘‘పోనీ కోక్2హోమ్డాట్ కామ్ నించి కోక్ని? ఫెస్టివ్ ఆఫర్ నడుస్తోంది సార్.’’ ‘‘అలాంటి ఆలోచనలు పెట్టుకోక. బయట ప్రపంచంతో ఇక నీకు సంబంధం కట్’’ జైలర్ చెప్పాడు. ‘‘అలాగే సర్. చూస్తూండండి. నేను ఈ జైల్లోని బెస్ట్ ఖైదీ అనే పేరు తెచ్చుకుంటాను.’’ వానర్ తనకి ముట్టినట్లుగా జైలర్ సిఐ అఫీషియల్‌గా కాగితం ఇచ్చాక అతను వెళ్ళిపోయాడు. గార్డ్లు వానర్ని రిమాండ్ ఖైదీల సెల్‌కి తీసుకెళ్ళారు. ఆ సెల్ కూడాఅన్ని సెల్స్‌లా ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. అందులో అప్పటికే ఉన్న ఖైదీ ఏదో కూనిరాగం తీస్తున్నాడు. కింద బెర్త్ మీద పడుకున్న వ్యక్తి తెల్ల జుట్టు కనిపిస్తోంది. అలికిడికి ఆయన తల తిప్పి చూశాడు. వయసు డెబ్బై ఐదు పైనే ఉండచ్చని ముడతలు పడ్డ అతని మొహాన్ని బట్టి వానర్ అనుకున్నాడు. గార్డ్ ఆ సెల్ తలుపు బయట తాళం పెట్టుకుని వెళ్ళాక ఆయన లేచి కూర్చుంటూ అడిగాడు. ‘‘ఏం చేసి వచ్చావ్?’’ ‘‘దొంగతనం.’’ ‘‘జేబా? ఘరానానా?’’ ‘‘ఏటిఎం పగలకొట్టాను.’’ ‘‘పేరు? కూర్చో’’ పక్కకి జరిగాడు. ‘‘వానర్. మీ పేరు?’’ ‘‘పట్టయ్య. పట్టాభి రామయ్య. కాని అంతా పట్టయ్య అంటారు. నేను రైళ్ళల్లో పాటలు పాడుకుంటూ సంపాదించేవాడ్ని. రైల్వే తత్కాల్ టిక్కెట్లని దొంగ పేర్లతో బ్లాక్ చేని ప్రయాణీకులకి అమ్ముతున్న నేరం మీద పట్టుకున్నారు. రెండు విచారణలు అయ్యాయి.’’ (రేపు ఈ సీరియల్లో మరో రెండు కొత్త వింత పాత్రలని ఊహించగలరా?) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ - ఆదివారం పొద్దుపుచ్చడం కోసం సీరియల్ చూసి ఈ 2 రోజుల నుంచి పేపర్ కొంటున్నాను. వెరైటీగా ఉంది. నిన్నటి భాగంలో పాత్రల పేర్లతో (జడ్జ్ సాక్షులు వచ్చారా అని అడిగినప్పుడు లాయర్ చెప్పిన సంభాషణలు) చాలాచాలా వెరైటీగా ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉంది ఈ సీరియల్. - భరద్వాజ్ వైవిఎస్, (bharadwazhr@gmail.com) -
త్రీ మంకీస్ - 5
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 5 ‘నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు. లేదా ఏసిడ్‌తో నీ కళ్ళు పోయి నీ మొహం అందవిహీనంగా మారుతుంది’ ఆ కాగితాన్ని ఆమెకి ఇచ్చి ఆ సీసాని కనపడేలా పట్టుకుని మూత మీద చేతిని విప్పడానికి సిద్ధంగా ఉంచాడు. ఆమె ఆ కాగితం వంక, అతని వంక మార్చి మార్చి చూసింది. తర్వాత తన పక్క కౌంటర్లోని అతనికి చూపించి కపీష్‌కి అర్ధం కాని భాషలో ఏదో మాట్లాడింది. అతను కపీష్ వంక చూని, అతను రాసింది చూసి ఆ అమ్మాయితో అదే భాషలో జవాబు చెప్పి తన పని చేసుకోసాగాడు. ‘‘సారీ! డిపాజిట్ స్లిప్‌ని ఇంగ్లీష్‌లో రాయాలి. తెలుగులో అంగీకరించం’’ ఆమె హిందీలో చెప్పింది. కపీష్ వెంటనే అడిగాడు. ‘‘మీకు ఇంగ్లీష్ వచ్చా?’’ ‘‘కొద్దిగా.’’ ‘‘గివ్ మి మనీ. ఆర్ దిసీజ్ ఏసిడ్. ఆర్ లూజ్ యువర్ ఐస్ అండ్ స్కిన్’’ కఠినంగా చూస్తూ చెప్పాడు. ఆమె అతని చేతిలోని బాటిల్‌ని చూసి వణికిపోయింది. ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆమెకి తనతో తెచ్చిన సంచీని ఇచ్చాడు. ‘‘నో. నో.నో.’’ గొణిగింది. డ్రాయర్లోంచి వెయ్యి రూపాయల కట్టలని ఆరిటిని, ఐదు వందల రూపాయల కట్టలని నాలుగిటిని, కొన్ని వంద, ఏభై, ఇరవై, పది రూపాయల కట్టలని గబగబ తీసి సంచీలో వేసి అతనికిచ్చి చెప్పింది. ‘‘గో. గో. క్విక్.’’ ‘‘గోయింగ్’’ చెప్పి కపీష్ వేగంగా బయటకి నడిచి, ఆ సంచీని ఏక్టివా హేండిల్ బార్కి తగిలించి ఎక్కి స్టార్ట్ చేశాడు. త్వరలోనే అతను నాచారం మెయిన్ రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్‌లో కలిసిపోయాడు. ఇక తనని ఎవరూ పట్టుకోలేరు అనే ఉత్సాహం కలిగింది. హబ్సిగూడా చౌరస్తాలో రెడ్ లైట్ దగ్గర అతను ఏక్టివాని ఆపాడు. సరాసరి బస్‌డిపోకి వెళ్ళి తన ఇంటికి ఆ డబ్బుతో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చౌరస్తాలో ఆగి ఉన్న పోలీస్ పెట్రోల్ కార్లోని ఓ కానిస్టేబుల్ తక్షణం కారు దిగి వచ్చి కపీష్ ఏక్టివా బండి తాళం చెవిని లాక్కున్నాడు. ‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ కపీష్ కోపంగా అడిగాడు. ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చి అతను పారిపోకుండా కాలర్ని పట్టుకున్నాడు. స్టేషన్‌కి తీసుకెళ్ళాక కాని పోలీసులకి తాము పట్టుకుంది ఏక్టివా బండి దొంగని కాదని, బేంక్‌లో పది లక్షల పైనే దొంగిలించిన దొంగనని తెలీలేదు. తను దొంగిలించబడ్డ ఏక్టివా బండిని దొంగిలించాడని తెలుసుకోగానే కపీష్‌కి తన మీద తనకే ఎంత కోపం వచ్చిందంటే, ‘ఛీ! నీ బతుకు చెడ’ అని తనని తనే తిట్టుకున్నాడు. అత్యంత ట్రాజెడీ ఏమిటంటే అతను అసలా లక్షలని కళ్ళతో చూడలేదు. చేతులతో ముట్టుకోలేదు కూడా. ‘‘నీ సెల్ నంబర్ టు థర్టీన్. నువ్వు ఒక్కడివే’’ గార్డ్ సెల్ తలుపు తెరుస్తూ చెప్పాడు. ఆ సెల్ ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. రైల్వే బెర్త్లోలా రెండు బెడ్స్ గోడకి ఒకదాని మీద మరొకటి ఉన్నాయి. ‘‘సింగిల్ ఆక్యుపెన్సీ అన్నమాట. ఏదైనా కావాలంటే బెల్ ఉందా?’’ ‘‘ఉంది. కాని దాని ఖరీదు ఐదు వేల రూపాయలు. మెనూ కార్డ్ ప్రకారం చెలిే్లన్త ఏదైనా తెస్తాను.’’ ‘‘ఈ హోటల్ కృష్ణా ఒబెరాయ్ కన్నా ఖరీదన్నమాట. తాళం పడిందో లేదో లాగి చూడు. లేకపోతే తర్వాత నీకు మాటొస్తుంది’’ కపీష్ చెప్పాడు. ‘‘నీ క్కూడా. ఇలాంటివి మాకు చెప్పక్కర్లేదు, ఐదు వేలు ఇస్తే తప్ప.’’ అతను వెళ్ళాక కపీష్ కింది బెర్త్ మీద పడుకుని జైలర్ ఇచ్చిన ‘జైలు జీవితం ఎందుకు మంచిది?’ అనే బ్రోషర్ని చదివాడు. ‘ఉద్యోగం కన్నా జైలు బెర్. ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ డెంటల్ కేర్, ఫ్రీ లైబ్రరీ, ఫ్రీ స్పోర్ట్స్ పోగ్రాం, ఫ్రీ లాండ్రి సర్వీన్, ఫండింగ్ ఫర్ ఎడ్యుకేషన్, ఫ్రీ హౌసింగ్, ఫ్రీ క్లోతింగ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ జిమ్, ఫ్రీ టివి, ఫ్రీ ఇంటర్నెట్... ఇంకా...’ 2 ఆ సాయంత్రం ఫస్ట్ మెట్రోపాలిటన్ కోర్ట్‌లో ఆఖరి కేసు విచారణ జరుగుతోంది. ‘‘ఇది నీ ఫొటోనేనా?’’ మెజిస్ట్రేట్ సాక్షిని అడిగాడు. ‘‘అవును సర్.’’ ‘‘ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’ ‘‘మీ ప్రశ్నని మళ్ళీ వేస్తారా సర్?’’ ‘‘అర్ధం కాలేదా? ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’ ‘‘ఉన్నాను సర్.’’ ‘‘నువ్వు చూసిన సాక్షిని వర్ణించు’’ యమధర్మరాజు అడిగాడు. ‘‘ఐదడుగుల ఆరంగుళాల ఎత్తు ఉంటాడండి. గెడ్డం ఉంది.’’ ‘‘సాక్షి మగా? ఆడా?’’ యమధర్మరాజు అడిగాడు. ‘‘మగ సార్.’’ ఆ సాక్ష్యం రికార్డ్ చేశాక మెజిస్ట్రేట్ యమధర్మరాజు అడిగాడు. ‘‘వివాదంలోని ఈ దంపతులకి పిల్లలు ఉన్నారా?’’ ‘‘ఉన్నారు సార్’’ ఇద్దరి తరఫు లాయర్లు చెప్పారు. ‘‘ఎంతమంది?’’ ‘‘ముగ్గురు సార్.’’ ‘‘కొడుకులు ఎంతమంది?’’ ‘‘ఇద్దరు సార్.’’ ‘‘కూతుళ్ళ మాటేమిటి? ఉన్నారా?’’ ‘‘సర్?’’ ‘‘అలా తెల్లమొహం వేస్తారే? కూతుళ్ళు ఉన్నారా అని నేను అడిగేది.’’ మళ్లీ రేపు - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com -
నేనసలు అద్దమే చూడను...
అంతర్వీక్షణం ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? అలాంటిదేమీ అనుకోలేదు, రచయితగా స్థిరపడడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అలాగే ఫలానా ప్రదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనలు అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు. ఇప్పటికి ఎన్ని నవలలు, కథలు రాసి ఉండవచ్చు? 150 నవలలు, మూడు వేలకు పైగా కథలు. మీ రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనవి? రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయి, విధాత ఏదైనా ఒక పాత్రను మలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ పాత్రను మరోలా రూపొందించి ఉండాల్సింది అనుకున్న సందర్భం ఉందా? లేదు. రచన మొదలు పెట్టే ముందే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదలు పెట్టాక మార్చకూడదు. నాకెప్పుడూ మార్చాల్సిన అవసరం కూడా రాలేదు. మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఏ రకంగా ప్రభావం చూపారు? కొమ్మూరి సాంబశివరావు గారు. ఆయన రచనలే నాకు స్ఫూర్తి. ఆయన లేకపోతే మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఉండేవాడు కాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు... అమ్మ ఒడిలోకి పయనం, ఒక యోగి ఆత్మకథ. ఇన్నేళ్లుగా ఎన్నడూ మీ ఫొటో ప్రచురించడానికి ఇష్టపడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా? నాలో కీర్తి కాంక్ష కొద్దిగా కూడా లేదు. ఫొటోలు తీసుకుని చూసుకోవాలనే కోరిక కూడా లేదు. నా జీవితంలో తీసుకున్న ఫొటోలు బస్ పాసు, పాస్ పోర్టు, స్కూలు రికార్డుల కోసమే. మీ అభిమాన పాఠకులలో ఒకరి పేరు చెప్తారా? వైజాగ్ నుంచి ఎం. ఎన్. దేవి అనే పాఠకురాలు, తాడేపల్లి గూడెం నుంచి రాము అనే పాఠకుడు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వారు. ఎలాంటి విషయాలకు భయపడతారు? ఒక సాధారణమైన మనిషికి ఉండే భయాలన్నీ నాకూ ఉన్నాయి. పామును చూసి భయపడడం మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినట్లుంది. ఆధ్యాత్మిక మార్గంలో తరచూ పాములుండే ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో ఇప్పుడా భయం పోయింది. అబద్ధం చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకప్పుడు స్వీయరక్షణ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసే వాడిని. ఆధ్యాత్మికంలో సత్యానికి దగ్గరగా ఉండడాన్ని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మానేశాను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? నేనసలు అద్దమే చూడను. తల దువ్వడానికి కూడా చూడను. షేవింగ్ సమయంలో కూడా చెంపల మీదే తప్ప ముఖం మీద నా దృష్టి పడదు. మీరు ఎన్నడైనా మీ శ్రీమతిని క్షమాపణ అడగాల్సి వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. కానీ గతంలో మగాడిననే అహంతో క్షమాపణ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతికే కాదు బయటి వాళ్లకు కూడా గతంలో వాళ్లకు కలిగించిన అసౌకర్యాలను గుర్తు చేసుకుని మరీ క్షమాపణ చెప్తున్నాను. పిల్లల గురించి... నాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి కావ్య అమెరికాలోని హ్యూస్టన్‌లో, రెండో అమ్మాయి ఊహ ఇండియానాపోలిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో అమ్మాయి లిపి... విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఎం.ఎస్ చేస్తోంది. ఈ తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది? సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు. వారి కారణంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే దానికి కనీసంగా కూడా స్పందించడం లేదు. పొరపాటు జరిగిందనే భావన మనసులోకే రానివ్వడం లేదు. ఆ ధోరణి మారాలి. మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఉందా? జీవితం నిండా అవే ఉన్నాయి. సంస్కరించుకునే ప్రయత్నం జరిగిందా? జరిగింది. అందులో భాగంగానే మద్యం, మాంసం,మగువల జోలికెళ్లడం పూర్తిగా మానేశాను. దేవుడు ప్రత్యక్షమై ‘నీ జీవితంలో ఒక్కరోజే ఉంద’ంటే.. మీ చివరి కోరిక..? మోక్ష సాధన కోసం ఏమేమి చేయాలో ఆ దేవుణ్ణే అడిగి, ఆయన చెప్పినట్లు చేస్తాను. - వాకా మంజులారెడ్డి