త్రీ మంకీస్ - 5 | Three monkey Daily serial- crime comedy suspence thriller-5 | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 5

Published Wed, Oct 22 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

త్రీ మంకీస్ - 5

త్రీ మంకీస్ - 5

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 5
 ‘నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు. లేదా ఏసిడ్‌తో నీ కళ్ళు పోయి నీ మొహం అందవిహీనంగా మారుతుంది’ ఆ కాగితాన్ని ఆమెకి ఇచ్చి ఆ సీసాని కనపడేలా పట్టుకుని మూత మీద చేతిని విప్పడానికి సిద్ధంగా ఉంచాడు. ఆమె ఆ కాగితం వంక, అతని వంక మార్చి మార్చి చూసింది. తర్వాత తన పక్క కౌంటర్లోని అతనికి చూపించి కపీష్‌కి అర్ధం కాని భాషలో ఏదో మాట్లాడింది. అతను కపీష్ వంక చూని, అతను రాసింది చూసి ఆ అమ్మాయితో అదే భాషలో జవాబు చెప్పి తన పని చేసుకోసాగాడు. ‘‘సారీ! డిపాజిట్ స్లిప్‌ని ఇంగ్లీష్‌లో రాయాలి. తెలుగులో అంగీకరించం’’ ఆమె హిందీలో చెప్పింది.
 కపీష్ వెంటనే అడిగాడు.
 ‘‘మీకు ఇంగ్లీష్ వచ్చా?’’
 ‘‘కొద్దిగా.’’
 ‘‘గివ్ మి మనీ. ఆర్ దిసీజ్ ఏసిడ్. ఆర్ లూజ్ యువర్ ఐస్ అండ్ స్కిన్’’ కఠినంగా చూస్తూ చెప్పాడు.
 ఆమె అతని చేతిలోని బాటిల్‌ని చూసి వణికిపోయింది. ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆమెకి తనతో తెచ్చిన సంచీని ఇచ్చాడు.
 ‘‘నో. నో.నో.’’ గొణిగింది.
 డ్రాయర్లోంచి వెయ్యి రూపాయల కట్టలని ఆరిటిని, ఐదు వందల రూపాయల కట్టలని నాలుగిటిని, కొన్ని వంద, ఏభై, ఇరవై, పది రూపాయల కట్టలని గబగబ తీసి సంచీలో వేసి అతనికిచ్చి చెప్పింది.
 ‘‘గో. గో. క్విక్.’’
 ‘‘గోయింగ్’’ చెప్పి కపీష్ వేగంగా బయటకి నడిచి, ఆ సంచీని ఏక్టివా హేండిల్ బార్‌కి తగిలించి ఎక్కి స్టార్ట్ చేశాడు. త్వరలోనే అతను నాచారం మెయిన్ రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్‌లో కలిసిపోయాడు. ఇక తనని ఎవరూ పట్టుకోలేరు అనే ఉత్సాహం కలిగింది.
 హబ్సిగూడా చౌరస్తాలో రెడ్ లైట్ దగ్గర అతను ఏక్టివాని ఆపాడు. సరాసరి బస్‌డిపోకి వెళ్ళి తన ఇంటికి ఆ డబ్బుతో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చౌరస్తాలో ఆగి ఉన్న పోలీస్ పెట్రోల్ కార్లోని ఓ కానిస్టేబుల్ తక్షణం కారు దిగి వచ్చి కపీష్ ఏక్టివా బండి తాళం చెవిని లాక్కున్నాడు.
 ‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ కపీష్ కోపంగా అడిగాడు. ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చి అతను పారిపోకుండా కాలర్‌ని పట్టుకున్నాడు. స్టేషన్‌కి తీసుకెళ్ళాక కాని పోలీసులకి తాము పట్టుకుంది ఏక్టివా బండి దొంగని కాదని, బేంక్‌లో పది లక్షల పైనే దొంగిలించిన దొంగనని తెలీలేదు. తను దొంగిలించబడ్డ ఏక్టివా బండిని దొంగిలించాడని తెలుసుకోగానే కపీష్‌కి తన మీద తనకే ఎంత కోపం వచ్చిందంటే, ‘ఛీ! నీ బతుకు చెడ’ అని తనని తనే తిట్టుకున్నాడు. అత్యంత ట్రాజెడీ ఏమిటంటే అతను అసలా లక్షలని కళ్ళతో చూడలేదు. చేతులతో ముట్టుకోలేదు కూడా.
   
 ‘‘నీ సెల్ నంబర్ టు థర్టీన్. నువ్వు ఒక్కడివే’’ గార్డ్ సెల్ తలుపు తెరుస్తూ చెప్పాడు. ఆ సెల్ ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. రైల్వే బెర్త్‌లోలా రెండు బెడ్స్ గోడకి ఒకదాని మీద మరొకటి ఉన్నాయి.
 ‘‘సింగిల్ ఆక్యుపెన్సీ అన్నమాట. ఏదైనా కావాలంటే బెల్ ఉందా?’’
 ‘‘ఉంది. కాని దాని ఖరీదు ఐదు వేల రూపాయలు. మెనూ కార్డ్ ప్రకారం చెలిే్లన్త  ఏదైనా తెస్తాను.’’
 ‘‘ఈ హోటల్ కృష్ణా ఒబెరాయ్ కన్నా ఖరీదన్నమాట. తాళం పడిందో లేదో లాగి చూడు. లేకపోతే తర్వాత నీకు మాటొస్తుంది’’ కపీష్ చెప్పాడు.        
 ‘‘నీ క్కూడా. ఇలాంటివి మాకు చెప్పక్కర్లేదు, ఐదు వేలు ఇస్తే తప్ప.’’    
 అతను వెళ్ళాక కపీష్ కింది బెర్త్ మీద పడుకుని జైలర్ ఇచ్చిన ‘జైలు జీవితం ఎందుకు మంచిది?’ అనే బ్రోషర్‌ని చదివాడు.
 ‘ఉద్యోగం కన్నా జైలు బెర్. ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ డెంటల్ కేర్, ఫ్రీ లైబ్రరీ, ఫ్రీ స్పోర్ట్స్ పోగ్రాం, ఫ్రీ లాండ్రి సర్వీన్, ఫండింగ్ ఫర్ ఎడ్యుకేషన్, ఫ్రీ హౌసింగ్, ఫ్రీ క్లోతింగ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ జిమ్, ఫ్రీ టివి, ఫ్రీ ఇంటర్నెట్... ఇంకా...’
 
 2
 ఆ సాయంత్రం ఫస్ట్ మెట్రోపాలిటన్ కోర్ట్‌లో ఆఖరి కేసు విచారణ జరుగుతోంది.
 ‘‘ఇది నీ ఫొటోనేనా?’’ మెజిస్ట్రేట్ సాక్షిని అడిగాడు.
 ‘‘అవును సర్.’’
 ‘‘ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’
 ‘‘మీ ప్రశ్నని మళ్ళీ వేస్తారా సర్?’’
 ‘‘అర్ధం కాలేదా? ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’
 ‘‘ఉన్నాను సర్.’’
 ‘‘నువ్వు చూసిన సాక్షిని వర్ణించు’’ యమధర్మరాజు అడిగాడు.
 ‘‘ఐదడుగుల ఆరంగుళాల ఎత్తు ఉంటాడండి. గెడ్డం ఉంది.’’
 ‘‘సాక్షి మగా? ఆడా?’’ యమధర్మరాజు అడిగాడు.
 ‘‘మగ సార్.’’
 ఆ సాక్ష్యం రికార్డ్ చేశాక మెజిస్ట్రేట్ యమధర్మరాజు అడిగాడు.
 ‘‘వివాదంలోని ఈ దంపతులకి పిల్లలు ఉన్నారా?’’
 ‘‘ఉన్నారు సార్’’ ఇద్దరి తరఫు లాయర్లు చెప్పారు.
 ‘‘ఎంతమంది?’’
 ‘‘ముగ్గురు సార్.’’
 ‘‘కొడుకులు ఎంతమంది?’’
 ‘‘ఇద్దరు సార్.’’
 ‘‘కూతుళ్ళ మాటేమిటి? ఉన్నారా?’’
 ‘‘సర్?’’
 ‘‘అలా తెల్లమొహం వేస్తారే? కూతుళ్ళు ఉన్నారా అని నేను అడిగేది.’’
 మళ్లీ  రేపు
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement