త్రీమంకీస్- 4 | Three Monkeys serial..... daily serial | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 4

Published Wed, Oct 22 2014 12:13 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

త్రీమంకీస్- 4 - Sakshi

త్రీమంకీస్- 4

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 4
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

‘‘ఎస్సై పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టాను సార్. హెల్త్ చెకప్ తర్వాత దేహదారుఢ్య పరుగు పరీక్షని గుండాగి మరణించకుండా పూర్తి చేశాను. ఐక్యూ టెస్ట్‌లో పాసయ్యాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. కాని అసలు అర్హత విషయంలో నన్ను ఫెయిల్ చేశారు’’ కపీష్ బాధగా చెప్పాడు.
 
‘‘అసలు అర్హతేమిటి?’’
 ‘‘కన్‌ఫ్యూజ్ అవద్దు సార్. ఎస్సై పోస్ట్‌కి పది లక్షలు లంచం అడిగారు. ‘అంత ఉంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుని ఈపాటికి కరెంట్ హాలీడే మీద ఆందోళన చేసేవాడ్నిగా. ఆ డబ్బు లేకే ఈ ఉద్యోగానికి వచ్చాను’ అంటే ‘ఎస్సై ఉద్యోగం బిగ్ స్కేల్ ఇండస్ట్రీ. ఇక్కడ పెట్టుబడి పెట్టు. లేదా నడు’ అన్నారు. ఎస్సై పోస్ట్ బిగ్ స్కేల్ ఇండస్ట్రీ ఎలా అవుతుందని అడిగితే రికవరీ సొత్తులో డెబ్భై శాతం నొక్కేయచ్చని, చూసీచూడనట్లుంటే దొంగల నించి, వైన్‌షాపుల యజమానుల నించి మామూళ్ళు అందుతాయని ఏవేవో లెక్కలు చెప్పారు. ఈ దేశంలో యువతకి రెండే మార్గాలు కదా సార్. దాంతో బయటకి నడిచాను.’’
 
‘‘ఏమిటవి?’’
 ‘‘ఐతే ఎస్సై. లేదా దొంగ. ఎస్సైని కాలేనని నేను దొంగ వృత్తిని ఎంచుకున్నాను. విజిటింగ్ కార్డు వేయించుకోవాలని అనుకుంటున్నాను కూడా.’’
 ‘‘అంటే ఇంకా విజిటింగ్ కార్డులని దొంగిలించలేదన్నమాట.’’
 ‘‘కన్‌ఫ్యూజ్ అవకండి సార్. పదివేల రూపాయల లోపువి ఏవీ దొంగతనం చేయను.’’
 ‘‘డిగ్నీటీ కూడా ఏడిసిందన్నమాట’’ జైలర్ నవ్వాడు.
 ‘‘పోస్టులు కొనుక్కున్న ఎస్సైల పెట్టుబడి వెనక్కి వచ్చి లాభార్జన కూడా చేయాలి కదండి. అందుకని నేను చేసేదీ మంచిదే’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నీ వయసు?’’ జైలర్ ప్రశ్నించాడు.

 ‘‘ఇరవై మూడు సార్.’’
 సిఐ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని చదివి అందులోని కపీష్ సంతకాన్ని చూపించి అడిగాడు.
 ‘‘ఇది నీదేనా?’’
 ‘‘అవును సార్.’’
 ‘‘చదివే సంతకం చేశావా?’’
 ‘‘అవును సార్.’’
 ‘‘ఇందులో రాసినట్లుగానే నువ్వు దొంగతనం చేశావా?’’
 ‘‘అవును సార్.’’
 వెంటనే జైలర్ పకపక నవ్వి చెప్పాడు.
 ‘‘దురదృష్టవంతుడివి. సరే. ఇక నించి నువ్వు మా విశ్రాంతి గృహంలో అతిథివి. వెల్‌కం.’’
 ‘‘థాంక్ యు సార్. జైల్లో విశ్రాంతి గృహాలు కూడా ఉంటాయా సర్?’’ కపీష్ ఆనందంగా అడిగాడు.
 ‘‘అంటే రిమాండ్ ఖైదీవి అని అర్థ్ధం’’ ిసీఐ నవ్వుతూ చెప్పాడు.
 జైలర్ రికార్డ్ కోసం అతని రిలేషన్‌షిప్ స్టేటస్ అడిగి తెలుసుకున్నాడు.
 ‘‘సింగిల్?’’
 ‘‘కాదు సార్.’’
 ‘‘ఇన్ రిలేషన్‌షిప్?’’
 ‘‘కాదు సార్.’’
 ‘‘ఎంగేజ్డ్?’’
 ‘‘కాదు సార్.’’
 ‘‘మేరీడ్?’’
 ‘‘కాదు సార్.’’
 ‘‘డైవోర్స్‌డ్?’’ జాలిగా చూస్తూ అడిగాడు.
 ‘‘కాదు సార్.’’
 ‘‘ఐతే విడోయర్‌వి అన్నమాట.’’
 ‘‘కాదు సార్.’’
 ‘‘ఇవేమీ కాదా? ప్రపంచంలో ఎక్కడా అలా ఉండదే?’’ ఆయన ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘వెయిటింగ్ ఫరే మిరకిల్ అని రాసి టిక్ చేయండి’’ కపీష్ చెప్పాడు.
 అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ తీసుకుని, రిజిస్టర్‌లో వాటి వివరాలు రాసుకున్నాక అతన్ని సెల్‌కి పంపబోయే ముందు జైలర్ అతనికి ఓ బ్రోచర్‌ని ఇచ్చి అడిగాడు.
 ‘‘నువ్వు చేసిన దొంగతనం గురించి నీ మాటల్లో చెప్పు. వింటాను.’’
   
 ఎస్సై ఉద్యోగం రాకపోవడంతో ఇక హైద్రాబాద్‌లో అతనికి పనేం లేదు. పొలాన్ని తాకట్టు పెట్టి చదివించిన అతని తల్లితండ్రులు కపీష్ ఉద్యోగం చేస్తూ జీతంతో పొలం అప్పుని తీర్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాడని కలలు కంటున్నారు. దాంతో ఇంటికి వెళ్ళడం అవమానంగా తోచింది. చివరికి కపీష్ దొంగతనం చేయదలచుకున్నాడు. ఐతే ఏ కారో, బంగారు నగలో దొంగతనం చేసినా వాటిని ఎవరు కొంటారో తెలీదు కాబట్టి కేషే కొట్టేయదలచుకున్నాడు. కేష్ ఉండేది బ్యాంకులోనే అని అతనికి తెలుసు. కపీష్ ఊరి శివార్లలోని బేంకులని పరిశీలించాడు. చివరకి ఆట్టే రద్దీ ఉండని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ బేంక్‌ని ఎన్నుకున్నాడు. ఆఫీన్  ఎకౌంట్స్ తప్ప అక్కడ వ్యక్తిగత అకౌంట్స్ తక్కువ కాబట్టి రద్దీ ఉండదు.

అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట నించి ఒకటిన్నర దాకా అసలు రద్దీ లేకపోవడం గమనించాడు. తన పథక రచనలో భాగంగా గాజు సీసాలో నీళ్ళని పోసి అందులో చిటికెడు పసుపుని కలిపి బాగా కదిపాడు. బేంక్ సమీపంలోని తాళం వేసిన ఓ ఇంటి ఆవరణలో ఉన్న తాళం లేని ఏక్టివా బండిని దొంగిలించాడు. అది దొంగతనం చేశాక పారిపోవడానికి! ఒకటి ముప్పావుకి ముందు తలుపు మూసేశాక వెనక తలుపులోంచి బేంక్‌లోకి వెళ్ళాడు. అక్కడ కేష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క చూసుకుంటోందో అమ్మాయి. కౌంటర్లోని డిపాజిట్ స్లిప్ మీద తెలుగులో రాశాడు.
 
మళ్లీ  రేపు

ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement