Three Monkeys serial
-
త్రీ మంకీస్ - 5
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 5 ‘నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వు. లేదా ఏసిడ్‌తో నీ కళ్ళు పోయి నీ మొహం అందవిహీనంగా మారుతుంది’ ఆ కాగితాన్ని ఆమెకి ఇచ్చి ఆ సీసాని కనపడేలా పట్టుకుని మూత మీద చేతిని విప్పడానికి సిద్ధంగా ఉంచాడు. ఆమె ఆ కాగితం వంక, అతని వంక మార్చి మార్చి చూసింది. తర్వాత తన పక్క కౌంటర్లోని అతనికి చూపించి కపీష్‌కి అర్ధం కాని భాషలో ఏదో మాట్లాడింది. అతను కపీష్ వంక చూని, అతను రాసింది చూసి ఆ అమ్మాయితో అదే భాషలో జవాబు చెప్పి తన పని చేసుకోసాగాడు. ‘‘సారీ! డిపాజిట్ స్లిప్‌ని ఇంగ్లీష్‌లో రాయాలి. తెలుగులో అంగీకరించం’’ ఆమె హిందీలో చెప్పింది. కపీష్ వెంటనే అడిగాడు. ‘‘మీకు ఇంగ్లీష్ వచ్చా?’’ ‘‘కొద్దిగా.’’ ‘‘గివ్ మి మనీ. ఆర్ దిసీజ్ ఏసిడ్. ఆర్ లూజ్ యువర్ ఐస్ అండ్ స్కిన్’’ కఠినంగా చూస్తూ చెప్పాడు. ఆమె అతని చేతిలోని బాటిల్‌ని చూసి వణికిపోయింది. ఆమె మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆమెకి తనతో తెచ్చిన సంచీని ఇచ్చాడు. ‘‘నో. నో.నో.’’ గొణిగింది. డ్రాయర్లోంచి వెయ్యి రూపాయల కట్టలని ఆరిటిని, ఐదు వందల రూపాయల కట్టలని నాలుగిటిని, కొన్ని వంద, ఏభై, ఇరవై, పది రూపాయల కట్టలని గబగబ తీసి సంచీలో వేసి అతనికిచ్చి చెప్పింది. ‘‘గో. గో. క్విక్.’’ ‘‘గోయింగ్’’ చెప్పి కపీష్ వేగంగా బయటకి నడిచి, ఆ సంచీని ఏక్టివా హేండిల్ బార్కి తగిలించి ఎక్కి స్టార్ట్ చేశాడు. త్వరలోనే అతను నాచారం మెయిన్ రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్‌లో కలిసిపోయాడు. ఇక తనని ఎవరూ పట్టుకోలేరు అనే ఉత్సాహం కలిగింది. హబ్సిగూడా చౌరస్తాలో రెడ్ లైట్ దగ్గర అతను ఏక్టివాని ఆపాడు. సరాసరి బస్‌డిపోకి వెళ్ళి తన ఇంటికి ఆ డబ్బుతో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. చౌరస్తాలో ఆగి ఉన్న పోలీస్ పెట్రోల్ కార్లోని ఓ కానిస్టేబుల్ తక్షణం కారు దిగి వచ్చి కపీష్ ఏక్టివా బండి తాళం చెవిని లాక్కున్నాడు. ‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ కపీష్ కోపంగా అడిగాడు. ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చి అతను పారిపోకుండా కాలర్ని పట్టుకున్నాడు. స్టేషన్‌కి తీసుకెళ్ళాక కాని పోలీసులకి తాము పట్టుకుంది ఏక్టివా బండి దొంగని కాదని, బేంక్‌లో పది లక్షల పైనే దొంగిలించిన దొంగనని తెలీలేదు. తను దొంగిలించబడ్డ ఏక్టివా బండిని దొంగిలించాడని తెలుసుకోగానే కపీష్‌కి తన మీద తనకే ఎంత కోపం వచ్చిందంటే, ‘ఛీ! నీ బతుకు చెడ’ అని తనని తనే తిట్టుకున్నాడు. అత్యంత ట్రాజెడీ ఏమిటంటే అతను అసలా లక్షలని కళ్ళతో చూడలేదు. చేతులతో ముట్టుకోలేదు కూడా. ‘‘నీ సెల్ నంబర్ టు థర్టీన్. నువ్వు ఒక్కడివే’’ గార్డ్ సెల్ తలుపు తెరుస్తూ చెప్పాడు. ఆ సెల్ ఆరు బై ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉంది. రైల్వే బెర్త్లోలా రెండు బెడ్స్ గోడకి ఒకదాని మీద మరొకటి ఉన్నాయి. ‘‘సింగిల్ ఆక్యుపెన్సీ అన్నమాట. ఏదైనా కావాలంటే బెల్ ఉందా?’’ ‘‘ఉంది. కాని దాని ఖరీదు ఐదు వేల రూపాయలు. మెనూ కార్డ్ ప్రకారం చెలిే్లన్త ఏదైనా తెస్తాను.’’ ‘‘ఈ హోటల్ కృష్ణా ఒబెరాయ్ కన్నా ఖరీదన్నమాట. తాళం పడిందో లేదో లాగి చూడు. లేకపోతే తర్వాత నీకు మాటొస్తుంది’’ కపీష్ చెప్పాడు. ‘‘నీ క్కూడా. ఇలాంటివి మాకు చెప్పక్కర్లేదు, ఐదు వేలు ఇస్తే తప్ప.’’ అతను వెళ్ళాక కపీష్ కింది బెర్త్ మీద పడుకుని జైలర్ ఇచ్చిన ‘జైలు జీవితం ఎందుకు మంచిది?’ అనే బ్రోషర్ని చదివాడు. ‘ఉద్యోగం కన్నా జైలు బెర్. ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ డెంటల్ కేర్, ఫ్రీ లైబ్రరీ, ఫ్రీ స్పోర్ట్స్ పోగ్రాం, ఫ్రీ లాండ్రి సర్వీన్, ఫండింగ్ ఫర్ ఎడ్యుకేషన్, ఫ్రీ హౌసింగ్, ఫ్రీ క్లోతింగ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ జిమ్, ఫ్రీ టివి, ఫ్రీ ఇంటర్నెట్... ఇంకా...’ 2 ఆ సాయంత్రం ఫస్ట్ మెట్రోపాలిటన్ కోర్ట్‌లో ఆఖరి కేసు విచారణ జరుగుతోంది. ‘‘ఇది నీ ఫొటోనేనా?’’ మెజిస్ట్రేట్ సాక్షిని అడిగాడు. ‘‘అవును సర్.’’ ‘‘ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’ ‘‘మీ ప్రశ్నని మళ్ళీ వేస్తారా సర్?’’ ‘‘అర్ధం కాలేదా? ఇది తీసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా?’’ ‘‘ఉన్నాను సర్.’’ ‘‘నువ్వు చూసిన సాక్షిని వర్ణించు’’ యమధర్మరాజు అడిగాడు. ‘‘ఐదడుగుల ఆరంగుళాల ఎత్తు ఉంటాడండి. గెడ్డం ఉంది.’’ ‘‘సాక్షి మగా? ఆడా?’’ యమధర్మరాజు అడిగాడు. ‘‘మగ సార్.’’ ఆ సాక్ష్యం రికార్డ్ చేశాక మెజిస్ట్రేట్ యమధర్మరాజు అడిగాడు. ‘‘వివాదంలోని ఈ దంపతులకి పిల్లలు ఉన్నారా?’’ ‘‘ఉన్నారు సార్’’ ఇద్దరి తరఫు లాయర్లు చెప్పారు. ‘‘ఎంతమంది?’’ ‘‘ముగ్గురు సార్.’’ ‘‘కొడుకులు ఎంతమంది?’’ ‘‘ఇద్దరు సార్.’’ ‘‘కూతుళ్ళ మాటేమిటి? ఉన్నారా?’’ ‘‘సర్?’’ ‘‘అలా తెల్లమొహం వేస్తారే? కూతుళ్ళు ఉన్నారా అని నేను అడిగేది.’’ మళ్లీ రేపు - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com -
త్రీమంకీస్- 4
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 4 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఎస్సై పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టాను సార్. హెల్త్ చెకప్ తర్వాత దేహదారుఢ్య పరుగు పరీక్షని గుండాగి మరణించకుండా పూర్తి చేశాను. ఐక్యూ టెస్ట్‌లో పాసయ్యాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. కాని అసలు అర్హత విషయంలో నన్ను ఫెయిల్ చేశారు’’ కపీష్ బాధగా చెప్పాడు. ‘‘అసలు అర్హతేమిటి?’’ ‘‘కన్ఫ్యూజ్ అవద్దు సార్. ఎస్సై పోస్ట్‌కి పది లక్షలు లంచం అడిగారు. ‘అంత ఉంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుని ఈపాటికి కరెంట్ హాలీడే మీద ఆందోళన చేసేవాడ్నిగా. ఆ డబ్బు లేకే ఈ ఉద్యోగానికి వచ్చాను’ అంటే ‘ఎస్సై ఉద్యోగం బిగ్ స్కేల్ ఇండస్ట్రీ. ఇక్కడ పెట్టుబడి పెట్టు. లేదా నడు’ అన్నారు. ఎస్సై పోస్ట్ బిగ్ స్కేల్ ఇండస్ట్రీ ఎలా అవుతుందని అడిగితే రికవరీ సొత్తులో డెబ్భై శాతం నొక్కేయచ్చని, చూసీచూడనట్లుంటే దొంగల నించి, వైన్‌షాపుల యజమానుల నించి మామూళ్ళు అందుతాయని ఏవేవో లెక్కలు చెప్పారు. ఈ దేశంలో యువతకి రెండే మార్గాలు కదా సార్. దాంతో బయటకి నడిచాను.’’ ‘‘ఏమిటవి?’’ ‘‘ఐతే ఎస్సై. లేదా దొంగ. ఎస్సైని కాలేనని నేను దొంగ వృత్తిని ఎంచుకున్నాను. విజిటింగ్ కార్డు వేయించుకోవాలని అనుకుంటున్నాను కూడా.’’ ‘‘అంటే ఇంకా విజిటింగ్ కార్డులని దొంగిలించలేదన్నమాట.’’ ‘‘కన్ఫ్యూజ్ అవకండి సార్. పదివేల రూపాయల లోపువి ఏవీ దొంగతనం చేయను.’’ ‘‘డిగ్నీటీ కూడా ఏడిసిందన్నమాట’’ జైలర్ నవ్వాడు. ‘‘పోస్టులు కొనుక్కున్న ఎస్సైల పెట్టుబడి వెనక్కి వచ్చి లాభార్జన కూడా చేయాలి కదండి. అందుకని నేను చేసేదీ మంచిదే’’ కపీష్ చెప్పాడు. ‘‘నీ వయసు?’’ జైలర్ ప్రశ్నించాడు. ‘‘ఇరవై మూడు సార్.’’ సిఐ ఇచ్చిన స్టేట్మెంట్ని చదివి అందులోని కపీష్ సంతకాన్ని చూపించి అడిగాడు. ‘‘ఇది నీదేనా?’’ ‘‘అవును సార్.’’ ‘‘చదివే సంతకం చేశావా?’’ ‘‘అవును సార్.’’ ‘‘ఇందులో రాసినట్లుగానే నువ్వు దొంగతనం చేశావా?’’ ‘‘అవును సార్.’’ వెంటనే జైలర్ పకపక నవ్వి చెప్పాడు. ‘‘దురదృష్టవంతుడివి. సరే. ఇక నించి నువ్వు మా విశ్రాంతి గృహంలో అతిథివి. వెల్కం.’’ ‘‘థాంక్ యు సార్. జైల్లో విశ్రాంతి గృహాలు కూడా ఉంటాయా సర్?’’ కపీష్ ఆనందంగా అడిగాడు. ‘‘అంటే రిమాండ్ ఖైదీవి అని అర్థ్ధం’’ ిసీఐ నవ్వుతూ చెప్పాడు. జైలర్ రికార్డ్ కోసం అతని రిలేషన్షిప్ స్టేటస్ అడిగి తెలుసుకున్నాడు. ‘‘సింగిల్?’’ ‘‘కాదు సార్.’’ ‘‘ఇన్ రిలేషన్షిప్?’’ ‘‘కాదు సార్.’’ ‘‘ఎంగేజ్డ్?’’ ‘‘కాదు సార్.’’ ‘‘మేరీడ్?’’ ‘‘కాదు సార్.’’ ‘‘డైవోర్స్డ్?’’ జాలిగా చూస్తూ అడిగాడు. ‘‘కాదు సార్.’’ ‘‘ఐతే విడోయర్వి అన్నమాట.’’ ‘‘కాదు సార్.’’ ‘‘ఇవేమీ కాదా? ప్రపంచంలో ఎక్కడా అలా ఉండదే?’’ ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘వెయిటింగ్ ఫరే మిరకిల్ అని రాసి టిక్ చేయండి’’ కపీష్ చెప్పాడు. అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ తీసుకుని, రిజిస్టర్లో వాటి వివరాలు రాసుకున్నాక అతన్ని సెల్‌కి పంపబోయే ముందు జైలర్ అతనికి ఓ బ్రోచర్‌ని ఇచ్చి అడిగాడు. ‘‘నువ్వు చేసిన దొంగతనం గురించి నీ మాటల్లో చెప్పు. వింటాను.’’ ఎస్సై ఉద్యోగం రాకపోవడంతో ఇక హైద్రాబాద్‌లో అతనికి పనేం లేదు. పొలాన్ని తాకట్టు పెట్టి చదివించిన అతని తల్లితండ్రులు కపీష్ ఉద్యోగం చేస్తూ జీతంతో పొలం అప్పుని తీర్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాడని కలలు కంటున్నారు. దాంతో ఇంటికి వెళ్ళడం అవమానంగా తోచింది. చివరికి కపీష్ దొంగతనం చేయదలచుకున్నాడు. ఐతే ఏ కారో, బంగారు నగలో దొంగతనం చేసినా వాటిని ఎవరు కొంటారో తెలీదు కాబట్టి కేషే కొట్టేయదలచుకున్నాడు. కేష్ ఉండేది బ్యాంకులోనే అని అతనికి తెలుసు. కపీష్ ఊరి శివార్లలోని బేంకులని పరిశీలించాడు. చివరకి ఆట్టే రద్దీ ఉండని నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ బేంక్‌ని ఎన్నుకున్నాడు. ఆఫీన్ ఎకౌంట్స్ తప్ప అక్కడ వ్యక్తిగత అకౌంట్స్ తక్కువ కాబట్టి రద్దీ ఉండదు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట నించి ఒకటిన్నర దాకా అసలు రద్దీ లేకపోవడం గమనించాడు. తన పథక రచనలో భాగంగా గాజు సీసాలో నీళ్ళని పోసి అందులో చిటికెడు పసుపుని కలిపి బాగా కదిపాడు. బేంక్ సమీపంలోని తాళం వేసిన ఓ ఇంటి ఆవరణలో ఉన్న తాళం లేని ఏక్టివా బండిని దొంగిలించాడు. అది దొంగతనం చేశాక పారిపోవడానికి! ఒకటి ముప్పావుకి ముందు తలుపు మూసేశాక వెనక తలుపులోంచి బేంక్‌లోకి వెళ్ళాడు. అక్కడ కేష్ కౌంటర్లో కూర్చుని డబ్బు లెక్క చూసుకుంటోందో అమ్మాయి. కౌంటర్లోని డిపాజిట్ స్లిప్ మీద తెలుగులో రాశాడు. మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com