ఫ్రాస్ట్ బైట్ | Malladi Venkata Krishnamurthy Crime Stories | Sakshi
Sakshi News home page

ఫ్రాస్ట్ బైట్

Published Sun, Feb 7 2016 1:23 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

ఫ్రాస్ట్ బైట్ - Sakshi

ఫ్రాస్ట్ బైట్

  మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  32
 పక్కింటివాళ్లు పోలీసులకి ఫోన్ చేసి జూలీ బాత్‌రూం కిటికీలోంచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేశారు. పోలీసులకి జూలీ శవం... నీళ్లు నిండిన బాత్ టబ్‌లో కనిపించింది. రక్తం కలిసి నీరంతా ఎర్రగా అయ్యింది. డాక్టర్ శవాన్ని పరిశీలించి... ‘‘తలకైన గాయం వల్ల స్పృహ తప్పి ఉంటుంది. తర్వాత తొట్టిలో పడి నీళ్లల్లో మునిగి మరణించింది. పోస్ట్‌మార్టంలో ఆ విషయం నిర్ధారణ కావచ్చు’’ అన్నాడు.
 
 ‘‘మరణించి ఎంత కాలం అయ్యింది?’’... లెఫ్టినెంట్ ఫ్రాంక్ ప్రశ్నించాడు.
 ‘‘బహుశ క్రితం ఆదివారం మరణించి ఉండొచ్చు. లేదా శనివారం. ఆమె ఇటీవల మంచుపడే ప్రాంతానికి వెళ్లి వచ్చిందనుకుంటున్నాను.’’
 
 ‘‘ఎలా చెప్పగలరు?’’
 ‘‘తన కాళ్లు, చేతులకి ఫ్రాస్ట్‌బైట్ (మంచు కొరకడం) గుర్తులున్నాయి.’’
 శవాన్ని మార్చురీకి తరలించాక ఫ్రాంక్, అతని సహాయకుడు చుట్టుపక్కల వారిని జూలీ గురించి ప్రశ్నించారు.
 
 ‘‘ఆమె బాగా ధనవంతురాలు. ఏడాదిన్నర క్రితం నీల్‌తో పెళ్లయింది. ఆమెని డబ్బుకోసం చేసుకుని ఉంటాడు. ఎందుకంటే జూలీ కురూపి’’ పక్కింటి అతను చెప్పాడు. ‘‘గత రెండు వారాలుగా జూలీ ఊరు వదిలి ఎక్కడికీ వెళ్లలేదు’’ ఎదురింటివారు చెప్పారు.‘‘ఈ ఊళ్లో మంచు పడదు. మరి ఫ్రాస్ట్‌బైట్ ఎలా వచ్చింది?’’... ఫ్రాంక్  ప్రశ్నించాడు. ‘‘ఏమో మరి?’’ అన్నారు. నీల్ నాలుగు రోజుల క్రితం గోల్ఫ్ ఆడటానికి కాలిఫోర్నియాకి వెళ్లాడని కూడా జూలీ మిత్రుల ద్వారా ఫ్రాంక్‌కి తెలిసింది.మర్నాడు జూలీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందింది. తలకైన గాయం వల్ల స్పృహ తప్పింది. నీళ్లల్లో మునిగి మరణించింది. శనివారం మధ్యాహ్నం రెండున్నర నుంచి ఆరున్నర మధ్య మరణం సంభవించిందని డాక్టర్ నిర్ధారించాడు. మర్నాడు టీవీ న్యూస్ ద్వారా భార్య మరణం గురించి తెలుసుకున్న నీల్ ఫీనిక్స్‌కి తిరిగి వచ్చాడు. అప్పటికే పోలీసులు వారి ఇంట్లో అన్ని గదుల్లోని వేలిముద్రలూ తీసుకున్నారు.
 
 ఏ భార్య మరణించినా పోలీసుల అనుమానం మొదట భర్త మీదకే వెళ్తుంది. శనివారం అతను ఎక్కడ ఉన్నాడో ఎలిబీని పరిశీలించారు. ఆ ఉదయం ఆరున్నరకి అతను కార్లో కాలిఫోర్నియాకి బయలు దేరాడని దారిలో అతను కొన్న పెట్రోల్ బిల్స్‌ని బట్టి తెలిసింది. పెట్రోల్ బంక్స్ లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తే అతను చెప్పింది నిజమని తెలిసింది. శనివారం మధ్యాహ్నం రెండున్నరకి హత్య జరిగిన ప్రదేశానికి మూడు వందల ఏభై మైళ్ల దూరంలో ఉన్నాడు. దారిలో రెండు చోట్ల ఆగి కాఫీ తాగాడు. ఓ చోట లంచ్ తిన్నాడు. రెస్టారెంట్స్‌లోని సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ నీల్ కనిపించాడు.
 పోలీసుల విచారణలో జూలీకి శత్రువులు లేరని తెలిసింది. దొంగలు వచ్చారేమో అనే థియరీ కూడా నిలబడ లేదు. ఇంటి తలుపులన్నీ మూసి లోపల నించి బోల్ట్‌లు పెట్టి ఉన్నాయి. కిటికీ తలుపులు కూడా వేసినవి వేసినట్లుగానే ఉన్నాయి. పైగా వస్తువులేం పోలేదని నీల్ చెప్పాడు. శవం నీళ్ల టబ్‌లో తేలుతోంది. దొంగ వచ్చి చంపే అవకాశం లేదు.
 
 అయితే పోస్ట్‌మార్టంలో తను ఎర్ర ఇంకుతో అండర్‌లైన్ చేసిన ఓ వాక్యం మాత్రం లెఫ్టినెంట్ ఫ్రాంక్‌ని బాధించ సాగింది... ఫ్రాస్ట్‌బైట్ కనిపించడం. అసలు మంచు ప్రాంతాలకి వెళ్లని జూలీకి ఆ ఫ్రాస్ట్‌బైట్ ఎలా ఏర్పడింది? ‘‘ఫ్రాస్ట్‌బైట్ మంచు వల్ల కాక మరే విధంగానైనా కలిగే అవకాశం ఉందా?’’ డాక్టర్‌ని అడిగాడు ఫ్రాంక్. ‘‘లేదు. ఆమె శరీరం మంచులో ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ అవడం వల్లే కలిగింది’’ డాక్టర్ చెప్పాడు.
 
 ‘‘ఎడారి మధ్య ఉన్న ఫీనిక్స్‌లో మంచు ఎక్కడ నించి వచ్చింది?’’... డాక్టర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు. నీల్ సెల్‌ఫోన్ కాల్స్‌ని ఫ్రాంక్  పరిశీలించాడు. జూలీ మరణానికి నెల ముందు నుంచీ ఎలాంటి అనుమానం కలిగించే కాల్స్ వెళ్లలేదు. అతని క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లోని వివరాలని కూడా పరిశీలించాడు. వాటిలో కూడా అనుమానించేవి ఏవీ కనపడలేదు. మిత్రులని ప్రశ్నించాడు. ఎలాంటి కొత్త సమాచారం తెలీలేదు. కానీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి ఫ్రాంక్‌తో డాక్టర్ చెప్పాడు... ‘‘జూలీ కేసులో నాకో అనుమానం స్ఫురించింది. భర్త హంతకుడు కావొచ్చు.’’
 
 ‘‘ఎలా చెప్పగలరు?’’
 ఎలాగో ఆయన వివరించాడు. ‘‘థ్యాంక్స్ డాక్టర్. హంతకుడ్ని వెదకడానికి నాకో దారిని చూపించారు’’ అన్నాడు ఫ్రాంక్. ‘‘నీల్! నీ భార్యని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను’’... ఫ్రాంక్ ఆ రాత్రి నీల్ పేకాడే క్లబ్‌కి వెళ్లి పక్కకి పిలిచి చెప్పాడు.
 ‘‘మీకు పిచ్చా?’’ నీల్ నివ్వెరపోతూ అడిగాడు.
 
 ‘‘తగిన ఋజువులతోనే వచ్చాను.’’
 ‘‘ఏంటా ఋజువులు?’’ నీల్ ప్రశ్నించాడు.
 ‘‘నీ భార్య మరణించినప్పుడు నీకు ఎలిబీ లేదు. శుక్రవారం మధ్యాహ్నం ఎక్కడున్నావు?’’
 ‘‘హత్య జరిగింది శనివారం మధ్యాహ్నం.’’
 ‘‘అలా అనుకోవాలనే నువ్వు ఆడిన నాటకం బయటపడింది.’’
 ‘‘నాటకమా?’’ తడబడ్డాడు.
 
 ‘‘అవును. శుక్రవారం మధ్యాహ్నం నువ్వు నీ భార్య తలని పంపుకి కొట్టి, స్పృహ తప్పిన ఆమెని బాత్‌టబ్‌లోకి తోశావు. పది నిమిషాల తర్వాత మళ్లీ వెళ్లి ఆమె మరణించిందా లేదా అని తనిఖీ చేసి ఉంటావు. తర్వాత శవాన్ని చల్లగా ఉంచడానికి ఐస్‌ని బాత్‌టబ్‌లో నింపావు. నువ్వు శనివారం ఉదయం ఇంటి నించి బయలుదేరేదాకా ఆ టబ్‌లో ఐస్‌ని నింపు తూనే ఉన్నావు. తద్వారా జూలీ తర్వాత మరణించిందని పోలీస్ డాక్టర్‌ని తప్పుదోవ పట్టించడంలో సఫలం చెందావు. నువ్వు ఇల్లు వదిలాక జూలీ మరణించిందనే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వల్ల నీకు ఎలిబీ ఉంటుంది.’’
 
 ‘‘అది అబద్ధం.’’
 ‘‘నువ్వు వాల్‌మార్ట్‌లో ఐస్ బ్యాగ్స్‌ని కొనే సీసీ టీవీ ఫుటేజ్‌ని మావాళ్లు సంపాదించారు. శుక్రవారం ఉదయం పదకొండూ నలభై రెండు నించి ఆరుసార్లు ఎందుకు ఐస్ కొన్నట్లు?’’‘‘మీకా అనుమానం ఎలా వచ్చింది?’’ పాలిపోయిన మొహంతో నీల్ అడిగాడు. ‘‘ఫ్రాస్ట్‌బైట్ గురించి నీకు తెలీదు కనుక.’’
 ఫ్రాంక్ అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించాడు.
 (మేక్సైన్ ఓ కలన్ కథకి స్వేచ్ఛానువాదం)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement