malpractice
-
ప్రాణం తీసిన ‘డీబార్’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఓ విద్యార్థిని డీబార్ చేయడం.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం అచ్చంపేటకు చెందిన పూజారి ఆంజనేయులు (18) మక్తల్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరికల్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో మంగళవారం మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరైన ఆంజనేయులు.. చూచిరాతలకు పాల్పడుతున్నాడని స్క్వాడ్ అఽధికారులు డీబార్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. స్వగ్రామానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ విచారణకు ఆదేశించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్‌కుమార్, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పొలిటికల్ సైన్స్ హెచ్ఓడీ కుమారస్వామితో తనిఖీలు చేపట్టారు. త్వరలో విచారణకు సంబంధించిన నివేదికను పీయూ వీసీకి అందించనున్నారు. ఎగ్జామినర్ సస్పెన్షన్.. విద్యార్థి పరీక్ష రాసిన కేంద్రం ఎగ్జామినర్‌ను సస్పెన్షన్ చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్స్‌కు నోటీసులు ఇస్తున్నట్లు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటనలో పేర్కొన్నారు. సదరు విద్యార్థి చీటీలు పరీక్ష కేంద్రంలోకి తీసుకొచ్చే క్రమంలో అధికారులు ఏం చేశారనే అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారు విధులు సరిగ్గా నిర్వహించకపోవడంతోనే విద్యార్థి పరీక్ష కేంద్రంలోకి చీటీలు తీసుకొచ్చి రాస్తూ పీయూ నుంచి వెళ్లిన స్క్వాడ్ అధికారులకు దొరికిపోయినట్లు తెలిసింది. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి.. విద్యార్థి ఆంజనేయులు కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజకు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా పీయూ జేఏసీ చైర్మన్ బత్తిని రాము మాట్లాడుతూ స్క్వాడ్ అధికారులు తీసుకునే చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, విద్యార్థులను ఇష్టారీతిగా డీబార్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్ష కేంద్రం మార్చాలని ఆందోళన.. మరికల్: మరికల్లో ఏర్పాటు చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష కేంద్రాన్ని మార్చాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పీయూ ఏఎస్డీ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్డీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు పరీక్ష కేంద్రాన్ని మార్చడం కుదరదని, వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి పరీక్ష కేంద్రాన్ని మార్చే ఆలోచన చేస్తామని తెలిపారు. పరీక్ష తప్పితే మరో ఏడాది రాసుకునేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులెవరూ ప్రాణాలను తీసుకోరాదని సూచించారు. నోటీసులు ఇస్తాం... మరికల్ పరీక్ష కేంద్రంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం. సంబంధిత పరీక్ష కేంద్రంలోని ఎగ్జామినర్, సీఎస్‌లకు నోటీసులకు ఇవ్వనున్నం. భవిష్యత్‌లో వారికి పరీక్షల విధులు కేటాయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజ్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పీయూ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి విద్యార్థిని డీబార్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ విషయంపై వీసీతో పాటు అదికారులకు ఫిర్యాదు చేశాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – బత్తిని రాము, పీయూ జేఏసీ చైర్మన్ -
టెన్త్ రిజల్ట్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’.. ఫలితం ప్రకటించాలని విద్యార్థి వేడుకోలు
సాక్షి, హనుమకొండ: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచి్చన ఘటనలో కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి దండబోయిన హరీశ్ ఫలితంలో ‘మాల్‌ప్రాక్టీస్’అని వచి్చంది. ఏప్రిల్ 4న కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం ఔటైన ఘటనకు బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యా ర్థి హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేశారు. దీంతో అతను ఇంగ్లిష్, గణితం పరీక్షలు రాయలేకపోయాడు. అతడి తరఫున ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలుచేయగా మిగిలిన పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతిచి్చంది. దీంతో హరీశ్ సామాన్య, సాంఘికశాస్త్రం పరీక్షలు రాశాడు. అయితే, బుధవారం వెలువరించిన ఫలితాల్లో హరీశ్ రిజల్ట్స్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’అని ఉంది. తన ప్రమేయం లేకున్నా బలి చేశారని, తన ఫలితం ప్రకటించి న్యాయం చేయాలని హరీశ్ అధికారులను వేడుకుంటున్నాడు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పేపర్ల పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలను ఆరు పేపర్లతో నిర్వహించారు. ప్రథమ భాష (పేపర్–1), ద్వితీయ భాష, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2, వొకేషనల్ కోర్సుల పేపర్లతో టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను కూడా ముగించి ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేయనున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లీకులు, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించింది. పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్నపత్రాలకు బార్ కోడింగ్ పెట్టింది. దీంతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాపీయింగ్‌కు కూడా అడ్డుకట్ట పడింది. ఈ ఆరు రోజుల పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా 5 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ‘నారాయణ’ అక్రమాలు గతేడాది కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని పెంచుకొనేందుకు అత్యధిక పాస్ పర్సంటేజీ, మార్కుల కోసం ప్రశ్నపత్రాల లీకులకు తెగబడ్డాయి. టీడీపీ పెద్దలతో అనుబంధమున్న ‘నారాయణ’ విద్యా సంస్థ దీనికి తెరతీసింది. తమ సంస్థల్లోని పిల్లలతో కాపీయింగ్ చేయించేలా, అదే తరుణంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేలా వ్యవహారాన్ని నడిపించింది. కొందరు ప్రభుత్వ టీచర్లనూ మభ్యపెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికి తోడయ్యారు. లీకులతో, సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారంతో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలతో సంబంధమున్న పలువురు నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. 74 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాలకు ప్రధాన కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. ఈసారి పకడ్బందీ చర్యలు ఈసారి పరీక్షల్లో చిన్న ఘటనలకు కూడా తావివ్వకూడదన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యా శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందినే భాగస్వామ్యం చేసింది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇన్విజిలేటర్లు కాకుండా ఇతర సిబ్బంది ఆయా సంస్థల వారే ఉండేవారు. దీనివల్ల అక్రమాలకు ఎక్కువ ఆస్కారముండేది. ఈసారి దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ మొత్తం ప్రభుత్వ సిబ్బందినే నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తరలింపు, రూట్ ఆఫీసర్ల నియామకం, పరీక్ష కేంద్రాలకు మెటీరియల్ పంపిణీలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. లీక్, ఫేక్ లకు ఆస్కారం లేకుండా తీసుకున్న చర్యలివీ.. ♦ లీకులకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో ఫోన్లను అనుమతించలేదు. స్మార్ట్, డిజిటల్ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్ వంటి ఎల్రక్టానిక్ పరికరాలనూ నిషేధించారు. ♦ ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలకు ఎంపికచేశారు. ♦ టీచర్లకు వారి స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాల్లో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. ♦ విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ సహా ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో సీల్ వేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. ♦ ప్రతి ప్రశ్నపత్రానికి బార్‌కోడింగ్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్‌ను సూపర్ ఇంపోజ్ చేయించారు. దీనివల్ల ప్రశ్నపత్రం బయటకు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. ♦ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను అందించిన వెంటనే విద్యార్థులతో వాటిలోని అన్ని పేజీలపై రోల్ నంబర్, సెంటర్ నంబర్‌ను రాయించారు. ♦ విద్యార్థుల ఓఎమ్మార్ పత్రాలపైనా ఈసారి బార్ కోడింగ్ ఇచ్చారు ♦ సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర విభాగాల సీనియర్ అధికారులను, ఇతర సిబ్బందిని కూడా పరీక్షల్లో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎస్పీల ఆధ్వర్యంలో పని చేశాయి. ♦ పరీక్ష కేంద్రాల్లోకి నిర్ణీత సమయంలో అనుమతించడమే కాకుండా పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు, సిబ్బంది బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. -
తప్పుగా నింపాడని ఓఎంఆర్ షీట్ మింగేశాడు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థి ఓఎంఆర్ షీట్లో తప్పులు నింపాడని ఏకంగా ఆ షీట్నే నమిలి మింగేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలం బోర్గాం(పి) పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓ పరీక్షాకేంద్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పరీక్షకు నిర్మల్ జిల్లాకు చెందిన సహకార శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్న అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి హాజరయ్యాడు. పరీక్షరాసే క్రమంలో అతడు ఓఎంఆర్ షీట్‌ను తప్పుగా నింపడంతో దానిని చింపి మింగేశాడు. తన బెంచీలో గైర్హాజరైన అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను తీసుకుని అందులో సమాధానాలు బబ్లింగ్‌చేశాడు. కొంతసేపటికి ఇన్విజిలేటర్ పరీక్షకు హాజరుకాని ఏడుగురు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కలెక్ట్ చేస్తుండగా...ఒకటి తక్కువ వస్తోంది. దీంతో అబ్దుల్ ముఖీద్ పక్కన ఉండాల్సిన ఓఎంఆర్ షీట్ గురించి ఆరా తీశారు. అయితే తనకేం తెలియదని ముందు బుకాయించగా..సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనలో ఇతగాడి వ్యవహారం అంతా రికార్డు కావడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా..ఆర్డీవో వచ్చి పరిశీలించారు. అనంతరం నాల్గవ టౌన్లో అబ్దుల్పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. -
మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం.. 22 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వీరిలో చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయడంతో ఇద్దరు సీఆర్పీలు, పది మంది ఉపాధ్యాయులు, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉంటే సస్పెండ్‌కు గురవుతారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సుధాకర్ గుప్త(పెట్నికోట), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, కస్టోడియన్ రాఘవయ్య (తిమ్మనాయినపేట), ఉపాధ్యాయులు నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదన్‌రావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె), చిన్నదస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్ తుమ్మలపెంట), ఆర్యభట్ట (అబ్దుల్లాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), ఇన్విజిలేటర్లు హరినారాయణ (తుమ్మలపెంట), శివప్రసాద్ (అంకిరెడ్డిపల్లె), వీరేష్(తుమ్మలపెంట), శ్రీనివాసరెడ్డి (మదనంతపురం), మదన్మోహన్(తుమ్మలపెంట), విమల్‌తేజ (అంకిరెడ్డిపల్లె), రవీంద్రగుప్త (అంకిరెడ్డిపల్లె యుటీసీఎల్), రాజశేఖరరెడ్డి (అంకిరెడ్డిపల్లె), వెంకటసుబ్బారెడ్డి (తుమ్మలపెంట యుటీసీఎల్) ఉన్నారు. ఇద్దరు సీఆర్పీలు (ఔట్సోర్సింగ్) రాజేష్, మద్దిలేటిల సర్వీస్ రెన్యువల్ చేయక పోవడంతో వారిద్దరినీ విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్ -
జామర్ల నిబంధనలను పాటించాల్సిందే: యూజీసీ
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. -
23 మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): శనివారం జరిగిన రెండో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 23 విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. నందికొట్కూరు వైష్ణవి కళాశాలలో ఇద్దరు, కర్నూలు డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోవెలకుంట్ల ఎస్.వి డిగ్రీ కళాశాల సెంటర్లో ముగ్గురు, ఎమ్మిగనూరు రావూస్ కళాశాల సెంటర్లో ఇద్దరు, వైష్ణవి డిగ్రీ కళాశాల సెంటర్లో ఒకరు, కోడుమూరు సాయిరాం సెంటర్లో 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో రెండు రోజులుగా మొత్తం 31 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విద్యార్థుల పరీక్ష పేపర్లను తనిఖీ చేసి ప్రత్యేక కమిటీ నిర్ణయం ద్వారా ఒకటి లేదా రెండుసార్లు పరీక్షలకు అనుమతించకుండా చేసే అవకాశాలున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ బి.అమర్నాథ్ తెలిపారు. -
తండ్రికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు..
ఇల్లెందు(ఖమ్మం): తండ్రికి బదులు కుమారుడు పరీక్ష రాస్తూ పట్టుబడిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లెందులో వెలుగుచూసింది. వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి భవిష్యత్తులో పదోన్నతి పొందాలనే ఉద్దేశంతో ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయలని నిర్ణయించుకున్నాడు. కానీ పాఠ్యపుస్తకాలు చదవలేక తన బదులు కొడుకుతో పరీక్ష రాయించాడు. ఇది గుర్తించిన అధికారులు కొడుకుపై మాల్‌ప్రాక్టీస్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించారు. గూండాల మండలం ముత్సాపురం గ్రామానికి చెందిన ఎం.జాన్ ఖమ్మంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత సాధించకపోవడంతో ప్రస్తుతం ఓపెన్ టెన్త్ ద్వారా విద్యార్హతను పెంచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తాను పరీక్షలు రాస్తే.. ఫెయిల్ కావడం ఖయమని నిర్ణయించుకొని తన బదులు డిగ్రీ పూర్తి చేసిన తన కొడుకును పరీక్షకు పంపాడు. ఇది గుర్తించిన ఎగ్జామినర్ పై అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అతనిని పరీక్ష నుంచి బహిష్కరించి పోలీసులకు అప్పగించారు. -
పోలీసులకు చిక్కిన మాల్ ప్రాక్టీస్ ముఠా
-
పోలీసులకు చిక్కిన మాల్ ప్రాక్టీస్ ముఠా
హైదరాబాద్: మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న కొంతమంది ముఠా సభ్యులను శనివారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూరవిద్య ద్వారా నాగార్జున యూనివర్శిటీ నిర్వహిస్తున్న పరీక్షల్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించి పలు కళాశాలల యజమానులు, ప్రిన్సిపాల్, కో ఆర్డినేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న వారిలో అధికశాతం మంది పదోన్నతి కోసం వేరొకరితో పరీక్ష రాయిస్తున్నట్లు తెలుస్తోంది.