అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న ‘అన్నీ మంచి శకునములే’
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ నిర్మాణంలో మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 18న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఓటీటీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
(చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!)
జూన్17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోలో స్క్రీమింగ్ అవుతున్న అన్ని చిత్రాల్లో తమ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో నిచిలినట్లు చిత్రబృందం పేర్కొంది. అమెజాన్ ప్రైమ్‌లో రికార్డు అవర్స్ స్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా అన్నీ మంచి శకునములే నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
'అన్నీ మంచి శకునములే' కథేంటంటే..
ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది.
మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ.