ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి
రొహతక్: హరియాణాలో మహిళలపై దారుణాలు ఆగడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పూర్వికుల గ్రామంలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం సంచలనం రేపింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ప్రఖ్యాత హరియాణావి గాయకురాలు మమతా శర్మ రొహతక్ జిల్లా బాలియాని గ్రామంలో శవమై కనిపించారు.
జనవరి 14న గొహనాలో కార్యక్రమం ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తర్వాత కనిపించకుండా పోయారు. బాలియాని గ్రామంలోని పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె గొంతు కోసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. కల్‌నౌర్ ప్రాంతవాసి అయిన మమత ప్రముఖ హరియాణావి గాయకురాలిగా సుపరిచితులు. భజన పాటలు పాడటంలో ఆమె పేరుగాంచారు.
గత ఐదు రోజుల్లో ఆరు రేప్ కేసులు, గ్యాంగ్ రేప్ చోటు చేసుకోవడంతో హరియాణా పేరు జాతీయస్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచింది. మహిళలపై అఘాయిత్యాలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.