సాగర్‌ను మండల కేంద్రం చేయాలి
నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లుతున్న నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మాచర్ల–హైదరాబాద్ రహదారిపై పైలాన్‌కాలనీ పోలీస్ పరేడ్‌గ్రౌండ్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాగర్‌కు అంతర్జాతీయంగా పేరున్నప్పటికీ 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నీరు, విద్యుత్, రహదారులు, భూమి అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎలాంటి పురోగతికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా సాగర్ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే నిరాశే మిగిలిందన్నారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
కార్యాచరణ
ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అఖిలపక్ష నాయకులు కార్యచరణ ప్రకటించారు. సోమవారం చలో కలెక్టరేట్(నల్లగొండ), మంగళవారం రోడ్డుపై వంటవార్పు, బుధవారం మానవహారం, గురువారం సాగర్ బంద్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రజలతో పాటు తునికినూతల, చింతలపాలెం, నెల్లికల్లు గ్రామపంచాయతీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. హీరాకార్ రమేశ్‌జీ, కున్రెడ్డి నాగిరెడ్డి, చంద్రమౌళినాయక్, సయ్యద్‌గౌస్, బషీర్, జంగయ్య, వేణు, హచ్చునాయక్, ధర్మానాయక్, మునినాయక్, చిన్నరామయ్య, కంచర్లసుధీర్, కాటుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.