ఏం.. తమాషా చేస్తున్నారా?
రాంబిల్లి: సమాచార హక్కు చట్టం సదస్సు వాయిదా వేసుకోవాలని తనకే హద్దులు నిర్ణయిస్తారా? ఏం తమాషాగా ఉందా? అంటూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి శనివారం మండల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక స్త్రీశక్తి భవనంలో శనివారం ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు గైర్హాజరయ్యారు. దీంతోపాటు మండలంలో సమాచార హక్కు చట్టాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని పలువురు ఫిర్యాదు చేయడంతో తాంతియకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని, రాంబిల్లిలో ఈ అవగాహన సదస్సు అవసరం లేదని మండల పరిషత్ అధికారులు చెప్పినట్లు స.హ. చట్టం రక్షణ వేదిక ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కాండ్రేగుల వెంకటరమణ సమావేశంలో మాట్లాడంతో తాంతియకుమారి అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు.
రాంబిల్లిలో సమావేశాలు వద్దని అనడానికి మీరెవరు.. ఏం.. తమాషాలు చేస్తున్నారా.. ఇకపై కార్యాలయాలను తనిఖీ చేస్తా.. సమాచార హక్కు కింద తగిన సమాచారం అందజేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. అయితే మండల పరిషత్ అధికారులెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం చివరిలో మండల పరిషత్ సూపరింటెండెంట్ డేవిడ్ బెరఖ్యా హాజరయ్యారు. దీంతో కమిషనర్ ఆయనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. జన్మభూమి కార్యక్రమానికి ఎంపీడీవో , తహశీల్దారు వెళ్లారని ఆయన వివరణ ఇచ్చారు. అనంత రం తాంతియకుమారి విలేకరులతో మాట్లాడుతూ కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వాల్సిందేనన్నారు. రాంబిల్లి సర్పంచ్ పిన్నంరాజు రాధా సుందర సుబ్బరాజు(కిషోర్), ఎన్వైకే జిల్లా సమన్వయకర్త బి. అప్పారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
అధికారుల్లో టెన్షన్.. టెన్షన్
ఇదిలా ఉంటే తాంతియకుమారి పర్యటనతో జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా మర్రిపాలెం, మురకాడ గ్రామాల్లో ఉన్న పలువురు అధికారులు ఉలిక్కిపడ్డారు. సమావేశంలో అధికారులు, అనుచరులకు ఫోన్ చేసి ఆమె పర్యటనపై ఆరా తీశారు.