రహదారులకు నిధుల వరద
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యే క దృష్టి సారించిన రాష్ట్ర సర్కారు జిల్లాలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారుల విస్తరణ, మరమ్మతుల కోసం రూ.కోట్లలో నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతులిచ్చింది. తెలంగాణలోనే అత్యధిక నిధులు ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు కావడం గమనార్హం. రానున్న మూడేళ్లలో మొత్తం రూ.1,230.32 కోట్లను జిల్లాలోని రహదారుల అభివృద్ధికి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఇటీవల మూడు ఉత్తర్వులు (జీవో నెం.129, 130, 131) జారీ అయ్యాయి. ఈ నిధులతో మూడు రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కేవలం రహదారులే కాదు, వాటిపై ఉన్న బ్రిడ్జీల నిర్మాణం, అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసమూ నిధులు కేటాయించింది. భౌగోళికంగా జిల్లా ఎక్కువ విస్తీర్ణంలో ఉండడం, రహదారుల పొడవు అత్యధికంగా ఉండటంతో రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా కొన్ని దశాబ్దాల కాలంగా జిల్లాలోని రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. పాలకుల నిర్లక్ష్యంతో వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈసారి ఆదిలాబాద్ జిల్లా రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేయడం గమనార్హం.
మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న రహదారులను రెండు లైన్ల రహదారులుగా విస్తరిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధానించే రహదారులు 21 ఉన్నాయి. ఇవి ప్రస్తుతం సింగల్ లేన్ రహదారులు. వీటిని రెండు లైన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.514.30 కోట్లు అవసరమని ఆర్అండ్బీ అధికారులు గతంలో ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరి రహదారుల కోసం రూ.2,585 కోట్లు మంజూరైతే, ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే ఇంత మొత్తంలో నిధులు రావడం గమనార్హం.
రెండు లేన్లుగా విస్తరణ..
ఈ శాఖ పరిధిలోని 18 సింగిల్ లేన్ రహదారులను డబుల్ లేన్లుగా మార్చేందుకు కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయి. 22 మండలాల పరిధిలో 18 రహదారులకు రూ.284.77 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల విస్తరణకు రూ.3,704.32 కోట్లు మంజూరు చేసింది.
బ్రిడ్జీల నిర్మాణానికి కూడా..
కేవలం రహదారులే కాదు, వాటిపై ఉండే బ్రిడ్జీల నిర్మాణానికి కూడా పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,974 కోట్లను కేటాయించిన సర్కారు, ఇందులో జిల్లాలోని బ్రిడ్జీలకు రూ.431.25 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అవసరమైన చోట నూతన బ్రిడ్జీల నిర్మాణాలు చేపడతారు. శిథిలావస్థలో ఉన్న వంతెనలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తారు. చిన్న బ్రిడ్జీలను రెండు లేన్ల రహదారులకు సరిపడా వెడల్లుగా నిర్మిస్తారు.
పర్యవేక్షక ఇంజినీర్‌గా రాజిరెడ్డి నియామకం
రూ.కోట్లలో అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సర్కారు జిల్లాలో ఏడాదిగా ఖాళీగా ఉన్న ఆర్అండ్బీ పర్యవేక్షక ఇంజినీర్ పోస్టును కూడా భర్తీ చేసింది. ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న జి.రాజిరెడ్డిని ఆదిలాబాద్ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్‌గా నియమించింది. ఇటీవలే ఆయన ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులపై డీపీఆర్‌ను రూపొందిస్తున్నామని, సాంకేతిక అనుమతి వచ్చిన వెంటనే ఈ పనులకు టెండర్లు పిలుస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు.