ప్రపంచీకరణతో మాతృభాషలకు ముప్పు
మండలి బుద్ధప్రసాద్
నిరాశజనకంగా ప్రాచీన హోదా ఫలితాలు
పిలుపులకే పరిమితమవుతున్న పోరాటాలు
చిత్తశుద్ధి లేకపోతే అమ్మభాష కనుమరుగు
బెంగళూరు (బనశంకరి) : ప్రపంచీకరణతో మా తృభాషలకు పెనుముప్పు పొంచిఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఐక్యరా జ్య సమితి సైతం హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. బెంగళూరు యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘దక్షిణాది రాష్ట్రాల భా షా సాహిత్యం - తులనాత్మక పరి శీలన’ అనే అంశంపై స్థానిక జ్ఞాన జ్యోతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు, కన్నడం, తమిళం, మళయాలం భాషలు చాలా ప్రాచీణమైనవని తెలిపారు. తెలుగు, కన్నడ భాషలకు అవినాభావ సంబంధముందని అన్నారు. ప్రస్తుత సమాజంలో నాలుగు భాష మనుగడ గురించి ఆలోంచాల్సిన అవసరముందని అన్నారు. ఆంగ్లంతో పాటు మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాతృభాషలకు ముప్పు వాటిల్లుతున్న తరుణంలో అందరూ సమైక్యంగా ఎదుర్కొవాలని పిలుపునిస్తున్నారని, అయితే ఆచరణలో విఫలమవుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధితో ఏకతాటిపై పోరాటం సాగిస్తే తప్పా మాతృభాషను కాపాడుకోలేమని అన్నారు. పోరాటాలతోనే కన్నడ, తెలుగు భాషలకు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా లభించాయని గుర్తు చేశారు.
అయితే హోదా ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ద్రావిడ యూనివర్సిటీని స్థాపించి దాని పటిష్టతకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వర్సిటీని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దక్షిణాది నాలుగు భాషలను గూగుల్ సాయంతో ఇంటర్నెట్లో ప్రవేశపెట్టే ఆలోచన చేయాలన్నారు. ఆచార్య సిద్దలింగయ్య మాట్లాడుతూ.... నాలుగు బాషలపై తులనాత్మక అధ్యయనం చేయడం హర్షణీయమని అన్నారు. తెలుగు, కన్నడను ఏకలిపిగా చేయాలని ఈ సందర్బంగా ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాలకు సాహితీవేత్తలు మనవి చేయాలని కోరారు. అనంతరం సామాజిక విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ కర్ణాటక అంటే గుర్తుకు వచ్చేది వీరశైవం, పంప మహాకవి అని అన్నారు. కల్బుర్గి లాంటి సాహితీవేత్తను హత్యచేయడం విషాదకరమన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సుదీర్ఘచరిత్ర ఉందని వీటిని కాపాడుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. అనంతరం ‘దక్షిణాది రాష్ట్రాల భాషాసాహిత్యం - తులనాత్మక పరిశీలన’ సావనీర్‌ను ఆవిష్కరించారు. సాహితీ వేత్త తంగిరాలసుబ్బారావును మండలిబుద్దప్రసాద్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బెంగళూరు యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ బి.తిమ్మేగౌడ, సెమినార్ డెరైక్టర్ ఆచార్య కె.ఆశాజ్యోతి, కాత్యాయని విదుమహి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.