Mandarin language
-
ప్రపంచంలో శక్తిమంతమైన భాషలివే
న్యూయార్క్: ప్రపంచంలో నేడు ప్రజలు ఆరువేల భాషలను మాట్లాడుతున్నారు. వారిలో రెండువేల భాషలను మాట్లాడేవారు వెయ్యి మందికన్నా తక్కువున్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికే పరిమితం కాకుండా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక కార్యకాలాపాల్లో ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యం చేసేందుకు భాష ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని ఆరువేల భాషల్లో ఏ భాషలు శక్తివంతమైనవి? ఒకవేళ గ్రహాంతరవాసులు మన భూగ్రహంపై అడుగుపెడితే వారు ఏ భాష నేర్చుకుంటే వారు మనతో సులభంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగలరు? ఏ ప్రాతిపదికపైనా శక్తివంతమైన భాషను అంచనావేయాలి? జియాగ్రఫీ, అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం, ఎకానమీ, కమ్యూనికేషన్, నాలెడ్జ్, డిప్లమసీ అన్న కేటగిరీలను పరిగణలోకి తీసుకొని అత్యంత శక్తివంతమైన లేదా ప్రభావిత 20 భాషలను నిపుణులు లెక్కించారు. అందరూ ఊహించినట్లుగా ఇంగ్లీషుకు మొదటిస్థానంరాగా, ఆశ్చర్యంగా మండారిన్ ద్వితీయ భాషగా, హిందీ పదవ భాషగా ఎంపికయింది. మండారిన్ తర్వాతా వరుసగా స్థానాలను ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రష్యన్, జర్మన్, జపాన్, పోర్చుగీస్ భాషలు ఆక్రమించుకున్నాయి. మొత్తం ప్రపంచంలో ఆర్థికంగా పది శక్తివంతమైన దేశాల్లో నాలుగు దేశాలకు ఇంగ్లీషే అధికార భాష. వాటిల్లో మొత్తం ఎనిమిది దేశాలకు ఇంగ్లీషు భాష బాగా వచ్చు. బ్రిటీష్ పాలన వల్ల ప్రపంచంలో ఎక్కువ దేశాలకు ఇంగ్లీషు భాష విస్తరించగా ఆ తర్వాత ప్రపంచీకరణ వల్ల ఇంగ్లీషుకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భాషా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా అనువదించుకునే వెసలుబాటు రావడమె ఇందుకు కారణం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 2050 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన భాషలు ఏవవుతాయన్న అంశాన్ని కూడా నిపుణులు అంచనా వేశారు. ఇంగ్లీషు, మండారిన్ ఆక్రమించిన మొదటి రెండు స్థానాల్లో మార్పులు లేకపోయినా మిగతా వాటిల్లో మార్పులు ఉంటాయి. మూడవ స్థానానికి స్పానిష్, తొమ్మిదవ స్థానానికి హిందీ చేరుకునే అవకాశం ఉంది. -
రీల్ గజనీ కాదు... రియల్‌గానే..!
ఓ వ్యక్తి ఉంటాడు. అతనికి సడెన్‌గా ఏదో ప్రమాదం సంభవిస్తుంది. కోమాలోకి వెళ్లిపోతాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ లోకంలోకి వస్తాడు. కానీ తనకి గతానికి సంబంధించిన విషయాలు ఎంతకీ గుర్తు రావు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. కానీ నిజజీవితంలో అలాంటిది జరిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! అందుకే మరి బెన్ మెక్ మెహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియాకి చెందిన ఇరవై రెండేళ్ల యువకుడు బెన్ మెక్ మెహాన్. చాలా హుషారైన వాడు. స్నేహితులతో షికార్లు, అల్లర్లు, పార్టీలు... అందరిలానే సంతోషంగా ఉండేవాడు. కానీ 2012లో అతడి జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. చనిపోవాల్సినవాడే... కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మూసిన కన్ను తెరవకుండా మంచం మీదే పడి వున్నాడు. బహుశా అతడు ఇక కోమాలోంచి బయట పడకపోవచ్చేమోననుకున్నారు వైద్యులు. కానీ ఓ వారం పదిరోజుల తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోమాలోంచి బయటపడ్డాడు బెన్. కానీ అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఒకటి జరిగింది. కళ్లు తెరచినప్పటి నుంచీ బెన్ మాండరిన్ భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటివరకూ అతడికి ఆ భాష రాదు. ఆంగ్లంలోనే మాట్లాడేవాడు. కానీ ఉన్నట్టుండి ఆ భాషను అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నాడో అర్థమవ్వలేదు అతడి కుటుంబ సభ్యులకి. మాండరిన్ అనేది చైనాలోని ఓ సమూహం మాట్లాడే భాష. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు చైనాకు వెళ్లినా, అక్కడి భాష మాత్రం రాదు బెన్కి. అందుకే తమ కొడుకు ఆ భాష ఎలా మాట్లాడుతున్నాడో అంతు పట్టలేదు వారికి. వైద్యులు కూడా ఎంతగా ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. కట్ చేస్తే... బెన్ ఓ చైనీస్ చానెల్లో యాంకర్‌గా చేరాడు. మాండరిన్ భాషను గలగలా మాట్లాడేస్తూ మతులు పోగొట్టేస్తున్నాడు. ‘ఇదెలా సాధ్యం బెన్’ అంటే... ‘ఏమో... నాకా భాష అంత బాగా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు, ఎలాగూ వచ్చింది కాబట్టి క్యాష్ చేసుకుంటున్నా’ అంటున్నాడు నవ్వుతూ. వైద్యులు మాత్రం ఈ అద్భుతం ఎలా జరిగిందా అని ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉండటం కొసమెరుపు!