ప్రపంచంలో శక్తిమంతమైన భాషలివే
ప్రపంచంలో శక్తిమంతమైన భాషలివే
Published Fri, Dec 9 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
న్యూయార్క్: ప్రపంచంలో నేడు ప్రజలు ఆరువేల భాషలను మాట్లాడుతున్నారు. వారిలో రెండువేల భాషలను మాట్లాడేవారు వెయ్యి మందికన్నా తక్కువున్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికే పరిమితం కాకుండా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక కార్యకాలాపాల్లో ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యం చేసేందుకు భాష ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రపంచంలోని ఆరువేల భాషల్లో ఏ భాషలు శక్తివంతమైనవి? ఒకవేళ గ్రహాంతరవాసులు మన భూగ్రహంపై అడుగుపెడితే వారు ఏ భాష నేర్చుకుంటే వారు మనతో సులభంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగలరు? ఏ ప్రాతిపదికపైనా శక్తివంతమైన భాషను అంచనావేయాలి? జియాగ్రఫీ, అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం, ఎకానమీ, కమ్యూనికేషన్, నాలెడ్జ్, డిప్లమసీ అన్న కేటగిరీలను పరిగణలోకి తీసుకొని అత్యంత శక్తివంతమైన లేదా ప్రభావిత 20 భాషలను నిపుణులు లెక్కించారు.
అందరూ ఊహించినట్లుగా ఇంగ్లీషుకు మొదటిస్థానంరాగా, ఆశ్చర్యంగా మండారిన్ ద్వితీయ భాషగా, హిందీ పదవ భాషగా ఎంపికయింది. మండారిన్ తర్వాతా వరుసగా స్థానాలను ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రష్యన్, జర్మన్, జపాన్, పోర్చుగీస్ భాషలు ఆక్రమించుకున్నాయి. మొత్తం ప్రపంచంలో ఆర్థికంగా పది శక్తివంతమైన దేశాల్లో నాలుగు దేశాలకు ఇంగ్లీషే అధికార భాష. వాటిల్లో మొత్తం ఎనిమిది దేశాలకు ఇంగ్లీషు భాష బాగా వచ్చు. బ్రిటీష్ పాలన వల్ల ప్రపంచంలో ఎక్కువ దేశాలకు ఇంగ్లీషు భాష విస్తరించగా ఆ తర్వాత ప్రపంచీకరణ వల్ల ఇంగ్లీషుకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భాషా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా అనువదించుకునే వెసలుబాటు రావడమె ఇందుకు కారణం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 2050 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన భాషలు ఏవవుతాయన్న అంశాన్ని కూడా నిపుణులు అంచనా వేశారు. ఇంగ్లీషు, మండారిన్ ఆక్రమించిన మొదటి రెండు స్థానాల్లో మార్పులు లేకపోయినా మిగతా వాటిల్లో మార్పులు ఉంటాయి. మూడవ స్థానానికి స్పానిష్, తొమ్మిదవ స్థానానికి హిందీ చేరుకునే అవకాశం ఉంది.
Advertisement
Advertisement