mandhani
-
ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్
హైదరాబాద్: నా మీద కేసులు ఉన్నాయని చెబుతున్నావ్..అవి నువ్వు(పుట్టా మధు), నీ అనుచరులు పెట్టిన కేసులేనని మంథని మాజీ ఉప సర్పంచ్, పుట్టా మధు బాధితుడు సతీష్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సతీష్ విలేకరులతో మాట్లాడుతూ..అడవిలో ఉన్న ఎమ్మెల్యే అంటున్నావ్..ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించావ్ అని పుట్టా మధుని సతీష్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను పుట్టా మధుపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మధు మీద ఫిర్యాదు చేసి 3 నెలలు అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని అడిగారు. మంథనిలో ఉన్న మీడియాను తన కనుసన్నల్లో మేనేజ్ చేస్తున్నారని..అందుకే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే తనకు పుట్టా మధుతో ప్రాణ హాని ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. బీసీ ఎమ్మెల్యే ముసుగులో ఎంతో మందిని అణచివేశారని ఆరోపించారు. పుట్టా మధుపై 6 కేసులు నమోదయ్యాయని, ప్రజలందరూ చూస్తుండగానే ఎస్ఐపై కండువా వేశారని, అది తప్పుకాదా అని ప్రశ్నించారు. గుండా నాగరాజు కేసులో పుట్టా మధు ముమ్మాటికీ నిందితుడేనని, గుండా బలిదానం వల్లే పుట్టా మధు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పారు. అప్పటి స్థానిక ఎస్ఐ వల్ల కేసు నుంచి పుట్టా మధు తప్పించుకున్నాడని, అదే ఎస్ఐ ఇప్పుడు మంథని సీఐగా ఉన్నాడని వెల్లడించారు. పుట్టా మధు చెబుతున్నట్లు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పుట్టా మధుకు రూ.900 కోట్ల ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నించారు. తన వెనక మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారన్నది అవాస్తవమన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి లైసెన్స్ ఇస్తుందని విమర్శించారు. -
భర్తే కాలయయుడు
మంథని: అదనపు కట్నం కోసం కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. తల్లితో కలిసి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఐదు రోజులుగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్య ఈనెల 10 తుదిశ్వాస విడిచింది. సంధ్య మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ మృతురాలి బంధువులు దాదాపు 20 గంటల పాటు ఆందళన చేశారు. ఎస్సై, ఇరు గ్రామాల పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఆరెళ్ల క్రితం పెళ్లి మంథని మండలం అడ్య్రాల గ్రామానికి చెందిన మల్లవేన సంతోష్(చంటి)తో కాల్వశ్రీరాంపూర్ మండలం పాతమడిపెల్లికి చెందిన సంధ్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రణీత్(5), ప్రణయ్(3) కొడుకులు. అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడని సంధ్య తల్లి నరెడ్ల స్వరూప తెలిపారు. ఈక్రమంలోనే వేధింపులు ఎక్కువైతే తనకున్న 24 గుంటల భూమి అమ్మి రూ.8లక్షలు, బంగారం ముట్టజెప్పానని రోదిస్తూ తెలిపింది. మనుమడి పుట్టిన రోజున బంగారం కావాలంటే అప్పగించానని చెప్పింది. ఈనెల 5న భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త సంతోష్, తన తల్లితో కలిసి తమ కూతురు చేతులు వెనక్కి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించారని రోదిస్తూ వివరించింది. తమకు మాత్రం గ్యాస్‌స్టౌవ్ అంటుకుందని తెలిపారని కన్నీటిపర్యంతమైంది. కాలిన గాయాలతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన కూతురు అసలు విషయం చెప్పిందని పేర్కొంది. ఈనెల 10న తుదిశ్వాస విడిచిన సంధ్య మృతదేహానికి 11న పోస్టుమార్టం నిర్వహించి గ్రామానికి తీసుకొచ్చారు. సంధ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. మంథని ఎస్సై ఉపేందర్‌రావు గ్రామానికి చేరుకుని ఇరు గ్రామాల పెద్దలు కలుగజేసుకోవడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఏసీబీ నుంచి తప్పించుకున్న ఆర్ఐ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మంథని ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి తృటిలో ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.కోటేశ్వరరావు బుధవారం ఓ రైతు నుంచి రూ.50వేలు లంచం తీసుకున్నాడు. బాధితుడి సమాచారంతో ముందస్తు పథకం ప్రకారం అధికారులు వచ్చి సీనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకునేలోపే అతడికి విషయం తెలుసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీ వలలో.. మంథని హౌసింగ్ డీఈ
మంథని, న్యూస్‌లైన్ : ఇల్లు కట్టుకొమ్మని ముగ్గు పోసిన అధికారులే... మీ ఇల్లు పెద్దగా ఉంది బిల్లు ఇవ్వబోమంటూ తిరకాసు పెట్టారు. ఇల్లు కట్టుకున్నాం బిల్లు మంజూరు చేయమంటే వేధించారు. భరించలేని ఆ బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో ఆ లంచావతారి అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం... ముత్తారం గ్రామానికి చెందిన గుడి వసంత పేరిట 2008లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. 13 నెలల క్రితం హౌసింగ్ అధికారులే ముగ్గు పోసి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింపజేశారు. నిర్మాణం పూర్తయి ఏడాది గడిచినా పైసా బిల్లు రాలేదు. ఇల్లు పెద్దగా ఉందంటూ తిరకాసు పెట్టారు. కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించలేదు. బిల్లు మొత్తం రూ.68 వేలు చెల్లించాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని మంథని హౌసింగ్ డీఈ వెంకటేశం డిమాండ్ చేశారు. మొదటిదశ బిల్లు రూ.17,500 మంజూరు కోసం రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వసంత భర్త కొండల్‌రెడ్డి... ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు గురువారం మంథనిలోని గృహ నిర్మాణశాఖ కార్యాలయంలో కొండల్‌రెడ్డి నుంచి డీఈ రూ.5 వేలు లంచం తీసుకుంటుండడగా డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఈని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందిరమ్మ బిల్లుల గురించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. హౌసింగ్ అధికారులు ముగ్గు పోసి చెప్పినట్లే ఇల్లు కట్టుకుంటే... ఇప్పుడు బాగా పెద్దగా ఉన్నదని అంటున్నరు. బిల్లు కోసం వర్క్ ఇన్స్పెక్టర్ను అడిగితే ఏఈని, ఆయన దగ్గరకు పోతే డీఈ దగ్గరకు వెళ్లాలని తిప్పించుకుంటున్నారు. డీఈని కలిస్తే ఈఈ దగ్గరకు వెళ్లాలంటున్నారు. మూడో విడత రచ్చబండలో ఈఈని కలిసి చెప్పగా డీఈనే బిల్లు ఇస్తాడని చెప్పాడు. దీంతో మళ్లీ డీఈ దగ్గరకు పోగా... ఇల్లు పెద్దగా ఉందని, బిల్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిండ్రు. 15 రోజులు ఆగి మళ్లీ వెళ్తే 15 వడ్ల బస్తాలు అడిగిండ్రు. అంత ఇచ్చుకోలేనంటే బిల్లుల్లో పిఫ్టీ పిఫ్టీ ఇవ్వమన్నరు. 15 వేలకు బేరం కుదుర్చుకుని మొదటి బిల్లు మంజూరుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నా. కష్టపడి కట్టుకున్న ఇల్లుకు ఇంత ఇబ్బంది పెట్టే అధికారులను ఎందుకు విడిచిపెట్టాలని, ఏసీబోళ్లనుకలిసా... - గుడి కొండాల్‌రెడ్డి, బాధితుడు, ముత్తారం సాంకేతిక లోపం ఆన్లైన్లో సాంకేతిక లోపం వల్లే బిల్లు రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత బిల్లును ఆన్లైన్లో పెట్టా. లబ్ధిదారును ఏనాడు ఒక్కపైసా డిమాండ్ చేయలేదు. అకస్మాత్తుగా వచ్చి తన ముందు డబ్బులు పెట్టిండు. నేను ఏ పాపం ఎరుగను. - వెంకటేశం, డీఈ, మంథని ఇదే మొదటిసారి కాదు... మంథని : లంచం తీసుకుంటూ పట్టుబడిన హౌసింగ్ డీఈ వెంకటేశంది అవినీతిలో అందెవేసిన చెయ్యే. మంథని డీఈగా సుదీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న ఈయన లబ్ధిదారుల సొమ్ము దిగమింగిన సందర్భాలు అనేకం. మల్హర్ మండలం నాచారం, అన్సాన్పల్లిలో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల బిల్లుల చెల్లింపులో రూ.2 లక్షలకు పైగా కాజేసిన కేసులో డీఈ వెంకటేశంతోపాటు అప్పటి ఏఈ లింగమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌పై కేసు నమోదైంది. మల్హర్ మండలం అన్సాన్పల్లికి చెందిన భూక్యా రఘు అనే లబ్ధిదారుకు చెందిన రూ.64 వేలు కాజేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఒక్క గ్రామంలో 20 మంది లబ్ధిదారుల బిల్లులను డీఈ కిందిస్థాయి అధికారులతో కలిసి కాజేశారనే ఆరోపణలున్నాయి. ఆయనను అప్పుడే విధుల నుంచి తప్పించి మరోచోటికి బదిలీ చేయాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇష్టమొచ్చినట్లుగా వసూళ్లకు పాల్పడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.