mandya Former MP Ramya
-
రమ్యపై చర్యలకు డిమాండ్
బెంగళూరు: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండ్య పర్యటన సందర్భంలో రైతు కుటుంబానికి అందజేసిన చెక్ విషయమై గందరగోళానికి కారకులైన మాజీ ఎంపీ, నటి రమ్యా పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ హైకమాండ్‌ను కోరారు. ఈ ఘటనపై కాంగ్రెస్ హైకమాండ్ నివేదిక కోరిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్.... రమ్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మండ్య పర్యటన సందర్భంలో రమ్య అనుసరించిన తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు చే యాల్సిందిగా ఆయన బి.కె.హరిప్రసాద్‌ను కోరారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో ఎస్.టి.సోమశేఖర్ మాట్లాడుతూ...‘రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంలో కేపీసీసీ తరఫున నేను మీడియా విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించాను. ఆయన పర్యటనలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయితే మండ్యలోని బాధిత రైతు కుటుంబానికి అందజేసిన చెక్ విషయంలో మాత్రం గందరగోళం చెలరేగింది. పార్టీ సిద్ధాంతాలు తెలియని ఇలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించరాదు. ఈ గందరగోళానికి కారకులైన రమ్యకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. లేదంటే పార్టీ కోసం శ్రమించే నిజమైన కార్యకర్తలను పోగొట్టుకోవాల్సి ఉంటుంది’ అని ఎస్.టి.సోమశేఖర్ పేర్కొన్నారు. -
లండన్‌లో రమ్య
* రాజకీయ శిక్షణ కోసం * డిసెంబర్ మొదటి వారంలో తిరిగి రాక * రమ్య తల్లి రంజితా వెల్లడి మండ్య : రాజకీయ రంగంలో మరిన్ని మెళకువలను నేర్చుకోవడానికి సినీనటి, మండ్య మాజీ ఎంపీ రమ్య లండన్‌కు వెళ్లినట్లు ఆమె తల్లి రంజితా తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ మూడు నెలల కోర్సు చేస్తోందని, డిసెంబర్ నెల మొదటి వారంలో తిరిగి మండ్యకు వస్తుందని చెప్పారు. రమ్య కర్ణాటకను వీడి ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన రమ్య ఇక తిరిగి రారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. త్వరలోనే రమ్య కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారని చెప్పారు. రమ్య ఎంపీగా ఉన్న సమయంలో మండ్య జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టారని వివరించారు. గత ఎన్నికల్లో ఓడినా రమ్య బాధపడలేదని, కార్యకర్తలపై ఆపార నమ్మకంతో మళ్లీ తిరిగి వస్తోందని చెప్పారు.