ఫోర్టిస్‌కు రూ.6,322 కోట్లిస్తాం!
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మరింత మొత్తాన్ని ఆఫర్ చేసింది. కొనుగోలు విలువను రూ.6,322 కోట్లకు పెంచింది. స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఫోర్టిస్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. హాస్పిటల్ వ్యాపారం విలువ రూ.5,003 కోట్లకు అదనంగా రూ.1,319 కోట్లను ప్రీమియం రూపంలో చెల్లించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. అన్ని బిడ్డింగ్ ఆఫర్లను పరిశీలించి సిఫారసు చేసేందుకు ఫోర్టిస్ బోర్డ్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బోర్డు భేటీకి ముందే మణిపాల్ తన ఆఫర్‌ను సవరించడం గమనార్హం. రూ.750 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని తాజాగా ప్రతిపాదించింది. డెట్ ఫైనాన్స్ లేదా ఫోర్టిస్‌కు రుణాలిచ్చిన సంస్థలకు గ్యారంటీ, కంఫర్ట్ లేఖల రూపంలో ఈ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
మణిపాల్/ టీపీజీ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు ఆఫర్‌ను సవరించడం ఇది రెండోసారి. మార్చి 27న మొదటి విడత రూ.5,003 కోట్లను చెల్లించేందుకు ముందుకు రాగా, ఈ నెల 10న రూ.6,061 కోట్లకు ఆఫర్నుపెంచింది. ఒక్కో షేరుకు రూ.155 ఇవ్వజూపింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలుకు కేకేఆర్ ఆధ్వర్యంలోని రేడియెంట్ లైఫ్ కేర్, మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, చైనాకు చెందిన ఫోసన్ హెల్త్‌కేర్ సైతం ఆసక్తితో ఉన్న విషయం విదితమే.